Delta Plus Variant: రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా డెల్టా ప్లస్ వేరియంట్ సోకుతుందా? దీని వల్లే థర్డ్ వేవ్‌ వస్తుందా ?

ప్రతీకాత్మక చిత్రం

Delta Plus Variant: డెల్టా ప్లస్ వేరియంట్ ప్రధానంగా మూడు లక్షణాలను కలిగి ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం, ఊపిరితిత్తుల కణాలకు నేరుగా అంటుకుపోవడం, మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు లొంగకపోవడం.. వంటి లక్షణాలు ఈ వైరస్‌లో ఉన్నాయి.

  • Share this:
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. దీంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. అయితే మహమ్మారి ముప్పు తగ్గిపోతుందని ప్రజలు సంతోషించేలోపే.. కొత్త రకం డెల్టా ప్లస్ వేరియంట్ భయాందోళనలు కలిగిస్తోంది. కరోనా వైరస్ ఏడాదిన్నర కాలంలో అనేక రకాలుగా ఉత్పరివర్తనం చెందింది. వీటిలో కొన్ని వేరియంట్లు ప్రాణాంతకంగా మారాయి. ఈ క్రమంలో భారత్‌లో బయటపడ్డ డెల్టా వేరియంట్.. దేశంలో రెండో దశ కరోనా ఉద్ధృతికి కారణమైందని పరిశోధనలు తెలిపాయి. ఆ తరువాత ఇతర దేశాలకు సైతం డెల్టా రకం వైరస్ వ్యాపించింది. ఇప్పుడు దీని నుంచి కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్‌ ఉత్పరివర్తనం చెందినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.

దేశంలోని చాలా రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడుతున్నాయి. దీంతో రాష్ట్రాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ కొత్త వేరియంట్.. భారత్‌లో థర్డ్ వేవ్‌కు కారణం కావచ్చని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో ప్రజలందరూ వీలైనంత తొందరగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త కరోనా ఉత్పరివర్తనాలు, వాటిపై టీకాల పనితీరు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

* వేగంగా వ్యాపించే సామర్థ్యం
డెల్టా ప్లస్ కరోనావైరస్ వేరియంట్ కేసులు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో నమోదయ్యాయి. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ దీన్ని ఆందోళన రకం (variant of concern-VoC)గా వర్గీకరించింది. దీంతోపాటు వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ప్రస్తుతానికి డెల్టా ప్లస్ వేరియంట్‌ను భారత్‌ సహా తొమ్మిది దేశాల్లో కనుగొన్నారు. అమెరికా, బ్రిటన్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జపాన్, పోలాండ్, నేపాల్, చైనా, రష్యాలో ఈ వేరియంట్ కేసులను గుర్తించారు.

డెల్టా ప్లస్ వేరియంట్ ప్రధానంగా మూడు లక్షణాలను కలిగి ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం, ఊపిరితిత్తుల కణాలకు నేరుగా అంటుకుపోవడం, మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు లొంగకపోవడం.. వంటి లక్షణాలు ఈ వైరస్‌లో ఉన్నాయి. అందువల్ల రానున్న రోజుల్లో ఇది ప్రజలకు మరింత ముప్పుగా మారే అవకాశం ఉందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. అయితే దీని వ్యాప్తి, దేశంలో థర్డ్ వేవ్‌ వాదనలు ఊహాగానాలేనని కొందరు తోసిపుచ్చుతున్నారు.

* డెల్టాప్లస్‌ను వ్యాక్సిన్లు నిరోధిస్తాయా?
ప్రారంభంలో దేశాలకు పాకిన అసలైన కోవిడ్ స్ట్రెయిన్‌లను నిరోధించడానికి శాస్త్రవేత్తలు వ్యాక్సిన్లను అభివృద్ధి చేశారు. అంటే ఆ తరువాత కొత్తగా పుట్టుకొచ్చిన ఆల్ఫా వేరియంట్, డెల్టా వేరియంట్, ఇతర కొత్త వేరియంట్లను.. టీకాల ద్వారా మన శరీరంలో అభివృద్ధి చెందే యాంటీబాడీలకు లొంగకుండా తప్పించుకోగలవని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. మానవ రోగనిరోధకత వ్యవస్థ నుంచి తప్పించుకునే లక్షణాలు కొత్త వేరియంట్లలో ఉండటంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రపంచ దేశాల్లో వినియోగంలో ఉన్న కొన్ని వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్‌పై సమర్థంగా పనిచేస్తాయని అధ్యయనాల్లో తేలింది. కానీ ప్రస్తుతం డెల్టా ప్లస్ వేరియంట్‌ నుంచి వ్యాక్సిన్లు రక్షణ కల్పించగలవా లేదా అనే అంశాన్ని నిపుణులు ఇంకా నిర్ధారించలేదు.

* రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా డెల్టా ప్లస్ సోకుతుందా?
రాజస్థాన్‌లో మొట్టమొదటి కరోనావైరస్ డెల్టా ప్లస్ వేరియంట్‌ను బికనెర్‌లో కనుగొన్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 65 ఏళ్ల వృద్ధురాలి నుంచి శాంపిల్స్‌ను సేకరించి.. మే 30న పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి జన్యు విశ్లేషణ కోసం పంపారు. ఈ రిపోర్టు గత శుక్రవారం వచ్చిందని తెలిపారు బికనెర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఓ పి చాహర్. రాష్ట్రంలో నమోదైన మొదటి డెల్టా ప్లస్ వేరియంట్ కేసు ఇదేనని వివరించారు. ఆమె అంతకు ముందే రెండు డోసుల వ్యాక్సిన్ కూడా తీసుకుంది. అయినా కూడా ఆమెకు కొత్త వేరియంట్ సోకినట్లు జన్యు విశ్లేషణలో తేలింది. అయితే బాధితురాలికి ఎలాంటి లక్షణాలు లేకుండా కోవిడ్ నిర్ధారణ అయినట్లు చాహర్ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే.. కొత్త డెల్టా ప్లస్ వేరియంట్ రెండు డోసుల టీకాలు తీసుకున్న వారికి, గతంలో వైరస్ సోకి కోలుకున్న వారికి కూడా వ్యాపించగలదని తెలుస్తోంది.

* దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
భారత్‌లో ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే.. సెకండ్ వేవ్‌లో కరోనా తీవ్రమైన ప్రభావం చూపింది. మొదటి దశ తరువాత ప్రజలు కోవిడ్ మార్గదర్శకాలను వదిలేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రెండో దశలో వైరస్ విజృంభించింది. ఇప్పుడిప్పుడే రెండో దశ ఉద్ధృతి తగ్గుతున్నందువల్ల ప్రజలందరూ కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలి. కొత్త వేరియంట్ల వ్యాప్తికి ప్రజల నిర్లక్ష్యం తోడైతే.. రానున్న రోజుల్లో కఠినమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీంతో పాటు ప్రస్తుతం వైరస్ నుంచి రక్షణ కల్పించే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే. ప్రస్తుతం వినియోగంలో ఉన్న అన్ని రకాల కోవిడ్ వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని తేలింది. డెల్టా వేరియంట్‌ సహా కొత్త వేరియంట్‌లపై కొన్ని టీకాలు సమర్థంగా పనిచేస్తున్నట్లు ఇటీవల నిర్వహించిన అధ్యయనాలు వెల్లడించాయి. అందువల్ల సాధ్యమైనంత త్వరగా ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు కరోనా మార్గదర్శకాలు పాటించడం ద్వారా వైరస్ ముప్పును తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published: