హోమ్ /వార్తలు /ఇండో చైనా /

India-China: చైనాకు చుక్కలు చూపిస్తున్న భారత స్టార్టప్.. సైన్యానికి సేవలు

India-China: చైనాకు చుక్కలు చూపిస్తున్న భారత స్టార్టప్.. సైన్యానికి సేవలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యురి(URI) సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు మన సైనికుల హెల్మెట్లపై అమర్చిన నైట్ విజన్ గాగుల్స్‌ను టోన్బో సంస్థే సరఫరా చేసింది.

సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు, ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీకి ఒక స్టార్టప్ సంస్థ సేవలందిస్తోంది. చైనా సైనికులు మన భూభాగంలోకి చొరబడకుండా తనిఖీ చేయడానికి బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ అభివృద్ధి చేసిన నిఘా వ్యవస్థ పని చేస్తోంది. ఈ రక్షణ వ్యవస్థ ఇప్పటికే విదేశాల్లో మంచి పేరు తెచ్చుకోవడం విశేషం. భారత సైన్యం సరిహద్దుల్లో మోహరించిన లాంగ్ రేంజ్ అబ్జర్వేషన్ సిస్టం రక్షణ వ్యవస్థ పేరు టి-రెక్స్(T-Rex). దీన్ని టోన్బో ఇమేజింగ్ అనే స్టార్టప్ బెంగళూరులో రూపొందించింది. ‘మేక్ ఇన్ ఇండియా’ పథకంలో భాగంగా దీన్ని కోరమంగళలో ఆ సంస్థ తయారు చేసింది. సాధారణంగా ఆధునిక ఆయుధాలు, ఆత్మరక్షణ వ్యవస్థల కోసం రష్యా, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ పై భారత్ ఆధారపడుతుంది. కానీ ఇప్పుడు దేశీయంగా తయారు చేసిన రక్షణ పరికరాలను ఆర్మీ ఉపయోగిస్తోంది. యురి(URI) సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు మన సైనికుల హెల్మెట్లపై అమర్చిన నైట్ విజన్ గాగుల్స్‌ను టోన్బో సంస్థే సరఫరా చేసింది.

* ప్రత్యేకతలివే

T-Rex అనేది సుదూర నిఘా వ్యవస్థ(long-range surveillance system). ఇది 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను.. పగలు, రాత్రి వేళల్లో కూడా గుర్తించగలదు. దీంట్లో ఉండే నైట్ విజన్, GPS ట్రాకర్లు భద్రతా దళాలకు అత్యవసర సమయాల్లో ఉపయోగపడతాయి. సైనికుల అవసరాల కోసం నిర్మించే మానవ రహిత స్టేషన్ల నిర్మాణానికి అవసరమయ్యే ఫ్యూయల్ సెల్స్ టి-రెక్స్ వ్యవస్థలో ఉంటాయి. ఈ నిఘా వ్యవస్థల కోసం మన దేశం ఇంతకు ముందు ఇజ్రాయెల్పై ఆధారపడేది. కానీ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా వాటిని దేశీయంగా రూపొందిస్తున్నారు. “గతంలో మా ఉత్పత్తులను పాకిస్తాన్ సరిహద్దులో ఉపయోగించారు. ఇప్పుడు లద్దాఖ్లో వాటిని మోహరిస్తున్నారు. వాటిలో ఒకదాన్ని 18,000 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు” అని టోన్బో ఇమేజింగ్ వ్యవస్థాపకుడు అరవింద్ లక్ష్మీకుమార్ చెబుతున్నారు. ఈ నిఘా పరికరాల్లో ఏదైనా సమస్య ఏర్పడితే బెంగళూరు కేంద్రంలోనే వాటిని సరిదిద్దుతామని ఆయన చెప్పారు.

