జంట హత్యల కేసులో 27 ఏళ్ల జైలు జీవితం..చివరకు నిర్ధోషిగా తేల్చిన కోర్టు

ఇద్దరు పిల్లల హత్య కేసులో 27 ఏళ్లు కారాగార జీవితాన్ని అనుభవించిన వ్యక్తి...ఆ కేసులో నిర్దోషిగా చైనాలోని ఓ కోర్టు తీర్పు ఇచ్చింది. చైనా న్యాయ వ్యవస్థలో డొల్లతనానికి ఈ కేసు అద్దంపడుతోంది.

news18-telugu
Updated: August 6, 2020, 10:24 PM IST
జంట హత్యల కేసులో 27 ఏళ్ల జైలు జీవితం..చివరకు నిర్ధోషిగా తేల్చిన కోర్టు
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్న నానుడి చైనా న్యాయ వ్యవస్థకు కరెక్టుగా సరిపోతుంది. ఇద్దరు పిల్లలు హత్య కేసులో 27 ఏళ్ల కారాగార జీవితాన్ని గడిపిన ఓ వ్యక్తికి చివరకు నిర్ధోషిగా విముక్తి లభించింది. చైనా చరిత్రలోనే మొదటిసారిగా ఓ కేసులో ఇన్నేళ్లు కారాగార జీవితాన్ని అనుభవించిన నిందితుడు అత్యున్నత కోర్టులో నిర్ధోషిగా విముక్తి పొందడం చర్చనీయాంశంగా మారింది.నిందితుడు జాంగ్ యుహువాన్(53)పై మోపిన హత్యానేరాభియోగాలకు సంబంధించి సరైన ఆధారాలు లేవంటూ తూర్పు జియాంగ్సి ప్రావిన్స్‌లోని సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది. దీంతో అతన్ని నిర్ధోషిగా పేర్కొంటూ కోర్టు తీర్పు ఇచ్చినట్లు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.

1993లో జియాంగ్సి ప్రావిన్స్‌లోని నంచాంగ్ నగరంలో ఇద్దరు బాలురు దారుణ హత్యకు గురైయ్యారు. వారి పక్కింటిలో నివాసముంటున్న యుహువాన్ హంతకుడని అనుమానించిన పోలీసులు...ఆయన్ను అరెస్టు చేశారు. అప్పుడు అతని వయస్సు 36 ఏళ్లు. ఈ కేసులో యుహువాన్‌ను దోషిగా తేల్చిన కిందిస్థాయి కోర్టు...ఆయనకు మరణశిక్ష విధించింది. జైళ్లో రెండేళ్లు అతను ఎలాంటి నేరానికి పాల్పడకపోవడంతో ఆ శిక్షను కోర్టు ఆదేశాల మేరకు జీవిత ఖైదుగా మార్చారు. తనకు విధించిన శిక్షపై యుహువాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇద్దరు బాలలను తాను హత్య చేయలేదని, దర్యాప్తు సమయంలో పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేసి నేరం చేసినట్లు ఒప్పించారని కోర్టుకు తెలిపాడు. గత ఏడాది మార్చి మాసంలో ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు...హత్య కేసులో యుహువాన్ నిర్దోషిగా తీర్చునిచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం


పోలీసుల దర్యాప్తునకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ పరిశీలించిన తర్వాత ఇద్దరు పిల్లలను యుహువాన్ చంపినట్లు నిర్ధారించే ఆదారాలేవీ లభించలేదని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. 27 ఏళ్ల జైలు జీవితం తర్వాత ఈ కేసులో నిర్దోషిగా విడుదలకావడంతో యుహువాన్..ప్రస్తుతం ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గ్లోబల్ టైమ్స్ పత్రిక తెలిపింది.

హత్యా నేరం కింద యుహువాన్ అరెస్టయ్యే నాటికి ఆయనకు ఇద్దరు పిల్లలు ఉండగా...ఇప్పుడు వారిద్దరు పెళ్లి చేసుకుని, పిల్లలతో జీవిస్తున్నారు. తప్పుడు కేసు కారణంగా జీవితంలో తన సంతోషాన్ని పూర్తిగా కోల్పోయానని యుహువాన్ వాపోయాడు. తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారమైనా త్వరగా వస్తే..తన పాత ఇంటిని సరిచేసుకుని, తన తల్లి పోషణను చూసుకుంటూ మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడుపుతానని చెబుతున్నాడు. ఈ కేసుతో చైనా న్యాయ వ్యవస్థలో డొల్లతనం మరోసారి బయటపడిందటూ అంతర్జాతీయ మీడియా విమర్శిస్తోంది.
Published by: Janardhan V
First published: August 6, 2020, 10:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading