హోమ్ /వార్తలు /Explained /

వాతావరణ మార్పులతో అనారోగ్యానికి గురైన కెనడా మహిళ.. ఆ సమస్యే అసలు కారణమా ?

వాతావరణ మార్పులతో అనారోగ్యానికి గురైన కెనడా మహిళ.. ఆ సమస్యే అసలు కారణమా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కెనడియన్ బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని ఎమర్జెన్సీ రూమ్ లో సేవలందిస్తున్న డాక్టర్ కైల్ మెరిట్ వాతావరణ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం స్థానిక కార్చిచ్చు (wildfire) పొగ కారణంగానే అలసట, డీహైడ్రేషన్, శ్వాసకోశ సమస్యలతో రోగులు ఆసుపత్రికి క్యూ కట్టారన్నారు.

ఇంకా చదవండి ...

గత శతాబ్ద కాలంలో చోటు చేసుకున్న వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచ వినాశనం తప్పదని పర్యావరణ శాస్త్రవేత్తలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. భూతాపం పెరిగి భూమి విధ్వంసమయ్యే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే భయపెట్టే మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో భూగోళం అగ్నిగుండంగా మారనుందా? వేడిమితో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోనున్నాయా? అనే సందేహాలు రాకమానదు.

గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదకర వాతావరణ స్థితిగా మారిందని ఒక కెనడా డాక్టర్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. కెనడాలోని ఓ వైద్యుడు.. తలనొప్పి, డీహైడ్రేషన్ గురించి ఫిర్యాదు చేసిన వృద్ధ మహిళకు వైద్య పరీక్షలు చేశారు. వాతావరణ మార్పు అనే అనారోగ్య సమస్యను ఆమె ఎదుర్కొంటున్నారని ఆయన నిర్ధారించారు. దాంతో క్లైమేట్ చేంజ్ బారినపడిన తొలి వ్యక్తిగా ఈమె నిలిచారు. వాతావరణ సంక్షోభం హానికరమైన ప్రభావాలకు దారితీస్తుందని కుండ బద్దలు కొట్టడమే ఈ వైద్యుని ముఖ్య ఉద్దేశమని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో కెనడా మహిళలు క్లైమేట్ చేంజ్ (వాతావరణ మార్పు) బారిన ఎందుకు పడుతున్నారు? భూతాపం వల్ల ప్రజలు నిజంగా రోగాల పాలవుతారా? వంటి విషయాలు తెలుసుకుందాం.

* క్లైమేట్ చేంజ్ వ్యాధి నిర్ధారణ అంటే ఏంటి?

ఈ ఏడాది నార్తర్న్ హెమీస్పియర్ (ఉత్తరార్ధగోళం- Northern Hemisphere)లో వేసవికాలంలో పసిఫిక్ నార్త్‌వెస్ట్ వడగాల్పులతో కొలిమిలా మారింది. సమశీతోష్ణ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదయ్యే ప్రాంతాల్లో ఎయిర్ కండిషనింగ్‌ అవసరం లేదని అక్కడి నివాసులు భావించేవారు. కానీ ఇప్పుడు ఉష్ణోగ్రతలు భరించలేనంతగా నమోదవుతున్నాయి. దాంతో వందలాది మంది చనిపోతున్నారు. రోజుల తరబడి వేడిగాలుల ప్రభావం అధికమవుతుంటే.. గత అధిక-ఉష్ణోగ్రత రికార్డులు బద్దలవుతున్నాయి.

కెనడియన్ బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని ఎమర్జెన్సీ రూమ్ లో సేవలందిస్తున్న డాక్టర్ కైల్ మెరిట్ వాతావరణ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం స్థానిక కార్చిచ్చు (wildfire) పొగ కారణంగానే అలసట, డీహైడ్రేషన్, శ్వాసకోశ సమస్యలతో రోగులు ఆసుపత్రికి క్యూ కట్టారన్నారు. ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. 70 ఏళ్ల వయస్సులో ఉన్న ఓ మహిళా రోగి తన చుట్టూ సంభవించే వాతావరణ మార్పులతో ఉక్కిరిబిక్కిరయ్యారన్నారు. మధుమేహం, గుండె జబ్బులతో బాధపడుతున్న ఈ రోగి హైడ్రేటెడ్‌గా ఉండటానికి కష్టపడుతుండగా ఆమె ఆరోగ్య సమస్యలన్నీ అధ్వాన్నంగా మారాయని డాక్టర్ మెరిట్ గుర్తించారు.

వాతావరణ మార్పుల ప్రభావం లేకుండా వడగాల్పులు సంభవించడం అసాధ్యమని అధ్యయనాలు తెలిపాయి. రాబోయే కొన్ని దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో వడగాల్పులు రెండు నుంచి ఏడు రెట్లు ఎక్కువగా వీస్తాయని రీసెంట్ స్టడీల అంచనా. మహిళల్లో అనారోగ్య సమస్యలకు దారితీసే వాతావరణ మార్పులను వివరించాలని డాక్టర్ మెరిట్ నిర్ణయించుకున్నారు. వాతావరణ మార్పుల ప్రతికూల పరిణామాలు సాధారణంగా అర్థం చేసుకునే దానికంటే లోతైనవి, మరింత విస్తృతమైనవని చెప్పుకొచ్చారు.

