PLA Found Missing Youth : ఈ నెల 18న బోర్డర్ లో తప్పిపోయిన 17ఏళ్ల యువకుడు (Missing Arunachal Youth)మిరామ్ టారోన్ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. అరుణాచల్ ప్రదేశ్ షియాంగ్ జిల్లాలోని సియుంగ్లా ప్రాంతానికి చెందిన మిరామ్ టారోన్ తప్పిపోగా..తమ భూభాగంలో ఓ యువకుడిని గుర్తించామని,అయితే అతడు మిరామ్ టారోనా కాదా అన్నది నిర్థారిస్తున్నామని తాజాగా చైనా ఆర్మీ ప్రకటించింది. ఈ మేరకు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA).. భారత సైన్యానికి సమాచారం అందించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ తాజాగా వెల్లడించింది. అధికారిక ప్రక్రియ పూర్తి అయిన తర్వాత బాలుడిని మన సైన్యానికి అప్పజెప్పనున్నట్లు రక్షణ శాఖ పీఆర్ఓ హర్షవర్ధన్ పాండే తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని షియాంగ్ జిల్లాలోని జిడో గ్రామానికి చెందిన మిరామ్ టారోన్ ని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసినట్లుగా తొలుత వార్తలు వచ్చాయి. భారత భూబాగం నుంచి ఆ బాలుడిని చైనా ఆర్మీ అపహరించిందని అరుణాచల్ తూర్పు జిల్లాఎంపీ తపిర్ గావో ఆరోపించారు. చైనా ఆర్మీ చెర నుంచి తప్పించుకున్న మరో యువకుడు.. స్థానిక అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేసినట్లు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఘటన జరిగినప్పుడు టారోన్, మరికొంత మందితో కలిసి రెండు దేశాల సరిహద్దు ప్రాంతంలో వేట సాగిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.
ALSO READ PM Marriage Cancel : ఒమిక్రాన్ విజృంభణ..దేశ ప్రధాని పెళ్లి రద్దు
అయితే తప్పిపోయిన మిరామ్ టారోన్ గురించి సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ.. పీఎల్ఏని సంప్రదించింది. బాలుడి ఆచూకీ కోసం చైనా ఆర్మీ సాయం కోరినట్లు భారత సైన్యం పేర్కొంది. ఈ క్రమంలో యువకుడి ఆచూకీ కనుగొన్నట్లు చైనా సైన్యం భారత్‌కు సమాచారం ఇచ్చింది. కాగా, తూర్పు లడఖ్‌లో భారత్- చైనాలు దాదాపు రెండేళ్లుగా ప్రతిష్టంభనలో నిమగ్నమై ఉన్న సమయంలో తాజా ఎపిసోడ్ జరిగింది. సెప్టెంబరు 2020లో ఇదే విధమైన సంఘటన జరిగింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సుబంసిరి జిల్లా నుండి ఐదుగురు యువకులను పీఎల్ఏ అపహరించి, వారం తర్వాత వారిని విడుదల చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arunachal Pradesh, China, India-China, Indian Army, Missing person