Home /News /international /

10 FORMER SECRETARIES OF DEFENSE WARNS TRUMP ABOUT MILITARY USE TO CHANGE ELECTION RESULT HSN

Donald Trump: అమెరికాలో షాకింగ్ సంఘటన.. ట్రంప్ కు మాజీ రక్షణ మంత్రుల వార్నింగ్ లేఖ..!

డోనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫొటో)

డోనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫొటో)

ట్రంప్ వైఖరి చూస్తోంటే సైన్యాన్ని ఉపయోగించి అయినా ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ ఆలోచన కలలో కూడా చేయొద్దని ట్రంప్ ను హెచ్చరిస్తున్నాం.. అంటూ మాజీ రక్షణ మంత్రులు లేఖ రాశారు.

    వాషింగ్టన్: జార్జియా రాష్ట్ర ఎన్నికల అధికారితో ట్రంప్ ఫోన్ కాల్ కు సంబంధించిన ఆడియో టేప్ బయటపడటంతో అగ్రరాజ్యం అంతటా తీవ్ర దుమారం రేగుతోంది. రిపబ్లికన్ నేత, ఆ రాష్ట్ర సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ రఫెన్స్ పెర్జర్ కు ఫోన్ చేసి ఎన్నికల ఫలితాన్ని మార్చే ప్రయత్నాలు చేయాలని ట్రంప్ కోరిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆడియో టేప్ ప్రస్తుతం మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. దీంతో డెమొక్రటిక్ పార్టీ నేతలతోపాటు, అగ్రరాజ్య సీనియర్ అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా ఈ పరిణామం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమెరికాకు రక్షణ మంత్రులుగా పనిచేసి రిటైరైన పది మంది నేతలు ట్రంప్ కు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను అమెరికన్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఆ లేఖలో ట్రంప్ కు మాజీ రక్షణ మంత్రులు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే..

    ’అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిచారో ఇప్పటికే నిరూపణ అయింది. నవంబర్ మూడున ఎన్నికలు ముగిసిన మరుక్షణం నుంచే ట్రంప్ మన ఎన్నికల వ్యవస్థపైనే ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. అక్రమాలు జరిగాయంటూ నిరాధార ఆరోపణలు గుప్పిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం ఏంటో కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా ట్రంప్ లేని పోని అనుమానాలను సృష్టిస్తున్నారు. ఆయన మాటలను ఎవరూ నమ్మడం లేదు. ట్రంప్ వైఖరి చూస్తోంటే సైన్యాన్ని ఉపయోగించి అయినా ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ ఆలోచన కలలో కూడా చేయొద్దని ట్రంప్ ను హెచ్చరిస్తున్నాం.

    జనవరి 20న ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. దీనికి ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ పూర్తిగా సహాయసహకారాలు అందించి పదవీ బాధ్యతల బదలాయింపులో కీలక పాత్ర వహించాల్సి ఉంది. ట్రంప్ వైఖరి చూస్తోంటే ఆయన ఈ ప్రక్రియకు సహకరిస్తారన్న నమ్మకం కనిపించడం లేదు. కోర్టులకు వెళ్లినా సరే న్యాయం బైడెన్ వైపే ఉన్నట్టు నిరూపణ అయింది. ఇక అధ్యక్ష ఫలితాలను ప్రశ్నించే సమయం కూడా దాటిపోయింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ట్రంప్ అధ్యక్ష బాధ్యతల బదలాయింపునకు పూర్తిగా సహకరించాలి. అలా కాదని అల్లర్లను సృష్టించి, సైన్యాన్ని ఉపయోగించి బైడెన్ విజయాన్ని అడ్డుకోవాలని చూస్తే, అది అమెరికా చరిత్రలో కళంకంలా నిలిచిపోతుంది. ప్రజాస్వామ్యానికి అది ఎంతో ప్రమాదకరం. రాజ్యాంగానికి పూర్తి విరుద్ధం. కాబట్టి ట్రంప్ ఇకనైనా ఓటమిని అంగీకరించి బైడెన్ గెలుపును అంగీకరించాలి..‘ అని మాజీ రక్షణ మంత్రులు లేఖలో పేర్కొన్నారు. ఈ రక్షణ మంత్రుల బృందంలో డెమోక్రటిక్ నేతలతోపాటు, రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా ఉండటం గమనార్హం.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: America, Defence Ministry, Donald trump, Joe Biden, US Elections 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు