కుప్పకూలిన స్కూల్ భవనం..10 మంది మృతి..శిథిలాల కింద మరో 100 మంది

ప్రమాదానికి గురైన భవనంలో మూడో అంతస్తులో స్కూల్ నిర్వహిస్తున్నారు. మిగిలిన రెండు ఫ్లోర్లలో నివాస గృహాలు ఉన్నాయి. స్కూల్‌కు 100 మంది చిన్నారులు హాజరైనట్లు సమాచారం. వారితో నివాస గృహాల్లో ఉన్న వాళ్లు సైతం శిథిలాల కింద చిక్కుకుపోయారు.

news18-telugu
Updated: March 14, 2019, 4:38 PM IST
కుప్పకూలిన స్కూల్ భవనం..10 మంది మృతి..శిథిలాల కింద మరో 100 మంది
సహాయక చర్యలు
  • Share this:
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. మూడంతస్తుల స్కూల్ భవనం కుప్పకూలి పది మంది విద్యార్థులు చనిపోయారు. మరో 100 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నైజీరియా వాణిజ్య రాజధాని లాగోస్‌లోని ఇటా-ఫాజి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని..గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదానికి గురైన భవనంలో మూడో అంతస్తులో స్కూల్ నిర్వహిస్తున్నారు. మిగిలిన రెండు ఫ్లోర్లలో నివాస గృహాలు ఉన్నాయి. స్కూల్‌కు 100 మంది చిన్నారులు హాజరైనట్లు సమాచారం. వారితో నివాస గృహాల్లో ఉన్న వాళ్లు సైతం శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది చిన్నారులను ప్రాణాలతో కాపాడినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

అంబులెన్స్‌లు, ఫైర్ ట్రక్స్ రాకపోకలు, గుమిగూడిన జనాలతో ఘటనా స్థలంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. విద్యార్థుల ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఇక మృతుల కుటంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. లాగోస్‌లో రెడ్ క్రాస్‌కు చెందిన ప్రత్యేక బృందాలు చేరుకొని వైద్యసేవలు అందిస్తున్నారు.

నైజీరియాలో భవనాలు కూలిన సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. 2016లో నైజీరియాలో ఓ చర్చి కూలి 100 మంది చనిపోయారు. అదే ఏడాది లాగోస్ ద్వీపంలో ఓ భవనం కూలిపోయింది. ఆ ప్రమాదంలో సుమారు 30 మంది మరణించారు.వీడియో కోసం ఇక్కడ చూడండి:
First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు