India-Pakistan: భారత్, చైనా మధ్య ఉద్రిక్తత మధ్య ఉన్న అవకాశాన్ని చూసిన పాకిస్తాన్ కాశ్మీర్ పై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, వైమానిక దళం చీఫ్ ముజాహిద్ అన్వర్ ఖాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ జాఫర్ మహమూద్ అబ్బాసి పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ నిర్వహించింది. ఈ సమావేశంలో నియంత్రణ రేఖ, కాశ్మీర్ పరిస్థితి గురించి చర్చించామని పాకిస్తాన్ ఆర్మీ మీడియా విభాగం ఐఎస్‌పిఆర్ తెలిపింది. అదే సమయంలో, ఐఎస్ఐ ముగ్గురు ఆర్మీ చీఫ్ లకు భద్రతకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించింది. ఐఎస్‌ఐ చేసిన కృషిని అధికారులందరూ ప్రశంసించారని ISPR ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉంటే ఐఎస్ఐ ఆదేశాల మేరకు, చైనాతో ఉద్రిక్తతల మధ్య, పాకిస్తాన్ సైన్యం పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను కాశ్మీర్లోకి బలవంతంగా చొప్పించడానికి ప్రయత్నిస్తోందని నిఘా వర్గాల సమాచారం. ఇప్పటికే పాకిస్తాన్ సైన్యం యొక్క కాల్పుల విరమణ ఉల్లంఘనతో భారత సైన్యానికి చికాకులు పెంచింది. మరోవైపు చైనా ఉద్రిక్తతల మధ్య భారతదేశం బిజీగా ఉండటం చూసి, పాకిస్తాన్ ఇదే అదనుగా కాశ్మీర్ లో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తోంది.
మరోవైపు జమ్మూ కాశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్‌బాగ్ సింగ్ మాట్లాడుతూ... గత 17 రోజుల్లో 27 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయన్నారు. ఉగ్రవాదులు ఇప్పుడు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని... కాశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడానికి ఉగ్రవాదులను హతమార్చామని సింగ్ అన్నారు. ఈ ఉగ్రవాదులు లష్కర్-ఎ-తైబా, జైష్-ఎ-మొహమ్మద్ మరియు హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందినవారని పేర్కొన్నారు. అలాగే ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపుతున్నారని దోడా జిల్లాలో భద్రతా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న డిజిపి అన్నారు. గత వారం అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు కాశ్మీరీ పండిట్ హతమార్చడం గురించి అడిగినప్పుడు, భద్రత కోసం ఈ ప్రాంతంలో రోజూ పెట్రోలింగ్ జరుగుతోందని తెలిపారు.
Published by:Krishna Adithya
First published:June 16, 2020, 21:10 IST