Home /News /india-china /

AT TALKS CHINA ADMITS IT LOST 5 SOLDIERS IN GALWAN CLASH MULTIPLY IT BY 3 SAY GOVT SOURCES SK

India-China: గల్వాన్ లోయ ఘర్షణలో చైనా సైనికుల మృతిపై.. తొలిసారి నోరువిప్పిన డ్రాగన్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

''భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోంది. ఇప్పుడు కోవిడ్ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని సరిహద్దుల్లో దుస్సాహసానికి ఒడిగట్టుతోంది.'' అని ఉన్నతాధికారి ఒకరు న్యూస్18తో చెప్పారు.

  చైనా సరిహద్దుల్లో 5 నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. జూన్‌లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. ఆ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరవీరులయ్యారు. దేశం కోసం వారు చేసిన ప్రాణత్యాగానికి యావత్ దేశం సెల్యూట్ చేసింది. వీర సైనికులకు ఘనంగా తుది వీడుకోలు పలికింది. ఐతే గల్వాన్ ఘర్షణలో చైనా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో మరణించారని అప్పట్లోనే అంతర్జాతీయ కథనాలు వచ్చాయి. కానీ చైనా మాత్రం తమ సైనికుల మరణాలపై ఎక్కడా బయటపెట్టలేదు. చివరకు వారి అంత్యక్రియలను కూడా రహస్యంగా చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు కనీసం గౌరవం కూడా ఇవ్వలేదనే విమర్శలను ఎదుర్కొంది. ఐతే ఎట్టకేలకు గల్వాన్ ఘర్షణలో మరణించిన సైనికులపై చైనా మౌనం వీడింది.

  ఈ వారం భారత్, చైనా సరిహద్దుల్లో ఉన్న మోల్డోలో మిలటరీ స్థాయి దౌత్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో తమ సైనికుల మృతి గురించి ప్రస్తావించింది చైనా. గల్వాన్ ఘర్షణల్లో ఐదుగురు సైనికులు చనిపోయారని.. వారిలో చైనీస్ కమాండింగ్ అధికారి కూడా ఉన్నాడని చెప్పినట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి 30 నుంచి 40 మంది చైనా జవాన్లు చనిపోయారని అంతర్జాతీయ మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. కానీ చైనా మాత్రం ఐదుగురే చనిపోయారని చెప్పింది.

  ఈ విషయంపై CNN-News18తో మాట్లాడిన ప్రభుత్వ వర్గాలు.. వాస్తవానికి చైనా చెప్పిన దాని కంటే ఎక్కువ మంది సైనికులు మరణించారని పేర్కొన్నారు. చైనా ఐదుగురు జవాన్లు మరణించారని చెబుతోందని.. దానిని 5తో గుణించడని చెప్పారు. అంటే 15 మంది చైనా జవాన్లు మరణించారని వెల్లడించారు. అంతేకాదు గల్వాన్ ఘర్షణ కంటే ముందు నుంచే సరిహద్దుల్లో చైనా రెచ్చగొడుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మే నుంచే లద్దాఖ్ తూర్పు ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. 2017 డోక్లా వివాదం తర్వాతు.. ఎల్‌ఏసీ వెంబడి కార్యకలాపాలను చైనా ఆర్మీ పెంచిందని స్పష్టం చేశారు. ఐతే భారత సైన్యం ఎప్పటికప్పుడు వారి వ్యూహాలను తిప్పికొట్టిందని పేర్కొన్నారు.

  ''2017 డోక్లా వివాదం తర్వాత ఇరుదేశాల ఒప్పందాలను చైనా ఉల్లంఘిస్తూ వస్తోంది. సాధారణంగా ఎల్‌ఏసీ పెట్రోలింగ్ బృందంలో 15-20 మంది సభ్యులుంటారు. కానీ చైనా మాత్రం ఒక్కో బృందంలో 50-100 మందిని పంపి.. భారత ఆర్మీని రెచ్చగొడుతోంది. ఈ క్రమంలో ఇరువర్గాలు పలుమార్లు ఘర్షణపడ్డారు. భారత్ ఎన్నోసార్లు అభ్యంతరం వ్యక్తం చేసినా.. చైనా మాత్రం పెడచెవిన పెట్టింది. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోంది. ఇప్పుడు కోవిడ్ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని సరిహద్దుల్లో దుస్సాహసానికి ఒడిగట్టుతోంది.'' అని ఉన్నతాధికారి ఒకరు న్యూస్18తో చెప్పారు.

  ఏప్రిల్‌లో ఎల్ఏసీ వెంబడి చైనా బలగాల కదలికలు పెరిగాయి. అదే సమయంలో మన దేశంలో కోవిడ్ విజృంభించింది. ఆర్మీ యూనిట్లలో వైరస్ విస్తరించకుండా ఉండేందుకు పలు కార్యక్రమాలను ఆర్మీ రద్దుచేసింది. అందులో భాగంగానే లద్దాఖ్‌లో ఆర్మీ ఎక్సర్‌‌సైజ్ రద్దయింది. ఇదే అదునుగా చైనా చెలరేగిపోయింది. పెద్ద మొత్తంలో బలగాలను తరలించి.. భారత్ వైపు చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించింది. అప్రమత్తమైన భారత ఆర్మీ కరోనా విషయంలో జాగ్రత్తలు పాటిస్తూనే, ఎల్ఏసీ వెంబడి సైన్యాన్ని మోహరించింది. ఈ క్రమంలో గల్వాన్ ఘర్షణ చోటుచేసుకుంది.

  కాగా, జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయలో తీవ్ర ఉద్రిక్త నెలకొన్న విషయం తెలిసిందే. ఇరుదేశాల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ సహా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అనంతరం సైనికులల్లో మనో స్థైర్యం నింపేందుకు ప్రధాని మోదీ స్వయంగా లద్దాఖ్‌లో పర్యటించారు. ఆ తర్వాత ఇండియా-చైనా మధ్య మిలటరీ స్థాయి చర్చలు జరిగినప్పటికీ.. చైనా తీరు మాత్రం మారలేదు. చర్చలతోనే సమస్యను పరిష్కరించుకుందామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు సరిహద్దుల్లో కవ్విస్తోంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Galwan Valley, India-China, Indo China Tension, Ladakh

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు