Home /News /international /

20TH ANNIVERSARY OF 9 11 HERE IS A TIMELINE HOW TERRORISTS ATTCK THAT DAY SU

20th Anniversary of 9/11: ఆ చీకటి రోజుకు 20 ఏళ్లు.. 2001 సెప్టెంబర్ 11న ఉగ్రవాదులు ఎలా దాడి చేశారంటే..

వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ ఉగ్రదాడి(ఫైల్ ఫొటో)

వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ ఉగ్రదాడి(ఫైల్ ఫొటో)

నేటితో 9/11 మరణహోమానికి 20 ఏళ్లు(20th Anniversary of 9/11) పూర్తి కానున్న వేళ.. ఆ రోజు అమెరికాలో అసలు ఏం జరిగిందో చూద్దాం..

  అది 2001 సెప్టెంబర్ 11.. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్‌ఖైదా పక్కా వ్యుహంతో జరిపిన ఉగ్రదాడి.. జనాలను భయకంపితులను చేసింది. ఇది చరిత్రలో ఉగ్రవాదులు జరిపిన అతిపెద్ద దాడిగా నిలిచింది. దాదాపు 3వేల మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో వేలాది మంది గాయపడ్డారు. అంతేకాకుండా ఆ సమీప ప్రాంతాలలోని ప్రజల ఆరోగ్యంపై ఈ ఉగ్రదాడి తీవ్ర ప్రభావం చూపింది. ఆ సన్నివేశాలను కళ్లారా చూసిన కొందరు.. ఆ దృశ్యాలను తలచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుందని వాపోతున్నారు. నేటితో 9/11 మరణహోమానికి 20 ఏళ్లు(20th Anniversary of 9/11) పూర్తి కానున్న వేళ.. ఆ రోజు అమెరికాలో అసలు ఏం జరిగిందో చూద్దాం..

  ఆ రోజు ఏం జరిగింది.. అల్‌ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ నేతృత్వంలో అమెరికాలో నాలుగు చోట్ల విమానాలతో దాడి చేసేందుకు ప్రణాళికలు రచించారు. ప్లాన్ ప్రకారం 19 మంది ఉగ్రవాదులు నాలుగు జట్లుగా విడిపోయి మొత్తం నాలుగు విమానాలను హైజాక్ చేశారు. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి దాడులకు అంతా సిద్దం చేసుకున్నారు. మొదట ఓ విమానంతో అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 8.46కు నార్త్ టవర్‌ను ఢీకొనగా, రెండో విమానం ఉదయం 9.03 నిమిషాలకు సౌత్ టవర్‌లోకి దూసుకెళ్లింది. దీంతో ట్విన్‌ టవర్స్‌ చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. మంటలు, దట్టమైన పొగ, ఆర్తనాదాలు.. ఆ ప్రాంతం మొత్తం జనాల ఆర్తనాదాలతో నిండిపోయింది. ట్విన్ టవర్స్ పరిసర ప్రాంతాల్లోని బిల్డింగ్‌లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను పలువురు తమ కెమెరాల్లో బంధించారు.

  9/11 Attacks: ప్రపంచం ఉలిక్కిపడేలా చేసిన ఉగ్రదాడికి 20 ఏళ్లు.. 2001 నుంచి ఇప్పటివరకు జరిగిన కీలక ఘట్టాలు ఇవే..

  ఆ ప్రాంతంలో కొన్నిచోట్ల వందల డిగ్రీల ఉష్ణం చోటుచేసుకుంది. చాలా మంది ఆ మంటల్లో కాలిపోయారు. కొందరు ఏం చేయాలో తెలియక పై నుంచి దూకేశారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతారు. ఈ ఉగ్రదాడి నుంచి జనాలను రక్షించేందుకు యత్నించిన పలువురు అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ప్రఖ్యాత ట్విన్ టవర్స్ కుప్పకూలిపోయారు.

  మూడో విమానం అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9.37 నిమిషాలకు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ పశ్చిమం వైపు భాగాన్ని ధ్వంసం చేసింది. నాలుగో విమానం ఉదయం 10.03 నిమిషాలకు పెన్సిల్వేనియాలో కూలిపోయింది. ఈ విమానంతో వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనాన్ని ఢీకొట్టాలని హైజాకర్లు ప్లాన్ వేసినట్టుగా భావిస్తారు.

  ఇక, ట్విన్ టవర్స్‌పై దాడి జరిగిన సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్.. ఫ్లోరిడాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో కార్యక్రమానికి హాజరయ్యారు. బుష్ పిల్లలతో ముచ్చటిస్తున్న సమయంలో అప్పటి వైట్ హౌజ్‌ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రూ కార్డ్ బుష్ చెవిలో చెప్పారు. అయితే అక్కడ పిల్లలు ఆందోళన చెందకుడదనే ఉద్దేశంతో సమయం పాటించని.. వీలైనంత త్వరగా ఆ కార్యక్రమాన్ని ముగించిన అక్కడి నుంచి బయటకు వచ్చారు.

  ఇక, మొత్తం ఈ దాడుల్లో 93 దేశాలకు చెందిన 2,977 మంది మరణించారు. న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద దాడిలో 2,753 మంది మృతిచెందారు. పెంటగాన్‌లో 184 మంది మరణించారు. పెన్సిల్వేనియాలో కుప్పకూలిన ఫ్లైట్ 93 లో 40 మంది మరణించారు.

  ఇక, ఈ దాడులకు అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ అఫ్గానిస్తాన్‌లో ప్రణాళిక వేసినట్టుగా అమెరికా నిర్ధారణకు వచ్చింది. దీంతో అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుస్.. తాలిబన్ల పాలనలో అఫ్గాన్‌‌లో అమెరికా కాలుమోపాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే బిన్ లాడెన్‌తో పాటు పలువురు ఉగ్రవాదులను అమెరికా బలగాలు మట్టుబెట్టాయి. అయితే దాదాపు 20 ఏళ్ల పాటు అఫ్గాన్‌లోనే ఉన్న అమెరికా, దాని మిత్రదేశాల బలగాలు.. 2021 ఆగస్టు 30వ తేదీన అఫ్గాన్‌ను పూర్తిగా ఖాళీ చేశాయి. తాలిబన్లతో కుదిరిన ఒప్పందంలో భాగంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే అఫ్గాన్‌ను తమ చేతుల్లోకి తీసుకన్న తాలిబన్లు.. అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Taliban, Terror attack, USA

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు