2020 ఏడాదిలో కరోనా(coronavirus) మహమ్మారి ప్రపంచానికి చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. చైనాలోని వుహాన్(Wuhan) నగరంలో ప్రారంభమైన ఈ మహమ్మారి క్రమంగా ప్రపంచమంతటా వ్యాపించి, మునుపెన్నడూ ఊహించని విధంగా విలయాన్ని సృష్టించింది. దాదాపు ఈ ఏడాదంతా లాక్డౌన్లు, మాస్కులు, శానిటైజర్లతో గడపాల్సి వచ్చింది. ఇప్పటికీ ప్రపంచం ఆ మాయదారి మహమ్మారి బారి నుంచి బయటపడలేకపోతున్నది. వ్యాక్సిన్ పై ఆశలు పెరుగుతున్నా.. కరోనా దాని రూపాలను మార్చుకుంటున్నది. ఇదిలాఉంటే.. 2020 ఏడాది కరోనాతో పాటు అనేక విలయాలకు సాక్షాత్కారమైంది. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.
అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు
జనవరి 3న బాగ్దాద్(Baghdad) అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన వైమానిక దాడిలో ఇరాన్ ఎలైట్ కుడ్స్ ఫోర్స్ అధినేత జనరల్ కస్సేమ్ సోలైమాని (Qassem Soleimani) హత్యగావించబడ్డాడు. దీంతో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ వైమానిక దాడి అమెరికానే చేసిందని పెంటగాన్ ధృవీకరించింది. దీంతో, సోలైమానిని చంపినందుకు ఇరాన్ తిరిగి అమెరికాపై దాడి చేయడంతో ఉద్రిక్తతలు పెరిగాయి.
కోబి బ్రయంట్ మరణం
జనవరి 26న, బాస్కెట్‌బాల్(Basketball) లెజెండ్ కోబి బ్రయంట్ మరణంతో క్రీడా ప్రపంచం విషాదంలో మునిగింది. అంతర్జాతీయ స్టార్డమ్ బాస్కెట్‌బాల్ ఆల్-టైమ్ గ్రేట్ ప్లేయర్లలో ఒకరైన కోబి బ్రయంట్(Kobe Bryant), తన 13 ఏళ్ల కూతురుతో సహా హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. లాస్ ఏంజిల్స్(Los Angeles) సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో తన కూతురుతో సహా మరో ఏడుగురు కూడా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు, ప్రముఖులు, నాయకులు, అసంఖ్యాక అభిమానులు బ్రయంట్ మరణానికి సంతాపం వ్యక్తం చేశారు.
హార్వే వైన్స్టెయిన్ లైంగిక వేధింపులు
హాలీవుడ్ మాజీ నిర్మాత హార్వీ వైన్స్టెయిన్(Harvey Weinstein)పై ఫిబ్రవరిలో ఒక జ్యూరీ విజేత లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఒకప్పుడు హాలీవుడ్‌లోని అత్యంత శక్తివంతమైన నిర్మాతల్లో ఒకరైన 67 ఏళ్ల వైన్స్టెయిన్ 2006లో మాజీ ప్రొడక్షన్ అసిస్టెంట్ మిమి హలేయిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో, 2013లో నటి జెస్సికా మన్పై అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారించబడ్డాడు. దీంతో అతడికి 23 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. వైన్స్టెయిన్ కేసు #MeToo ఉద్యమం ప్రారంభానికి ఒక మైలురాయిగా నిలిచింది.
కరాచీ విమాన ప్రమాదం
మే నెలలో కరాచీ(Karachi)లోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 99 మంది ప్రయాణిస్తున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 97 మంది మృతి చెందగా, ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. లాహోర్(Lahore) వస్తున్న ఈ విమానం కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వబోతున్న సమయంలో కుప్పకూలింది.
బీరుట్ నౌకాశ్రయంలో పేలుడు
ఆగస్టు నెలలో లిబనోన్ దేశ రాజధాని బీరుట్(Beirut) నౌకాశ్రయంలో జరిగిన భారీ పేలుడుతో 190 మంది మరణించారు. ఈ ఘటనలో వేలాది మంది గాయపడ్డారు. ఈ పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలోనే కాకుండా చాలా కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్తులు కూడా దెబ్బతిన్నాయి. పేలుడు జరిగిన ప్రదేశానికి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైప్రస్ ద్వీపం(Cyprus island)లోని పౌరులు కూడా దీన్ని అనుభవించారు. అంటే, ఈ పేలుడు ప్రభావం ఎంత శక్తివంతంగా చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా బుష్ ఫైర్
2019లో ఆస్ట్రేలియా(Australia)లో సాధారణంగా ప్రారంభమైన బుష్ఫైర్(Australia bushfires).. 2020 మే నాటికల్లా దేశంలోని కొన్ని ప్రాంతాలను తాకింది. ఈ బుష్ ఫైర్ ఆస్ట్రేలియాలోని వన్యప్రాణులపై తీవ్ర ప్రభావం చూపించింది. దీని కారణంగా బిలియన్ స్థానిక జంతువుల ను చనిపోయాయని ఒక అంచనా. అంతేకాక, బుష్‌ఫైర్‌తో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి, మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణం కాలిపోయింది. దీంతో జనవరి 31న రాజధాని కాన్బెర్రా(Canberra) పరిసర ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.
