NO FORMAL PLANS FOR TRUMP TO MEDIATE BETWEEN INDIA AND CHINA SAYS WHITE HOUSE
India-China Border Tensions: లద్ధఖ్‌లో ఉద్రిక్తత...ఆ ఆలోచన లేదంటున్న ట్రంప్
donald trump
India-China Tensions Updates | భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించేందుకు అవసరమైతే తాను మధ్యవర్తిత్వంవహిస్తానని గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు వచ్చారు.
భారత్-చైనాల మధ్య సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వంవహించే ఆలోచన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేదని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి సీఎన్‌బీసీ-టీవీ18కి స్పష్టంచేశారు. తూర్పు లద్ధఖ్‌లోని గాల్వాన్ లోయ వద్ద ఈ నెల 15న భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులుకావడం తెలిసిందే. చైనా వైపు కూడా 40కి పైగా ప్రాణ నష్టం లేదా తీవ్రంగా గాయపడినట్లు తనకను విశ్వసనీయ వర్గాల సమాచారముందని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికా ఇంటెలిజన్స్ వర్గాలకున్న సమాచారం మేరకు ఈ ఘర్షణల్లో 35 మంది చైనా సైనికులు మృతి చెందారు. తమ వైపు కూడా ప్రాణ నష్టం జరిగినట్లు చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ కూడా అంగీకరించింది. అయితే మృతుల సంఖ్యకు సంబంధించి చైనా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గత ఐదు దశాబ్ధాల కాలంలో ఇరు దేశాల మధ్య జరిగిన అత్యంత హింసాత్మక ఘటన ఇదే.
తూర్పు లద్ధఖ్‌లోని గాల్వన్ లోయ (credit - google maps)
భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపిన అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి...ఇరు దేశాల సంయమనం పాటించి శాంతి నెలకొల్పాలని కోరారు. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. చైనా-భారత్ వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక దృష్టిసారించినట్లు సీఎన్‌బీసీ-టీవీ18కి తెలిపిన అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి...ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలు మొగ్గుచూపుతున్నట్లు చెప్పారు. సమస్యకు శాంతియుత పరిష్కారం లభించేందుకు తమ మద్దతు ఉంటుందన్నారు.
చైనా తన సైనిక బలగాలను ఈ నెల 5న తూర్పు లద్ధఖ్‌లో మోహరించినప్పటి నుంచి...భారత్-అమెరికాలు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అక్కడ నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి.
ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుకు వచ్చారు. అయితే ఆయన ప్రతిపాదనను తోసిపుచ్చిన భారత్...చైనాతో నేరుగా సంప్రదింపులతో సమస్యను పరిష్కరించుకుంటామని స్పష్టంచేసింది. అటు చైనా కూడా ట్రంప్ మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టంచేసింది.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.