* ఈ మెడికల్ కేసును క్లైమేట్ చేంజ్ గా డాక్టర్ ఎందుకు నిర్ధారించారు?

"రోగానికి మూల కారణం ఏంటనేది మనం సరిగా నిర్ధారించడం లేదు. అనారోగ్య లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తున్నాం. అందుకే వ్యాధులను సమూలంగా నయం చేయలేకపోతున్నాం. వాతావరణం మార్పు కారణంగా బాధపడేవారిలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. తీవ్ర వాతావరణ మార్పుల వల్ల బలహీనమైన వారే అల్లాడిపోవడం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది." అని డాక్టర్ చెప్పుకొచ్చారు. పేద ప్రజలు, అలాగే పేద దేశాల్లో నివసించే ప్రజలను వాతావరణ మార్పులు పట్టిపీడిస్తున్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు.

కార్బన్ ఉద్గారాలు, కాలుష్యం, ప్రపంచ వాతావరణ సంక్షోభమే ప్రపంచ విధ్వంసానికి కారణమని వేలెత్తి చెబుతున్న క్రమంలో వాటిని కట్టడి చేయాలనే ఒత్తిడి ప్రభుత్వాలపై పెరుగుతోంది. గాలి కాలుష్యం కారణంగా 2013లో ఓ 9 ఏళ్ల చిన్నారి చనిపోయినట్లు 2020 ఇన్వెస్టిగేషన్ తేలింది. గాలి కాలుష్యం కారణంగా ఆస్తమా వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ అని వైద్యులు స్పష్టీకరించారు. ఈ క్రమంలో వాతావరణ మార్పుల కారణంగా వ్యాధులు తలెత్తుతున్నాయని.. క్లైమేట్ చేంజ్ ను కట్టడి చేయడం ఎంతైనా ముఖ్యమని డాక్టర్లు భావిస్తున్నారు. అందుకే తాజాగా కెనడియన్ డాక్టర్ వ్యాధికి క్లైమేట్ చేంజే మూలమని నిర్ధారించారు.

* వాతావరణ మార్పుల వల్ల రోగాల పాలవుతారా?

వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలతో 65 ఏళ్లు పైబడిన వారిలో వేడి-సంబంధిత మరణాలు గత 20 ఏళ్లలో 50 శాతానికి పైగా పెరిగాయని బ్రిటిష్ మెడికల్ జర్నల్(BMJ)లోని ఓపెన్ లెటర్ పేర్కొంది. పిల్లలు, వృద్ధులతో సహా మైనారిటీలు, పేద వర్గాలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారి ఆరోగ్యం వాతావరణ మార్పుల కారణంగా మరింత తీవ్రతరం అవుతుందని ఓపెన్ లెటర్ వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్, మూత్రపిండాల పనితీరు తగ్గిపోవడం, చర్మ సంబంధిత వ్యాధులు రావడంతో సహా ఉష్ణమండల ఇన్‌ఫెక్షన్‌లు, మానసిక, గర్భధారణ సమస్యలు, అలెర్జీలు, హృదయ, ఊపిరితిత్తుల వ్యాధులు, మరణాలు పెరిగాయని ఆ లేఖ పేర్కొంది.

వాతావరణ మార్పుల కారణంగా ప్రతి సంవత్సరం 1.5 లక్షల మంది చనిపోతున్నారని డబ్ల్యూహెచ్‌ఓ డేటా చెబుతోంది. 2030 నాటికి ఏడాదికి మూడు లక్షల మంది వాతావరణ మార్పుల కారణంగా బలయ్యే అవకాశముందని డబ్ల్యూహెచ్‌ఓ డేటా అంచనావేసింది. ఉష్ణోగ్రత పెరిగితే దోమల సంఖ్య పెరిగి డెంగీ, మలేరియా, తదితర ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతాయని ఇప్పటికే నిరూపితమైంది.

Revanth Reddy: హైకమాండ్ ముఖ్యనేత ప్రశ్న.. రేవంత్ రెడ్డి నిర్ణయాలు మారనున్నాయా ?

K Chandrashekar Rao: వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. కేసీఆర్ లెక్కేంటి ?

* కానీ మందులు లేనప్పుడు వాతావరణ మార్పుల నిర్ధారణ వల్ల ఒనగూరే ప్రయోజనాలేంటి..?

వాతావరణ మార్పును తన రోగి ఆరోగ్య సమస్యలకు కారణమని వివరించడంలో డాక్టర్ మెరిట్ ముందడుగు వేయడం వల్ల దాని హానికరమైన ప్రభావాలను పరిష్కరించడానికి అందరూ పాటుపడే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాక్టర్ మెరిట్ చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారని.. ఆయన వల్ల వాతావరణ మార్పు ఆరోగ్యానికి హానికరమనే వాస్తవాన్ని వైద్య నిపుణులు తెలుసుకుంటున్నారని ఒక నివేదిక పేర్కొంది. వాతావరణ మార్పులు కూడా అనారోగ్యానికి కారకాలు అని వైద్యులు చెబుతున్న నేపథ్యంలో వీటిపై పలు అధ్యయనాలు కూడా జరుగుతాయని.. తద్వారా మరణాలు తగ్గుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

First published:

Tags: Canada, Global warming

ఉత్తమ కథలు