దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయింది. మొదటి విడతగా పారిశుధ్య కార్మికులు, హెల్త్ వర్కర్లకు కొవిడ్ వ్యాక్సిన్ ను అందించనున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వాలు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నాయి. జ్వరం, నొప్పులు వంటి సైడ్ ఎఫెక్టులు వచ్చినా కంగారు పడొద్దని, వాటికి తగిన మాత్రలు వేసుకుంటే సరిపోతుందని వైద్యాధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. గర్భిణులు, 18ఏళ్ల లోపు వయసు వారు ఈ వ్యాక్సిన్ ప్రక్రియకు దూరంగా ఉండాలని సూచించారు. మన దేశం కంటే ముందే అమెరికా, యూకే, నార్వే వంటి దేశాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయింది. ఇప్పటికే ఆయా దేశాల్లో లక్షలాది మందికి వ్యాక్సిన్ ను అందించారు. అయితే నార్వేలో ప్రజలకు సరఫరా చేసిన టీకా విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యాక్సిన్ ను తీసుకున్న 23 మంది మరణించడంతో ఆ దేశంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
నార్వేలో మొదటి విడతగా ఫైజర్ మరియు బయో ఎన్ టెక్ వ్యాక్సిన్లను అందిస్తున్నారు. ఈ ఫైజర్ టీకాను తీసుకున్న వెంటనే 23 మంది వృద్ధులు మరణించారు. అయితే ఈ ఫైజర్ టీకాను తీసుకోవడం వల్లే వారు మరణించారా? లేక మరే ఇతర కారణమైనా ఉందా.? అన్నది ఇంకా తెలియరాలేదు. దీనిపై నార్వే సర్కారు విచారణకు ఆదేశించింది. చనిపోయిన 23 మందిలో 13 మందికి టీకా తీసుకున్న తర్వాత డయోరియా, జ్వరం వంటి సైడ్ ఎఫెక్ట్ లు వచ్చాయని అక్కడి వైద్యులు తెలిపారు. 80 ఏళ్ల వయసు పైబడిన వారు ఈ టీకాను తీసుకోకపోవడమే ఉత్తమమని నార్వే వైద్యాధికారులు చెబుతున్నారు. గతేడాది డిసెంబర్ నెల వరకు మొత్తం 30 వేల మందికి నార్వేలో ఒక్కో డోసు కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయిందని వెల్లడించారు.
‘80 ఏళ్ల వయసు పైబడిన వారు సాధారణంగా వివిధ రకాల అనారోగ్య లక్షణాలతో బాధపడుతుంటారు. వాళ్లు కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియకు దూరంగా ఉంటేనే మంచిది. వ్యాక్సిన్ తో సహజంగా వచ్చే సైడ్ ఎఫెక్టులు వారి పరిస్థితిని మరింత తీవ్రం చేయవచ్చు. ప్రస్తుతం 23 మంది చనిపోవడానికి కూడా వారి అనారోగ్య లక్షణాలు కూడా కారణమయి ఉండవచ్చు. ఈ విషయమై ప్రస్తుతం విచారణ జరుగుతోంది‘ అని నార్వే వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ 23 మంది కాకుండా మరో 21 మంది మహిళలకు, 8 మంది పురుషుల్లోనూ సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. మరో తొమ్మిది మందిలో అలర్జీ, తీవ్రమైన జ్వరం లాంటి లక్షణాలు బయటపడ్డాయి. మరో వైపు ఫైజర్ టీకాను ఉత్పత్తి చేసిన సంస్థ కూడా ఈ విషయమై స్పందించింది. నార్వేలో ఇప్పటికే 30 వేల మందికి మొదటి విడతగా ఒక్కో డోసును అందించామని తెలిపింది. చనిపోయిన వారంతా వృద్ధులేననీ, వారిలో ఉన్న సహజ అనారోగ్య కారణాలు కూడా వారి మరణానికి కారణమయి ఉండొచ్చని అభిప్రాయపడింది. అదే సమయంలో యూరప్ దేశాలకు తమ వ్యాక్సిన్ సరఫరాను తగ్గిస్తామని ఆ సంస్థ స్పష్టం చేసింది.
Published by:Hasaan Kandula
First published:January 16, 2021, 16:17 IST