India - China Face-off: భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు రష్యా చొరవచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇరు దేశాల రక్షణ శాఖ మంత్రులతో రష్యా రాజధాని మాస్కోలో సెప్టెంబర్ మాసంలో సమావేశాన్ని ప్రతిపాదించినట్లు సమాచారం. తూర్పు లద్ధఖ్‌లోని గల్వాన్ లాయలో ఇరు దేశాల సేనల మధ్య జరిగిన ఘర్షణల్లో భారత్ కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లను కోల్పోయింది. చైనా వైపు 35 మంది వరకు ప్రాణ నష్టం జరిగినట్లు అమెరికా ఇంటెలిజన్స్ వర్గాలు చెబుతున్నా...దీనిపై డ్రాగన్ దేశం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గల్వాన్ లోయ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చైనాను ఆర్థికంగా దెబ్బతీసే వ్యూహంతో ఆ దేశానికి చెందిన టిక్ టాక్ సహా పలు మొబైల్ యాప్‌లను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. దేశంలోకి చైనా ఉత్పత్తుల దిగుమతులను నియంత్రించేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది.
ఈ నేపథ్యంలో ఇరు దేశాల రక్షణ శాఖ మంత్రుల సమావేశాన్ని మాస్కో వేదికగా నిర్వహించేందుకు రష్యా చొరవచూపుతోంది. అయితే ఈ విషయంలో ఇరుదేశాలు ఎలా స్పందిస్తాయో తెలియడం లేదు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటనకు వెళ్తే...చైనాలో ఉద్రిక్త పరిస్థితుల తర్వాత మాస్కోలో ఇది ఆయనకు రెండో పర్యటన అవుతుంది. జూన్ మాసంలోనూ రాజ్‌నాథ్ సింగ్ మాస్కోలో పర్యటించారు. జూన్ 24న మాస్కోలో జరిగిన విక్టరీ డే పరేడ్‌లో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. రక్షణ రంగ ఆయుధాలను రష్యా త్వరగా భారత్‌కు సరఫరా చేసేలా ఆ దేశ ప్రముఖులతో రాజ్‌నాథ్ చర్చించి ఒప్పించారు. భారత్‌కు యుద్ధ విమానాలు(సీ-400) సరఫరా చేయొద్దని చైనా ఒత్తిడి తీసుకొచ్చినా..రష్యా మాత్రం దాన్ని తోసిపుచ్చింది. అదే సమయంలో చైనాకు యుద్ధ విమానాల సరఫరాను రష్యా ఆలస్యం చేస్తున్నట్లు అనధికారిక సమాచారం.
ఇప్పటికే రష్యా, భారత్, చైనాలు ఓ కూటమిగా (RIC కూటమి) ఏర్పడి పలు రంగాల్లో సమన్వయానికి ప్రయత్నిస్తున్నాయి. షాంఘై కో ఆపరేషన్(SCO)లోనూ రష్యా, చైనా, భారత్ సభ్య దేశాలుగా ఉన్నాయి. అలాగే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాల సమాఖ్య(BRICS)లోనూ ఈ మూడు దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రస్తుతం RIC-BRICS-SCO సమాఖ్యల అధ్యక్ష స్థానంలో ఉన్న రష్యా...భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు చొరవచూపుతోంది. గతంలో చైనా నాన్చుడు ధోరణితో ఆలస్యం అవుతున్నా...SCO సమాఖ్యలో భారత్ సభ్యత్వం పొందడంలో రష్యా కీలక పాత్ర పోషించింది. యూరేసియన్ ప్రాంతంలో చైనా పెద్దన్న పాత్రను పోషించే ప్రయత్నాలకు అడ్డుపడుతున్న భారత్...ఈ విషయంలో చారిత్రక మైత్రీ సంబంధాల నేపథ్యంలో రష్యాకు మాత్రం పూర్తి మద్ధతు ఇస్తోంది.
భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా చొరవచూపిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైతే భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పుతిన్‌తో త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాలన్నది పుతిన్ ఆలోచనగా రష్యా మీడియాలో ఇటీవల కథనాలు వచ్చాయి. భారత్‌తో రష్యాకు దశాబ్ధాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా భారత్‌లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా...వారితో పుతిన్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indo China Tension, US-China, Vladimir Putin