Home /News /india-china /

INDIA WITHDRAWS FROM MULTINATIONAL MILITARY EXERCISE WITH CHINA AND PAKISTAN ON RUSSIAN SOIL

గల్వాన్ ఎఫెక్ట్...మరోసారి చైనా విషయంలో భారత్ కఠిన నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India-china Tensions: గల్వాన్ ఘటన తర్వాత మరోసారి చైనా విషయంలో భారత్ తన కఠిన వైఖరిని తేటతెల్లం చేసింది. రష్యా వేదికగా త్వరలో జరగనున్న పలుదేశాల సంయుక్త సైనిక విన్యాసాల(కావ్‌కజ్-2020) నుంచి భారత్ వైదొలిగింది.

    గల్వాన్ లోయలో ఘర్షణల తర్వాత భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించుకుని ఆర్థికంగా లాభపడాలన్న చైనా చేస్తున్న నక్కజిత్తులు ఇప్పట్లో ఫలించేలా లేదు. మరోసారి చైనా విషయంలో భారత్ తన కఠిన వైఖరిని తేటతెల్లం చేసింది. రష్యా వేదికగా త్వరలో జరగనున్న పలుదేశాల సంయుక్త సైనిక విన్యాసాల(కావ్‌కజ్-2020) నుంచి భారత్ వైదొలిగింది. చైనా, పాకిస్థాన్ కూడా ఈ సంయుక్త విన్యాసాల్లో పాలుపంచుకోనున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌‌లో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రష్యాలో జరిగే పలుదేశాల సైనిక విన్యాసాల కార్యక్రమంలో భారత దళాలు పాల్గొనాలా? వద్దా? అన్న అంశంపై చర్చించారు. ఇందులో చైనా, పాకిస్థాన్ సేనలు కూడా పాల్గొంటున్నందున..అందులో మనం పాల్గొనడం సరికాదని నిర్ణయించారు.

    ఈ మేరకు తన నిర్ణయాన్ని భారత ప్రభుత్వం రష్యాకు తెలియజేసినట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా సమస్య కూడా తమ నిర్ణయానికి కారణమని భారత్ రష్యాకు తెలిపినట్లు సమాచారం. కాగా సెప్టెంబర్ 4-6 తేదీ వరకు జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యాకు వెళ్లనున్నారు. అయితే ఈ సందర్భంగా చైనా ప్రతినిధులతో భారత ప్రతినిధులు ఎలాంటి చర్చలు జరపబోరని తెలుస్తోంది. ఈ సందర్భంగా దేశ సరిహద్దుల్లో చైనా రెచ్చగొట్టే చర్యలను భారత ప్రతినిధులు లేవనెత్తే అవకాశమున్నట్లు సమాచారం.

    గల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య జూన్ 15న రాత్రి జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు బలికావడం తెలిసిందే. ఈ ఘటనలో చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగినట్లు భావిస్తున్నా...మరణాలపై ఇప్పటి వరకు ఆ దేశం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
    Published by:Janardhan V
    First published:

    Tags: India-China, Indo China Tension, Russia

    తదుపరి వార్తలు