Home /News /explained /

ZIKA VIRUS WILL BECOME DANGEROUS AFTER CORONAVIRUS DUE TO ITS SIDE EFFECTS HERE IS THE DETAILS AK GH

Zika Virus: జికా వైరస్ మరో మహమ్మారిలా మారుతోందా ? ఆ వ్యాధులకు కారణమవుతోందా ?..పూర్తి వివరాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత్‌లో గత ఏడాది జనవరి 27న కరోనా పాజిటివ్ కేసును కేరళలో కనుగొన్నారు. సుమారు ఏడాదిన్నర తరువాత, మళ్లీ ఆ రాష్ట్రంలో జికా వైరస్ కలకలం స

దేశంలో ఒకవైపు కరోనా ప్రభావం కొనసాగుతుండగా.. మరోవైపు కేరళలో కొత్తగా వెలుగు చూస్తున్న జికా వైరస్ కేసులు ఆందోళనకు కారణమవుతున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం జికా వైరస్ కేసుల సంఖ్య 19కి చేరింది. వ్యాధుల సీజన్ కావడంతో రానున్న రోజుల్లో ఇది మరింత ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కేరళలో వైరస్ కేసులు పెరగడంతో పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడుతో పాటు మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు హెచ్చరికలు జారీ చేశాయి. దోమల నివారణకు కేరళలోని అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో ఫాగింగ్ చేయడంతో పాటు వైరస్ నిర్ధారణ పరీక్షలను పెంచారు.

భారత్‌లో గత ఏడాది జనవరి 27న కరోనా పాజిటివ్ కేసును కేరళలో కనుగొన్నారు. సుమారు ఏడాదిన్నర తరువాత, మళ్లీ ఆ రాష్ట్రంలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రాజధాని తిరువనంతపురంలో గత వారం రోజులుగా 19 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 24 ఏళ్ల గర్భవతి కూడా ఉంది. జికా వైరస్ సోకిన గర్భిణుల పిల్లల తలలు చిన్న సైజులో ఉంటాయి. వారి మెదడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదు. జికా వైరస్ వ్యాపించిన ప్రపంచ దేశాల్లో చాలామంది పిల్లలు ఇలాంటి రుగ్మతలతో జన్మించారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు దీని గురించి ఎందుకు ఆందోళన చెందుతున్నాయి? జికా వైరస్ ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతుందా? దీన్ని ఎలా నివారించవచ్చు? వంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం.

* జికా వైరస్ అంటే ఏంటి?
జికా అనేది ఫ్లావివిరిడే (Flaviviridae) కుటుంబానికి చెందిన వైరస్. డెంగీ, యెల్లో ఫీవర్, మెనింజైటిస్ (జపనీస్ ఎన్సెఫాలిటిస్), వెస్ట్ నైల్ వైరస్‌లను వ్యాపింపజేసే ఈడెస్ జాతుల దోమల ద్వారా ఇది వ్యాపిస్తుంది. దీనికి ఉగాండాలోని జికా అడవుల పేరు పెట్టారు. 1947లో ఈ అడవిలో ఉండే కోతుల్లో మొదటిసారిగా జికా వైరస్‌ను గుర్తించారు. అనంతరం ఐదు సంవత్సరాల తరువాత, 1952లో ఉగాండా, టాంజానియాలో మానవులలో బయటపడింది. ఆ తరువాత 2007, 2013లో ఫ్రెంచ్ పాలినేషియా, పరిసరాల్లోని అనేక చిన్న దేశాల్లో జికా వైరస్ పెద్ద ఎత్తున వ్యాపించింది.

* జికా వైరస్ దోమలు కాకుండా ఇతర మార్గాల ద్వారా వ్యాపిస్తుందా?
ప్రధానంగా ఈ వైరస్ దోమల నుంచి వ్యాపిస్తుంది. దీంతోపాటు ఒక వ్యక్తి నుంచి మరొకరికి లైంగిక సంబంధాల ద్వారా వ్యాపిస్తుంది. గర్భిణీ స్త్రీ, వారి గర్భంలో పెరిగే బిడ్డపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జికా వైరస్ రక్త మార్పిడి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) చెబుతోంది. అయితే ఈ విషయాన్ని వంద శాతం నిర్ధారించలేదు.

* జికా వైరస్ వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి? దీన్ని ఎందుకు ప్రమాదకరంగా పరిగణిస్తున్నారు?
జికా వైరస్ మైక్రోసెఫాలి అనే రుగ్మతకు కారణమవుతుంది. గర్భిణీ స్త్రీలు జికా వైరస్ బారిన పడినప్పుడు, పుట్టబోయే బిడ్డకు కూడా వైరస్ వ్యాపిస్తుంది. ఫలితంగా శిశువు గర్భంలోనే మైక్రోసెఫాలి అనే రుగ్మతకు గురవుతుంది. దీని వల్ల పుట్టబోయే చిన్నారుల తల పరిమాణం.. ఇతర ఆరోగ్యవంతమైన శిశువులతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. మైక్రోసెఫాలి ఉన్న నవజాత శిశువుల మెదడు కూడా సరిగ్గా అభివృద్ధి చెందదు. బ్రెజిల్‌ సహా జికా వైరస్ వ్యాపించిన దేశాల్లో గుల్లెయిన్-బార్ సిండ్రోమ్ బాధితులు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇది ఒక న్యూరోలాజికల్ డిజార్డర్. ఈ సిండ్రోమ్ పక్షవాతం, మరణానికి కారణమవుతుంది. గుల్లెయిన్-బార్ సిండ్రోమ్ బాధితుల్లో మరణాల రేటు 8.3 శాతంగా ఉన్నట్లు యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది.

