India-China Border Tensions: లద్దాఖ్‌లో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందడటంతో... ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాకస్థాయికి చేరుకున్నాయి. చైనా సైనికుల దాడిలో మన జవాన్లు మరణించడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనాకు ధీటుగా బదులివ్వాలనే డిమాండ్ ఒక వైపు.. ఆ దేశ ఉత్పత్తులపై నిషేధం విధించాలనే డిమాండ్ మరో వైపు జోరుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన కేంద్రం...దేశంలోని 20 రాజకీయ పార్టీలతో ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చించనుంది. సాయంత్రం 5 గం.లకు ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.
చైనా సరిహద్దుల్లో అసలు ఏం జరిగిందనే అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అఖిల పక్ష నేతలకు వివరించనున్నారు. దీంతో పాటు 20 మంది భారత సైనికుల ప్రాణాలు తీసుకున్న ఆ దేశంతో భవిష్యత్తులో ఏరకంగా వ్యవహరించాలనే అంశంపై కూడా రాజకీయ పార్టీల నుంచి వచ్చే సలహాలు, సూచనలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని రాజకీయ పార్టీలు ఈ విషయంలో కేంద్రానికి ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తాయనే అంశం ఆసక్తికరంగా మారింది.
ఈ సమావేశంలో బీజేపీ తరపున జేపీ నడ్డా, కాంగ్రెస్ తరపున సోనియాగాంధీ, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, డీఎంకే నేత స్టాలిన్, అన్నాడీఎంకే తరపున పళనిస్వామి, పన్నీర్ సెల్వన్, టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జేడీయూ తరపున నితీష్ కుమార్, సవాజ్ వాదీ తరపున అఖిలేష్ యాదవ్, సీపీఐ తరపున రాజా, సీపీఎం తరపున సీతారాం ఏచూరి, టీఆర్ఎస్ తరపున కేసీఆర్, అకాళీదల్ తరపున సుఖ్బీర్ బాదల్, ఎల్జేపీ తరపున చిరాగ్ పాశ్వాన్, జేఎంఎం తరపున హేమంత్ సోరెన్ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.