Indians Evacuation From Ukraine : ఉక్రెయిన్ నుంచి భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటికి ఆరు విమానాలు భారత్ కు చేరుకోగా.. మరిన్ని విమానాలు స్వదేశానికి వస్తున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల వద్దకు ఎలాగోలా చేరిన భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి వచ్చే మూడు రోజుల్లో భారతదేశం 26 విమానాలను నడపనుందని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. భారతీయ పౌరుల తరలింపు ప్రయత్నాలపై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇవాళ హై లెవల్ మీటింగ్ ముగిసన తర్వాత హర్షవర్ధన్ ష్రింగ్లా ఈ మేరకు ప్రకటించారు. భారత పౌరుల తరలింపు కోసం ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన రొమేనియాలోని బుకారెస్ట్, హంగేరీలోని బుడాపెస్ట్ తో పాటు, పోలాండ్ మరియు స్లోవాక్ రిపబ్లిక్ లోని విమానాశ్రయాలను కూడా ఉపయోగించుకుంటామని హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు.
భారత ప్రభుత్వం మొదటి అడ్వైజరీ జారీ చేసినప్పుడు ఉక్రెయిన్ లో 20,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు అంచనా. ఇందులో 60 శాతం మంది అంటే సుమారు 12,000 మంది అప్పటి నుండి ఉక్రెయిన్ ను విడిచిపెట్టారు. మిగిలిన 40 శాతం మందిలో.. దాదాపు సగం మంది ఖార్కివ్, సుమీ ప్రాంతంలోని సంఘర్షణ జోన్(Conflict Zone)లో ఉన్నారు. మిగిలిన సగం మంది ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దులకు కొంతమంది చేరుకోగా.. ఉక్రెయిన్ యొక్క పశ్చిమ భాగం వైపు మరికొందరు వెళుతున్నారు అని విదేశాంగ కార్యదర్శి అన్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థుల వీడియోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తడంతో ప్రభుత్వం గత రెండు రోజులుగా తరలింపు ప్రయత్నాలను వేగవంతం చేసింది. ప్రధాని మోదీ గత 48 గంటల్లో నాలుగు అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులకు సహాయం చేయడానికి ఓ ట్విట్టర్ హ్యాండిల్ కూడా ప్రారంభించబడింది. ఇక, తరలింపు ప్రకియ కోసం ప్రైవేట్ క్యారియర్లు స్పైస్ జెట్ మరియు ఇండిగోతో పాటు ఎయిర్ ఇండియా సేవలను పెంచారు. ఎయిర్ ఫోర్స్ విమానాలకు కూడా ప్రభుత్వం రంగంలోకి దించింది. వాయుసేనకు చెందిన సీ-17 విమానాలను ఇందుకు వినియోగించనున్నారు. దీని ద్వారా తక్కువ సమయంలో మరింత మందిని తరలించేందుకు వీలవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో రష్యా దాడి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి భారతీయులందరూ తక్షణమే ఆ నగరాన్ని వీడాలని ఇవాళ భారత ప్రభుత్వం హెచ్చరించింది. కీవ్ లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేశారు. మన దేశానికి చెందిన వారందరూ కీవ్ ను విడిచిపెట్టారు అని హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు.
మరోవైపు, ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు విదేశాంగశాఖ తెలిపింది. ఖార్కీవ్ ప్రాంతంలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన పేలుళ్లలో కర్ణాటకకు చెందిన నవీన్ జ్ఞానగౌడార్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందర్ బాగ్చి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flights, Russia-Ukraine War, Ukraine