India China Tension: పాక్‌తో అలా.. చైనాతో ఇలా.. దటీజ్ దోవల్

Ajit Doval: నిన్న చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీతో అజిత్ దోవల్ రెండు గంటల పాటు ఫోన్‌లో చర్చలు జరపడం... అనంతరం సరిహద్దుల్లో చైనా తన బలగాలను వెనక్కి తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

news18-telugu
Updated: July 6, 2020, 6:59 PM IST
India China Tension: పాక్‌తో అలా.. చైనాతో ఇలా.. దటీజ్ దోవల్
భారత జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్(File)
  • Share this:
దేశ రక్షణ సహా పలు అంశాల్లో ప్రధాని నరేంద్రమోదీ తీసుకునే నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే వ్యక్తిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు గుర్తింపు ఉంది. పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్ చేయడంలోనూ.. అతి క్లిష్టమైన ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్‌ను పూర్తి స్థాయిలో భారత్‌లో విలీనం చేయడంలోనూ అజిత్ దోవల్ పాత్ర ఉందని చాలామంది చెబుతుంటారు. అజిత్ దోవల్ సైతం కేవలం తన ఆఫీసుకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితిని తెలుసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్‌లో పరిస్థితులను చక్కదిద్దడంతో పాటు కొన్ని నెలల క్రితం ఢిల్లీలో అల్లర్ల తరువాత పరిస్థితి సాధారణ స్థితికి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

అలాంటి అజిత్ దోవల్ మరోసారి చైనాతో సరిహద్దు వివాదం విషయంలో తనదైన చతురతను ప్రదర్శించారనే వార్తలు వినిపిస్తున్నాయి. గాల్వన్ లోయ దగ్గర 20 మంది భారతీయ సైనికుల వీరమరణం తరువాత భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు ఎంతగానో పెరిగాయి. అయితే ఓ వైపు చైనాతో ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు చర్చలు జరుపుతూనే... మరోవైపు అవసరమైతే డ్రాగన్‌కు ధీటుగా బదులిచ్చేందుకు భారత్ వ్యూహరచన చేస్తోంది. ఇందులో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ కీలకంగా వ్యవహరిస్తారని వేరే చెప్పనవసరం లేదు.

మరోవైపు నిన్న చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీతో అజిత్ దోవల్ రెండు గంటల పాటు ఫోన్‌లో చర్చలు జరపడం... అనంతరం సరిహద్దుల్లో చైనా తన బలగాలను వెనక్కి తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో చైనాతో సమస్యను పరిష్కరించే విషయంలోనూ అజిత్ దోవల్ తన చతురతను చాటుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు చైనాకు సంబంధించిన కీలక యాప్స్‌ను నిషేధించడంతో పాటు దేశంలోని పలు రంగాల్లో చైనా కంపెనీలకు నో ఎంట్రీ బోర్డు పెట్టాలని భారత్ నిర్ణయం తీసుకోవడం డ్రాగన్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. తాజాగా అజిత్ దోవల్ రంగంలోకి దిగి చర్చలు జరిపిన అనంతరం చైనా బలగాలు వెనక్కి తగ్గుతుండటంతో... ఎవరితో ఎలా వ్యవహరించాలనే విషయం అజిత్ దోవల్‌కి బాగా తెలుసనే వాదనలు వినిపిస్తున్నాయి.




Published by: Kishore Akkaladevi
First published: July 6, 2020, 6:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading