అగ్రరాజ్యం అమెరికాలో ఎటుచూసినా నెత్తుటిపాతం ఘటనలు జరుగుతున్నాయి. ఒకటి తర్వాత మరొకటిగా వేర్వేరు రాష్ట్రాల్లో వరుస ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజా సంఘటన భారతీయులు ఎక్కువగా నివసించే టెక్సాస్ లోని హ్యూస్టన్ లో జరిగింది. (Houston shootong) స్థానిక మీడియా, పోలీసులు చెప్పిన వివరాలివి..
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. న్యూయార్క్‌లోని బఫెలో ప్రాంతంలో చోటు చేసుకున్న కాల్పుల ఘటన (Buffalo Mass Shooting) మరవక ముందే మరో రెండు ప్రాంతాల్లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. టెక్సాస్ రాష్ట్రంలోని అతిపెద్ద నగరం హ్యుస్టన్ లో ఓ మార్కెట్‌లో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
హ్యూస్టన్ బహిరంగ మార్కెట్‌లో విచ్చలవిడి కాల్పులకు దారి తీసిన కారణాలను పోలీసులు వెల్లడించారు. న్యూయార్క్ మాదిరిగా ఇది మోటివేటెడ్ హింస కాదని, రెండు గ్రూపుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణమే కాల్పులకు దారి తీసిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని, వారిద్దరి నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. హ్యూస్టన్ కాల్పుల ఘటనలో చనిపోయినవారు, గాయపడ్డవారు, కాల్పులు జరిపినవారు అంతా 20 ఏళ్లలోపు యువకులేనని పోలీసులు చెప్పారు. అటు న్యూయార్క్ జాత్యహంకార కాల్పుల ఘటనలోనూ నిందితుడు 18 ఏళ్ల వాడు కావడం గమనార్హం.
న్యూయార్క్ రాష్ట్రంలో న్యూయార్క్ సిటీ తర్వాత రెండో అతిపెద్ద నగరం బఫెలోలో శనివారం(స్థానిక కాలమానం ప్రకారం) 18 ఏళ్ల తెల్ల జాతి యువకుడు నల్లజాతీయులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోరానికి పాల్పడుతున్న సమయంలో నిందితుడు లైవ్ స్ట్రీమింగ్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. న్యూయార్క్‌లోని బఫెలో ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్‌లో ఈ దారుణం జరిగింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Shooting, Us shooting, USA