* జికా వైరస్ లక్షణాలు ఏంటి?
జికా వైరస్ సోకిన చాలా మందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొంతమందికి చాలా తేలికపాటి లక్షణాలు ఉంటాయి. దోమ కాటు వల్ల కలిగే డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి ఇతర వ్యాధుల మాదిరిగానే జికా వైరస్ లక్షణాలు కూడా ఉంటాయి. అయితే సాధారణ ఫ్లూ లక్షణాలు ఉన్నందువల్ల, తొలినాళ్లలో వైరస్ సోకినట్లు అనుమానం రాదు.

* జికా వైరస్ లక్షణాలు ఎంతకాలం ఉంటాయి?
జికా వైరస్ లక్షణాలు రెండు నుంచి ఏడు రోజుల వరకు ఉంటాయి. సాధారణంగా ఈ వైరస్ కారణంగా ప్రజలు ఆసుపత్రిలో చేరేంత జబ్బు పడరు. జికా వైరస్ వల్ల మరణించే ప్రమాదం చాలా తక్కువ. ఈ కారణంగా చాలా మందికి.. వారు జికా వైరస్ బారిన పడ్డారని కూడా తెలియదు.

* చికిత్స కోసం హాస్పిటల్‌కు ఎప్పుడు వెళ్లాల్సి వస్తుంది?
వైరస్ కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలకు వెళ్లిన వారిలో.. జికా వైరస్ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లక్షణాలు కనిపించిన గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాలి.

* వైరస్‌కు టీకా ఉందా?
జికా వైరస్‌కు ఇప్పటి వరకు వ్యాక్సిన్ రాలేదు. దోమ కాటుకు గురికాకుండా కాపాడుకోవడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే.. ఈ వైరస్ బారిన పడకుండా కాపాడుకునేందుకు ఉన్న ఉత్తమ మార్గాలు.

* జికా వైరస్ నివారణ మార్గాలు ఏవి?
ముందు దోమ కాటుకు గురికాకుండా కాపాడుకోవాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. పొడవైన చేతులు ఉండే చొక్కా, ప్యాంటు ధరించాలి. ఏసీ గదుల్లో ఉండేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంటి తలుపులు, కిటికీలకు దోమలను నిరోధించే మెష్‌లు ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో దోమలు వృద్ధి చెందకుండా, నీరు నిలవకుండా చూసుకోవాలి. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీలైతే దోమలను వికర్షించే లేపనాలు వాడాలి. అయితే నవజాత శిశువులకు, రెండు నెలల లోపు పిల్లలకు వీటిని ఉపయోగించకూడదు. చిన్న పిల్లలకు దోమతెరలను వాడాలి. ముఖ్యంగా జికా వైరస్ కేసులు ఉన్న ఏ ప్రదేశానికి వెళ్లవద్దు.

* ఒకవేళ జికా వైరస్ వస్తే ఏం చేయాలి?
జికా వైరస్‌కు చికిత్స చేసే మందులు ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. అయితే వ్యాధి లక్షణాల ఆధారంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. వైరస్ సోకినవారు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. డీ హైడ్రేషన్‌కు గురికాకుండా నీరు ఎక్కువగా తాగాలి. జ్వరం, ఒళ్లు నొప్పులను తగ్గించడానికి పారాసెటమాల్ మాత్రలు తీసుకోవచ్చు. ఆస్ప్రిన్, ఇతర నాన్- స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్ (NSAID)లను తీసుకోవద్దు. ఇతర వ్యాధులకు మందులు వాడేవారు డాక్టర్ల సలహాతో మెడిసిన్ తీసుకోవాలి.

* బాధితుల నుంచి ఇతరులకు వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
బాధితుల శరీర ద్రవాలైన రక్తం, లాలాజలం, వీర్యం వంటి వాటికి ఇతరులు దూరంగా ఉండాలి. సురక్షితం కాని శారీరక సంబంధాలకు దూరంగా ఉండాలి. బాధితుల కుటుంబ సభ్యులు దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తపడాలి. దోమతెరలు వాడటంతో పాటు బాధితులకు గర్భిణులు దూరంగా ఉండాలి.

* జికా వైరస్ రోగుల సంరక్షకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
వైరస్ సోకిన వారి రక్తం, ఇతర శరీర ద్రవాలను సంరక్షకులు నేరుగా చేతులతో తాకకూడదు. హ్యాండ్ మాస్క్‌లు లేకుండా రక్తం లేదా ఇతర శరీర ద్రవాలు పడిపోయిన ప్రదేశాలను శుభ్రం చేయకూడదు. వీరి వద్దకు వెళ్లి వచ్చిన తరువాత సబ్బు, నీటితో చేతులను బాగా కడగాలి. బాధితుల రక్తం లేదా ఇతర శరీర ద్రవాలు పడిన ప్రాంతాలను వీలైనంత త్వరగా క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి.

* భారత్‌లో జికా వైరస్ ఇంతకు ముందు వ్యాపించిందా?
జికా వైరస్ కేసులు 1952-53లోనే భారత్‌లో మొదటిసారి వెలుగుచూశాయి. 2017 మేలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో మూడు కేసులను కనుగొన్నారు. దీంతోపాటు 2017 జులైలో.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో కూడా ఒక జికా వైరస్ కేసు బయటపడింది. చివరిసారిగా 2018లో రాజస్థాన్‌లో 80 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Zika Virus

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు