Explainer: Stock Market: స్మాల్​, మిడ్​క్యాప్స్​లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్- సెన్సెక్స్​, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్- నిఫ్టీపై గత నెల రోజుల్లో కరోనా రెండో వేవ్ ప్రభావం కనిపించలేదు. మార్కెట్లలో మిడ్​ క్యాప్​, స్మాల్​క్యాప్​ సంస్థల షేర్లు బాగా పెరిగాయి.

  • Share this:
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్- సెన్సెక్స్​, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్- నిఫ్టీపై గత నెల రోజుల్లో కరోనా రెండో వేవ్ ప్రభావం కనిపించలేదు. మార్కెట్లలో మిడ్​ క్యాప్​, స్మాల్​క్యాప్​ సంస్థల షేర్లు బాగా పెరిగాయి. మిడ్​క్యాప్​ షేర్లు 10 శాతం, స్మాల్​క్యాప్​ షేర్లు దాదాపు 20 శాతం వరకు వృద్ధి చెందాయి. అయితే ఈ తరుణంలో ఈ తరహా సంస్థల్లో పెట్టుబడి పెట్టే ముందు చాలా మదుపరులు (ఇన్వెస్టర్లు) జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫండమెంటల్స్​ బలంగా లేని సంస్థల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఇంకా జాగ్రత్త పడాలంటున్నారు. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా లార్జ్​, మిడ్​, స్మాల్​ క్యాప్​ సంస్థల్లో పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్​లో కొత్తగా వచ్చిన ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్​ను సూచిస్తున్నారు. అసలు మిడ్​, స్మాల్​ క్యాప్స్​ సంస్థల షేర్లలో ప్రస్తుతం రిస్క్, ప్రత్యామ్నాయాల గురించి తెలుసుకుందాం.

బీఎస్​ఈలో మిడ్​క్యాప్​, స్మాల్ క్యాప్​ షేర్లు గత మూడు నెలలుగా దూసుకెళుతున్నాయి. అలాగే జూన్​ 1 నుంచి సెన్సెక్స్​ 1.5 శాతం వృద్ధి చెందితే.. అదే మిడ్​క్యాప్​, స్మాల్​ క్యాప్ సూచీలు వరుసగా 2.6 శాతం, 5.5 శాతం పెరిగాయి. ముఖ్యంగా మార్కెట్లు గణనీయంగా పెరుగుతున్నప్పుడు మిడ్​, స్మాల్​క్యాప్స్ మరింత వేగంగా పైపైకి వెళతాయి. ఎందుకంటే ఆ సమయంలో భారీ ఇన్వెస్టర్లతో పాటు రిటైలర్లు ఆ షేర్లను కొనుగోలు చేస్తారు.

అయితే ఫండమెంటల్స్ బలహీనంగా ఉన్న సంస్థల షేర్ల విలువ కూడా గత రెండు నెలలుగా బాగా పెరిగాయి. ఈ విషయంలో రిటైల్​ మదుపరులు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ రాబడి ఆశించి.. ఫండమెంటల్స్ సరిగా లేని సంస్థల్లో ఇప్పుడు పెట్టుబడి పెట్టవద్దని సూచిస్తున్నారు. సంస్థ వివరాలను నిశితంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. స్మాల్​, మిడ్​క్యాప్​ విభాగాల్లోనూ మంచి వ్యాపార ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు చాలానే ఉన్నాయి. అయితే మార్కెట్​ కరెక్షన్ జరిగి అవి కూడా కొంతమేర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్​ నిపుణులు అంచనా వేస్తున్నారు.

“మిడ్​, స్మాల్​ క్యాప్స్​లో భారీ ఇన్వెస్టర్లు.. పెట్టుబడులు పెట్టడంతో వాటి విలువ వేగంగా పెరిగింది. మార్కెట్లోకి డబ్బు ఎక్కువగా చేరింది. ఒకవేళ వారు ఆ షేర్లలో పెట్టుబడులు ఉపసంహరించుకుంటే పడిపోతాయి. మిడ్​, స్మాల్ క్యాప్స్​లో లిక్విడిటీ తక్కువవుతుంది” అని మార్కెట్ నిపుణులు సీజే జార్జ్​ చెప్పారు. ప్రస్తుత తరుణంలో ఇన్వెస్టర్లు చిన్న కంపెనీల వైపు తక్కువగా చూస్తేనే మేలనేది నిపుణులు మాట. వీటి స్థానంలో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్​ వైపుగా మదుపులు మొగ్గుచూపితే మంచిదంటున్నారు.

* ఫ్లెక్సీక్యాప్​లు ఎందుకంటే..
లార్జ్​, స్మాల్, మిడ్​క్యాప్​ సంస్థల్లో గతం వరకు ఎంత శాతమైనా ఇన్వెస్ట్ చేసేందుకు మల్టీక్యాప్ ఫండ్స్​కు అనుమతి ఉండేది. అయితే ప్రతీ విభాగంలో కనీసం 25 శాతం పెట్టుబడి ఉండాలని సెబీ కొత్తగా నిబంధనలు తెచ్చింది. అదే ఫ్లెక్సీ క్యాప్​ ఫండ్స్​కు ఈ నిబంధన లేదు. ఏ క్యాప్స్​లో ఎంత శాతమైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. దీంతో ఫ్లెక్సీ క్యాప్​ ఫండ్స్​లో పెట్టుబడులు పెడితే ఇన్వెస్టర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని మార్కెట్ నిపుణులు కొందరు సూచిస్తున్నారు.
Published by:Sumanth Kanukula
First published: