చైనాను ఇండియా ఓడించాలంటే ఏం చెయ్యాలి?... డ్రాగన్‌కు చెక్ పెట్టేదెలా?

చైనాను ఇండియా ఓడించాలంటే ఏం చెయ్యాలి?... డ్రాగన్‌కు చెక్ పెట్టేదెలా?

చైనా ఎందుకు భారత భూభాగాన్ని లాక్కోవాలని చూస్తోంది? యుద్ధం జరిగితే... భారత్ గెలుస్తుందా? అసలు చైనాపై ఇండియా పైచేయి సాధించాలంటే ఏం చెయ్యాలి?

 • Share this:
  మన చుట్టూ జరిగే పరిణామాలను బట్టీ మన ఆలోచనలు ఉంటాయి. సపోజ్ మన చుట్టూ ఉన్నవారంతా... చైనా-భారత్ మధ్య యుద్ధం జరగాలని పదే పదే కోరుతూ ఉంటే... మనం కూడా ఆ ఆలోచనల్లో చిక్కుకుంటాం. కానీ... ఒక్కసారి ఆ రింగు లోంచీ బయటకు రాగలిగితే... కాస్త భిన్నంగా ఆలోచించేందుకు ప్రయత్నిస్తే... మరెన్నో ఆల్టర్నేట్ మార్గాలు దొరుకుతాయి. జూన్ 15న... భారత సరిహద్దులోని గాల్వాన్ లోయలో... చైనా... 20 మంది భారత సైనికుల ప్రాణాలు తీసింది. అటువైపు ఎంత మంది సైనికులు చనిపోయారో తెలియదు. ఈ పరిస్థితుల్లో చైనాతో యుద్ధం చెయ్యాలని భారతీయుల్లో చాలా మంది కోరుకుంటున్నారు. ఐతే... ఎనలిస్టులు మాత్రం యుద్ధం అవసరం లేదంటున్నారు. దానికంటే పదునైన అస్త్రం మరొకటి ఉందని చెబుతున్నారు. అదే... బిజినెస్.

  ప్రస్తుతం ఇండియా... చైనాతో... 86బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తోంది. వీటిలో... దిగుమతులు 68 బిలియన్ డాలర్లు ఉన్నాయి. అంటే... ఇండియా నుంచి చైనాకు వెళ్తున్న వస్తువుల విలువ 18 బిలియన్ డాలర్లు మాత్రమే. చైనా నుంచి మనకు వస్తున్న దిగుమతుల్లో ఎక్కువ భాగం మొబైల్ ఫోన్లే ఉన్నాయి. ఇప్పటికే చైనా ఫోన్లు వాడొద్దని, చైనా వస్తువులు వాడొద్దని బాయ్‌కాట్ చైనా ప్రొడక్ట్స్ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది.

  కరోనా వల్ల నష్టపోయిన దేశం తిరిగి కోలుకునేందుకు ఆత్మనిర్భర భారత్ ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. దీని అర్థం కూడా అదే. మన దేశ ప్రజలు... మన దేశంలో తయారయ్యే వస్తువులనే కొంటూ ఉంటే... అది మన దేశంలో ప్రజలకు ఆదాయం తెస్తుంది. ఉద్యోగాలు తెస్తుంది. మన దేశ పరిశ్రమలు జోరందుకుంటాయి. మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఇది వంద శాతం అమలైతే... చైనాకు పెద్ద షాకే అవుతుంది.

  మన దేశం 14 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ. ఇందులో ఆత్మనిర్భర భారత్ కిందకు 10 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేరే ఛాన్స్ ఉంది. అంటే దాదాపు 70 శాతం వస్తువులు దేశంలో తయారైనవే ప్రజలు కొంటున్నట్లు అవుతుంది. ఐతే... ఇది సాధ్యం కావాలంటే కనీసం 15 ఏళ్లు పడుతుందని అంటున్నారు ఎనలిస్టులు.

  అసలు ప్రజలు కొనుక్కుంటున్న వస్తువుల్లో 90 శాతం ఎక్కడ తయారవుతున్నాయో వారికే తెలియట్లేదు. అంటే... వస్తువు చూశామా... డబ్బులిచ్చామా... కొనుక్కున్నామా అన్నదే ప్రజలు ఆలోచిస్తున్నారు తప్ప... ఎక్కడ తయారైంది అనేంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ప్రజలకు ఏముంది? అన్నది తేలాల్సిన ప్రశ్న. ఇందులో ప్రజల తప్పేమీ లేదు. ఏ వస్తువులు తమ చెంతకు వస్తాయో... వాటినే వాళ్లు కొంటారు. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... స్థానికంగా తయారయ్యే అంటే మేడ్ ఇన్ ఇండియా వస్తువుల్నే ప్రజల చెంతకు చేర్చితే... ప్రజలు వాటినే కొంటారనేది ఓ ఫార్ములా.

  ఇండియాలో తయారయ్యే వాటి కంటే చైనా వస్తువులు తక్కువ రేటు అనేది మరో ఆలోచన. కానీ... ఏ వస్తువైనా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తే... దాని తయారీ ఖర్చు బాగా తగ్గిపోతుంది. చైనా చేస్తున్నది ఇదే. పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి... ప్రపంచంలోని చాలా దేశాలకు వాటిని గంటగంటకూ పంపేస్తోంది. అదే పని ఇప్పుడు ఇండియా చెయ్యాల్సిన అవసరం ఉంది. బిగ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే నినాదాన్ని అందుకోవాల్సి ఉంది. అప్పుడు ఇండియాలో తయారయ్యే వస్తువుల రేట్లు కూడా తక్కువగానే ఉంటాయి. కాస్తో కూస్తో ఎక్కువ రేటు ఉన్నా... దేశభక్తితో ప్రజలు దేశీయ వస్తువుల్నే కొంటారు. ఐతే... ఇలా ఉత్పత్తి జరిగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించాల్సిన అవసరం చాలా ఉంది. సిగరెట్ లైటర్, చిన్న సూది కూడా చైనా నుంచి తెప్పించుకునే పరిస్థితి పూర్తిగా మారాలి. ఆ ఉత్పత్తులన్నీ ఇండియాలోనే పెద్ద మొత్తంలో తయారవ్వాలి.

  చైనా ఉత్పత్తులన్నీ యూజ్ అండ్ త్రో రకాలే. ఒకసారి వాడాక... పాడైతే రిపేర్ చేసుకోవడానికి ఉండదు. మళ్లీ కొత్తది కొనుక్కోవడమే. అందుకే చైనా ఉత్పత్తుల్లో చాలా వాటికి గ్యారెంటీ ఉండదు. అదే ఇండియా... క్వాలిటీతో కూడిన ఉత్పత్తుల్ని తయారుచేస్తూ... గ్యారెంటీ ఇస్తూ... మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ వాల్యూని పెంచితే... ప్రపంచ దేశాలు ఇండియా వస్తువుల్ని కొనేందుకు ఆసక్తి చూపిస్తాయి. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు ఇలాగే సక్సెస్ అవుతున్నాయి. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ కూడా ఈ దిశగా దూసుకెళ్తే... చైనాకు చెక్ పెట్టేందుకు వీలవుతుంది. డ్రాగన్‌ను ఆర్థికంగా దెబ్బతీస్తూ... ఇండియా ఆర్థికంగా బలపడుతూ ఉంటే... అప్పుడు బీజింగ్ పాలకులు కుట్రలు పన్నేందుకు సాహసం చెయ్యరన్నది విశ్లేషకుల మాట.
  First published: