దేశంలో కరోనా కేసులకు డబుల్ మ్యుటెంట్ కారణమా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు ?

ప్రతీకాత్మక చిత్రం

భారత్‌లో వెలుగుచూసిన డబుల్ మ్యుటెంట్ కరోనా వైరస్ ఒకటి. దీన్నే B.1.617 వేరియంట్‌గా గుర్తించారు. దీంట్లో E484Q, L425R అనే రెండు మ్యుటేషన్లు ఉన్నాయి.

  • Share this:
దేశంలో కరోనా కేసులకు డబుల్ మ్యుటెంట్ కారణమా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు ?
భారత్‌లోని అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో రోజువారీ కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల సంఖ్య ప్రతిరోజూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. రెండోదశ కరోనా కేసుల వ్యాప్తికి డబుల్ మ్యుటేషన్ వైరస్ కారణమని నిపుణులు భావిస్తున్నారు. దీని వ్యాప్తి, తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే మరణాలు రేటు భారీగా పెరుగుతోంది. కేసుల పెరుగుదల ఆందోళనకరమైన విషయమని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో రెండో దశ కరోనా కేసుల పెరుగుదల, డబుల్ మ్యుటెంట్ ప్రభావంపై న్యూస్ 18 వార్తాసంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ అపర్ణ ముఖర్జీతో మాట్లాడింది. కొత్త వేరియంట్లు, వాటి తీవ్రత గురించి ఆమె ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు...

డబుల్ మ్యుటెంట్ కరోనా వైరస్ అంటే ఏంటి? ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుందా?
గత ఏడాది వెలుగు చూసిన కరోనా వైరస్ క్రమంగా రూపాంతరం చెందింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ఇలాంటి వాటిలో భారత్‌లో వెలుగుచూసిన డబుల్ మ్యుటెంట్ కరోనా వైరస్ ఒకటి. దీన్నే B.1.617 వేరియంట్‌గా గుర్తించారు. దీంట్లో E484Q, L425R అనే రెండు మ్యుటేషన్లు ఉన్నాయి. ఈ మ్యుటేషన్లకు వేగంగా వ్యాపించే సామర్థ్యం ఉందని పరిశోధనల్లో తేలింది. E484Q రోగనిరోధక వ్యవస్థకు చిక్కకుండా తప్పించుకోగలదు. L425R మ్యుటేషన్‌కు వేగంగా వ్యాపించే సామర్థ్యం ఉంది.

ప్రమాదకరంగా మారుతున్న కొత్త రకం వైరస్‌లను ‘వేరియంట్ ఆఫ్‌ కన్సర్న్’గా గుర్తిస్తున్నారు. డబుల్ మ్యుటెంట్ వైరస్ ఈ విభాగంలోకి వస్తుందా?
రూపాన్ని మార్చుకుంటున్న కరోనా వైరస్‌.. దాని తీవ్రతను, వ్యాప్తి సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటోంది. ఇలాంటి కొత్త స్ట్రెయిన్లు ఎక్కువ మరణాలకు దారితీసి, మరింత ప్రమాదకరంగా మారితే.. దాన్ని ‘వేరియంట్ ఆఫ్‌ కన్సర్న్’గా గుర్తిస్తారు. ఇవి ప్రజారోగ్య వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఇప్పటి వరకు మన దేశంలో గుర్తించిన డబుల్ మ్యుటెంట్‌ను ఈ విభాగంలో చేర్చలేదు.

దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తికి డబుల్ మ్యుటెంట్ కారణంగా చెప్పుకోవచ్చా?
ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో డబుల్ ముటెంట్‌ను పరిశోధకులు గుర్తించారు. కానీ రెండో దశ కేసుల పెరుగుదలకు కొన్ని నెలల ముందే డబుల్ మ్యుటెంట్‌ను గుర్తించారు. అందువల్ల ప్రస్తుతం కరోనా తీవ్రత పెరగడానికి ఈ కొత్త వేరియంటే కారణమని చెప్పడం కష్టం.

జన్యు విశ్లేషణ అంటే ఏంటి? ఇంతకు ముందుతో పోలిస్తే దీనికి ఎందుకు ఇప్పుడు ప్రాధాన్యం పెరుగుతోంది?
జన్యు విశ్లేషణ లేదా జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా వైరస్ తన రూపాన్ని ఎలా మార్చుకుంటుందో గుర్తించవచ్చు. కొత్త వైరస్ వేరియంట్ల నివారణ పద్ధతులు, నియంత్రణ కోసం తీసుకోవలసిన చర్యలు తెలుసుకోవడానికి జన్యు విశ్లేషణ అవసరమవుతోంది.

డబుల్ మ్యుటెంట్ విషయంలో జన్యు విశ్లేషణ ఎలా సహాయపడింది? మన ప్రజారోగ్య వ్యవస్థలకు మార్గనిర్దేశం చేయడానికి, మూడో దశ వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందా?
జన్యు విశ్లేషణ వల్ల మన దగ్గర ఎలాంటి వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నాయో తెలుసుకోవడం సాధ్యమైంది. డబుల్ మ్యుటెంట్‌ను దీని ద్వారానే గుర్తించారు. కానీ కొత్త వేరియంట్లకు ఇతర చికిత్స పద్ధతులు లేవు. కోవాగ్జిన్ టీకాలు ఈ మ్యూటేషన్లను నిర్వీర్యం చేయగలవని పరిశోధనల్లో గుర్తించారు. ఇతర వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని గుర్తించడానికి మరింత డేటా అవసరం. కోవిడ్ మార్గదర్శకాలు పాటించడం ద్వారానే వైరస్ మూడోదశలో విజృంభించకుండా నియంత్రించడం సాధ్యమవుతుంది. గతంలో కరోనా బారిన పడినా, వ్యాక్సిన్ తీసుకున్నా వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయడం ద్వారా కూడా మరో దశ కోవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చు.
First published: