news18-telugu
Updated: July 9, 2020, 10:02 AM IST
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో(ఫైల్ ఫోటో)
భారత్-చైనా సేనల మధ్య గల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సరిహద్దు విషయంలో కయ్యాలమారి చైనా దుందుడుకు చర్యలకు పాల్పడిందని...అయితే భారత్ కూడా కయ్యాలమారి చైనాకు ధీటుగా స్పందించిందన్నారు. గత నెలలో గల్వాన్ ఘటనకు సంబంధించి భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో తాను పలుమార్లు మాట్లాడినట్లు వెల్లడించారు. చైనా పలు దేశాలతో సరిహద్దు వివాదాలు పెట్టుకోవడంపై ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అటు పొరుగుదేశాలైన భూటాన్, వియత్నాంతోనూ చైనా గిల్లికజ్జాలు పెట్టుకుంటోందన్నారు. చైనీస్ కమ్యునిస్ట్ పార్టీ నుంచి పొంచి ఉన్న ముప్పును ప్రపంచం అర్థం చేసుకుంటోందన్న నమ్మకం ఉందన్నారు. త్వరలోనే డ్రాగన్ దేశం ఒంటరి అవుతుందని పాంపియో పేర్కొన్నారు. చైనా చర్యలకు సరైన రీతిలో స్పందించేందుకు అన్ని దేశాలూ కలిసి వస్తాయని భావిస్తున్నట్లు పాంపియో చెప్పారు.
ఇదిలా ఉండగా భారత్-చైనా సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతాల నుంచి ఇరు దేశ బలగాల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో అక్కడ వాతావరణం చల్లబడింది. గల్వాన్ లోయలోని గస్తీ పాయింట్ 14 నుంచి చైనా తన బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంది. తమ సామాగ్రిని పూర్తిగా తొలగించింది. తూర్పు లద్ధఖ్‌లోని మరో రెండు వివాదాస్పద ప్రాంతాలైన హాట్ స్ప్రింగ్స్, గోగ్రా వద్ద కూడా చైనా సేనలు దాదాపు 2 కిలో మీటర్లు వెనక్కి వెళ్లాయి. భారత్ కూడా తన బలగాలను ఆ ప్రాంతాల నుంచి ఉపసంహరించుకుంది.

గల్వాన్ లోయలో సమస్యాత్మక ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లిన చైనా సేనలు
గల్వాన్ లోయలో గత నెల 15న ఇరు దేశ సేనల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల్లో కల్నన్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత జవాన్లు మృతి చెందడం తెలిసిందే. ఈ ఘర్షణల్లో చైనా వైపు దాదాపు 40 మంది సైనికులు చనిపోయినట్లు అనధికారిక వర్గాల సమాచారం. తమ వైపు కూడా ప్రాణ నష్టం జరిగినట్లు ధృవీకరించిన చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్...అయితే ఎంత మంది మరణించారో ఇప్పటి వరకు వెల్లడించలేదు.
Published by:
Janardhan V
First published:
July 9, 2020, 10:02 AM IST