* వివిధ రకాలు ఉత్పత్తులు

హెల్మెట్ మౌంటెడ్ నైట్ విజన్ గాగుల్స్, స్నిపర్ రైఫిల్స్ కోసం థర్మల్ వెపన్ సైట్స్ వంటి పరికరాలు వైమానిక నిఘా కార్యకలాపాలకు ఉపయోగపడతాయి. బెంగళూరు- ఇండియా సిలికాన్ వ్యాలీలో వీటిని డిజైన్ చేశారు. కొచ్చి, మైసూరులోని ప్లాంట్లలో తయారు చేశారు. ఈమధ్యే టోన్బో భారత సైన్యం నుంచి పలు ప్రాజెక్టుల కోసం ఆర్డర్లు అందుకుంది. కశ్మీర్ లోయలో విధులు నిర్వర్తించే నార్తర్న్ కమాండ్తో కలిసి పనిచేస్తోంది. అక్రమ చొరబాట్లను నియంత్రించే బాధ్యతల్లో ఉన్న సైనికులకు 3,000 నైట్ విజన్ గాగుల్స్ సరఫరా చేసింది. కోల్కతా కేంద్రంగా విధుల్లో పాల్గొనే ఈస్టర్న్ కమాండ్తో కూడా ఈ సంస్థ పనిచేస్తోంది. ఎయిర్బస్ నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న సి 295 నిఘా విమానానికి సంబంధించిన ప్రాజెక్టులో కంపెనీ పనిచేస్తోంది. అర్జున్ MKII యుద్ధ ట్యాంకుల అభివృద్ధిలోనూ ఈ సంస్థ భాగస్వామిగా ఉంది. 21,000 నైట్ విజన్ పరికరాల తయారీకి టోన్బో పాల్గొననుంది. ఇజ్రాయెల్ నుంచి సేకరించిన స్పైక్ క్షిపణులకు రక్షణ పరికరాలను ఇంటిగ్రేట్ చేసేందుకు డిఫెన్స్ పిఎస్యులతో కలిసి పనిచేస్తోంది.

* బెంగళూరు కేంద్రంగా..

టోన్బో ఇమేజింగ్‌ను లక్ష్మీకుమార్ స్థాపించారు. ఆయన యునైటెడ్ స్టేట్స్‌లోని కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ చేశారు. స్టాన్ఫోర్డ్ రీసెర్చ్ సెంటర్కు అనుబంధ సంస్థ అయిన సర్నాఫ్ టెక్నాలజీస్కు భారత అధిపతిగా పనిచేశారు. ఈ విధులు నిర్వర్తించడానికి 2004లో భారతదేశానికి తిరిగి వచ్చారు. 2009లో ఆ సంస్థను కొనుగోలు చేశారు. కొత్త రకం సాంకేతిక పరికరాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేశారు. ఈ సంస్థ పేరును 2012లో టోన్బో ఇమేజింగ్ గా మార్చారు. భారతదేశం రక్షణ రంగంలో చాలా తక్కువ పురోగతి సాధించింది. రక్షణ విభాగంలో పెట్టుబడులు పెట్టడానికి, ఖర్చుతో కూడిన పరిశోధన కార్యక్రమాలకు పెద్ద కార్పొరేషన్లు సాధారణంగా దూరంగా ఉంటాయి. ఇలాంటి సంస్థలు కాంట్రాక్టులు దక్కించుకుని ఇతర దేశాల సంస్థల భాగస్వామ్యంతో కలిసి పనిచేస్తూ, ఆ ఉత్పత్తులను రక్షణ దళాలకు సరఫరా చేయడానికి ఇష్టపడతాయి. టోన్బో వంటి భారతీయ స్టార్టప్‌లు తమ సాఫ్ట్‌వేర్ పరాక్రమాన్ని పెంచుకోవాలని భావిస్తున్నాయి.

* ఇతర దేశాల్లోనూ సేవలు

అభివృద్ధి చెందుతున్న దేశాలు సాధారణంగా స్టార్టప్ సంస్థల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేయవు. అందుకే తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ముందు అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాపారాన్ని స్థాపించామని లక్ష్మీకుమార్ చెబుతున్నారు. యునైటెడ్ కింగ్డమ్ స్పెషల్ ఫోర్సెస్, ఇజ్రాయెల్ ఫోర్స్, యూఎస్ స్పెషల్ ఫోర్స్‌తో కలిసి టోన్బో కంపెనీ పనిచేసింది. జోర్డాన్ ల్యాండ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసే కార్యక్రమంలో కూడా ఈ సంస్థ భాగస్వామిగా ఉంది. 2010లో ఇండియా మార్కెట్లోకి ఈ సంస్థ ప్రవేశించింది.

* భారత్‌లో వ్యాపారం

టోన్బో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. దీని హోల్డింగ్ కంపెనీ సింగపూర్లో ఉంది. ప్రస్తుతం ఈ సంస్థలో 150 మంది ఇంజనీర్లు సేవలందిస్తున్నారు. ఆసియా మరియు సౌత్ ఈస్ట్ ఆసియాలోని వ్యాపారాల కోసం మైసూరు, కొచ్చిలలో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. పాశ్చాత్య వినియోగదారుల కోసం ఐరోపాలోని లిథువేనియాలో మరో ప్లాంటు ఉంది. భారత్కు తక్కువ ఖర్చులో రక్షణ పరికరాలను సరఫరా చేస్తున్న సంస్థగా టోన్బో నిలిచింది. భవిష్యత్తులో సేవలను మరింత విస్తరించే ప్రయత్నాల్లో ఈ సంస్థ నిమగ్నమై ఉంది.

First published:

Tags: India-China, Indo China Tension, Jammu and Kashmir, Ladakh

ఉత్తమ కథలు