మన వద్ద మద్యం ఫుల్ బాటిల్ ధర అటూ ఇటూగా రూ.1000 ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో అయితే ఇంకా తక్కువే ఉంటుంది. ఇక ప్రీమియమ్ మద్యం ధర రూ.10 వేల వరకు ఉంటుంది. కానీ ఇక్కడున్న మద్యం బాటిళ్లు ప్రపంచంలోనే ఖరీదైనవి. రెండు కేసుల మద్యం బాటిళ్లు ఏకంగా రూ.10 కోట్లు పలికాయి. అంటే ఒక్క మద్యం బాటిల్ ధర రూ. 43 లక్షలు. అసలు ఈ లిక్కర్ ఏం కంపెనీది? అంత రేటు ఎందుకనుకుంటారా? దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఇటీవలల అమెరికాలో సోత్‌బేస్ నిర్వహించిన వేలంలో చైనాకు చెందిన క్వీచో మోటె బైజు ( Kweichow Moutai baijiu) రికార్డు ధర పలికాయి. మొత్తం 24 బాటిళ్లను వేలానికి పెడితే ఆసియా ప్రాంతానికి చెందిన ఓ ఔత్సాహికుడు 1.4 మిలియన్ డాలర్లకు కొన్నాడు. అంటే భారత కరెన్సీలో రూ.10 కోట్లపైనే.
క్వీచో మోటె బైజు మద్యానికి చైనా నేషనల్ లిక్కర్‌గా పేరుంది. పాత కాలం నుంచే ఇది ఎంతో ఫేమస్. ముఖ్యంగా సంపన్నవర్గాలు, పాలకులు ఈ మద్యాన్ని ఎక్కువగా తీసుకునేవారు. సామాన్యులు అస్సలు కొనలేరు. 1972లో అప్పటి చైనా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్షన్కు దీని రుచి చూపించారు.అంతేకాదు 2013లో జిన్‌పింగ్ , అమెరికా ప్రెసిడెంట్ ఒబామాను కలిసిన సందర్భంగా ఈ మద్యాన్ని అందించారు. క్వీచో మోటె బైజు లిక్కర్ ఒక్క బాటిల్ ధర కనీసం 100 డాలర్లు ఉంటుంది. చైనీస్ ఈ కామర్స్ టోబోలో ఒక్కోసారి 8వేల డాలర్ల వరకూ వెళ్తుంది. మరి ఇప్పుడు ఒక్క బాటిల్ రూ.43 లక్షలకు ఎందుకు అమ్ముడయ్యిందనేగా మీ అనుమానం? దానికి ఓ కారణముంది.
సోత్బే వేలానికి పెట్టిన మద్యం బాటిళ్లు ఇప్పటివి కావు. చైనా కల్చరల్ రెవల్యూషన్ (1966-1976) మధ్య కాలంలో ఆ మద్యం ఉత్పత్తి చేశారు. క్వీచో మోటె బైజు లిక్కర్ బాటిళ్లపై సాధారణంగా ఫ్లయింగ్ ఫెయిరీ లోగో ఉంటుంది. కానీ అప్పుడు ఉత్పత్తి చేసిన బాటిళ్ల బ్యాచ్‌పై మాత్రం సన్ ఫ్లవర్ లోగోను ముద్రించారు. దేశమంతటా అల్లకల్లోలం నెలకొన్న ఆ పరిస్థితుల్లో.. ఫ్లైయింగ్ ఫెయిరీ లోగోను ముద్రించడం సరికాదని భావించి సన్ ఫ్లవర్ లోగో వేశారు. అలాంటి ప్రత్యకమైన పాత మద్యం బాటిళ్లను సోత్బేలో వేలం వేశారు. మొత్తం 24 బాటిళ్లు 2,76,000 నుంచి 5,52,000 డాలర్లు పలుకవచ్చని అంచనా వేశారు. కానీ అనూహ్య ధర పలికింది. వాటిని కొనేందుకు బిడ్డర్స్ పోటీ పడ్డారు. చివరకు ఓ వ్యక్తి ఏకంగా 1.4 మిలియన్ డాలర్లకు దక్కించుకున్నాడు.
బైజు కంపెనీ నుంచి ఎన్నో లిక్కర్ బ్రాండ్స్ ఉన్నాయి. కానీ క్వీచో మోటె మాత్రమే చాలా ఖరీదైనది. సజ్జలు, గోధుమలతో దీనిని తయారు చేస్తారు. ఇందులో ఆల్కాహాల్ శాతం 35 నుంచి 53 వరకు ఉంటుంది. మద్యం మాత్రమే కాదు.. క్వీచో మోటె బైజు చెందిన ఖాళీ లిక్కర్ బాటిళ్లు కూడా చాలా ఖరీదైనవి. గుయ్జూ ప్రావిన్స్‌కు చెందిన ఓ కుటుంబం 12 ఖాళీ బాటిళ్లను 38వేల డాలర్లకు అమ్మేసిందట. భారత కరెన్సీలో వాటి విలువ రూ.28 లక్షలు. ఆ డబ్బుతో బీజింగ్‌లోని ఓ ఇంటి కొనుగోలు కోసం డౌన్‌పేమెంట్ చెల్లించారట. దీని బట్టి క్వీచో మోటె బైజు లిక్కర్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, International, International news, Trending, Us news