ఫ్రాన్స్‌లో ఉపాధ్యాయుడి తల నరికివేత
తన విద్యార్థులకు మొహమ్మద్ ప్రవక్త(Prophet Muhammad) కార్టూన్లను చూపించినందుకు గాను శామ్యూల్ పాటీ(47) అనే ఉపాధ్యాయుడి తల నరికివేశాడు 18 ఏళ్ల యువకుడు. అక్టోబర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన పారిస్ నగర శివార్లలోని కాన్‌ఫ్లాన్స్ సెయింట్-హొనోరిన్ పాఠశాల సమీపంలో జరిగింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్(Emmanuel Macron) ఈ సంఘటనను "ఇస్లామిస్ట్ ఉగ్రవాద దాడి" గా అభివర్ణించాడు. కాగా, హత్యచేసిన ఆ టీనేజ్‌ను పోలీసులు కాల్చి చంపి, మరో తొమ్మిది మంది నిందితులను కూడా అరెస్టు చేశారు.
నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య
నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్(George Floyd)మెడపై ఎనిమిది నిమిషాల పాటు ఒక తెల్లజాతి పోలీసు మోకాలు పెట్టి ఊపిరాడకుండా చేయడం మూలాన అతను మరణించాడు. నల్లజాతీయులకు తీవ్ర ఆగ్రహం తెప్పించిన ఈ ఘటన మే 25న చోటుచేసుకుంది. జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత కొన్ని నెలల పాటు అమెరికా అంతటా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్లాయిడ్ మరణం అమెరికా దేశవ్యాప్తంగా "బ్లాక్ లైవ్స్ మేటర్" ఉద్యమాన్ని ప్రేరేపించింది.
ఇజ్రాయెల్, యుఎఈ మధ్య చారిత్రాత్మక ఒప్పందం
ఉద్రిక్తతలకు నిలయమైన మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతిస్థాపన దిశగా ఆగస్టు నెలలో భారీ ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)మధ్యవర్తిత్వంతో యూఏఈ(UAE), ఇజ్రాయెల్(Israel) ఓ చారిత్రక శాంతి ఒప్పందానికి వచ్చాయి. దీనిలో భాగంగా పూర్తి సాధారణ సంబంధాలు నెలకొనేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. కాగా, ఇది ఇజ్రాయెల్, యూఏఈల మధ్య 25 సంవత్సరాల అనంతరం కుదిరిన శాంతి ఒప్పందం. ఈ మేరకు అమెరికా, ఇజ్రాయెల్, యూఏఈ మూడు దేశాల తరఫున ట్రంప్ ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఈ ఒప్పందంతో, ఈజిప్ట్, జోర్డాన్ తరువాత, ఇజ్రాయెల్‌తో పూర్తి దౌత్య సంబంధాలు కలిగి ఉన్న మూడవ అరబ్ దేశంగా యుఎఈ నిలిచింది.
గ్రహాంతరవాసులు ఉనికి
గ్రహాంతరవాసులు(Aliens) ఉన్నారా? అనే ప్రశ్న మనుషుల మెదళ్లలో ఎప్పటినుంచో మెదులుతుంది. కానీ, ఈ ఏడాది వీటి ఉనికి సంబంధించి బయటపడ్డ ఒక వీడియో చర్చనీయాంశమైంది. ఇద్దరు నేవీ ఫైటర్ పైలట్లు (navy fighter pilots) చిత్రీకరించిన వీడియోలో ఉన్న దాని ప్రకారం, పసిఫిక్ మహాసముద్రానికి 100 మైళ్ళు(సుమారు 160 కి.మీ) దూరంలోని ఒక గుండ్రని వస్తువు నీటి పైన కొట్టుమిట్టాడుతున్నట్లు కనిపించింది. అంతేకాక, ఆ ప్రదేశంలో గాలిలో వస్తువులు కదులుతున్నట్లు కనిపించాయి. దీనితో గ్రహాంతరవాసుల ఉనికికి సాక్ష్యాలు లభించాయి.