Home /News /explained /

WHY OIL AND GAS COMPANIES ARE SEARCHING FOR GREEN ENERGY OPTIONS EXPLAINED JNK GH

Green Energy: చమురు, గ్యాస్ కంపెనీలు గ్రీన్ ఎనర్జీ ఆప్షన్ల కోసం ఎందుకు అన్వేషిస్తున్నాయి? పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను కంపెనీలు చేరుకుంటున్నాయా?

చమురు, గ్యాస్ కంపెనీలు గ్రీన్ ఎనర్జీ ఆప్షన్ల కోసం ఎందుకు అన్వేషిస్తున్నాయి?  (Representational Image)

చమురు, గ్యాస్ కంపెనీలు గ్రీన్ ఎనర్జీ ఆప్షన్ల కోసం ఎందుకు అన్వేషిస్తున్నాయి? (Representational Image)

ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) సైతం పునరుత్పాదక ఇంధన వనరుల్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.

శిలాజ ఇంధన వనరుల వెలికితీతలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కొనేందుకు, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకు ఆయిల్, గ్యాస్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. తాజాగా ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) సైతం పునరుత్పాదక ఇంధన వనరుల్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. 2040 నాటికి 10 GW (గిగా వాట్లు) పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని చేరుకోవడానికి ఇన్‌ఆర్గానిక్ ఇన్వెస్ట్‌మెంట్లను పరిశీలిస్తోంది. ఈ విభాగానికి చెందిన ఇతర చమురు, గ్యాస్ PSUలు కూడా పునరుత్పాదక శక్తిలో పెట్టుబడులు పెడుతున్నాయి.

* పునరుత్పాదక శక్తి (renewable energy)పై కంపెనీలు దృష్టిపెట్టడానికి కారణం?
ప్రపంచ దేశాలపై వాతావరణ మార్పులు స్పష్టమైన ప్రభావం చూపిస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. దీంతో పర్యావరణంపై ప్రభావం చూపుతున్న కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆయిల్, గ్యాస్ కంపెనీలు కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తున్నాయి. దీంతో పునరుత్పాదక శక్తిపై పెట్టుబడులు పెడుతున్నాయి.

ప్రభుత్వం నిర్దేశిస్తోన్న పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను చేరుకోవడానికి ఆయిల్, గ్యాస్ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం భారతదేశం 100 GW వ్యవస్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, 2030 నాటికి దాదాపు దీన్ని 450 GW వరకు పెంచాలని భారత ప్రభుత్వం నిర్దేశించింది.

* భారత కంపెనీలు లక్ష్యాలను చేరుకుంటున్నాయా?
భారతదేశంలోని అతిపెద్ద అప్‌స్ట్రీమ్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ అయిన ONGC.. 2040 నాటికి 10 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2020 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇది 178 మెగావాట్లు (MW)గా ఉంది. పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను సాధించేందుకు కొనుగోళ్లను (acquisitions) పరిశీలిస్తున్నట్లు తెలిపారు ONGC చైర్మన్ సుభాష్ కుమార్. భారత అగ్రశ్రేణి నేచురల్ గ్యాస్ కంపెనీ గెయిల్ సైతం 130 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియో లక్ష్యాన్ని చేరుకునేందుకు కొనుగోళ్లు జరుపుతోంది. మూడు, నాలుగు సంవత్సరాలలోపు 1 GW పునరుత్పాదక సామర్థ్యాన్ని చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

డౌన్‌స్ట్రీమ్ సంస్థలు సైతం పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి. భారతదేశంలో అతిపెద్ద రిఫైనర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, 2021 ఆర్థిక సంవత్సరం చివర్లో మొత్తం 233 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇప్పటికే 29 రిటైల్ ఫ్యూయల్ అవుట్‌లెట్లలో 257 ఎలక్ట్రిక్ ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను కూడా సంస్థ ఏర్పాటు చేసింది. బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని, భవిష్యత్తులో పెద్ద స్థాయిలో ఈ సేవలను అందించడానికి సన్ మొబిలిటీతో జాయింట్ వెంచర్ కోసం చూస్తోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను కూడా ఐఓసి మథురలో ఏర్పాటు చేస్తోంది.

ఎలక్ట్రికల్ వాహనాలు, స్టేషనరీ స్టోరేజ్ కోసం అల్యూమినియం-ఎయిర్ టెక్నాలజీ ఆధారిత బ్యాటరీ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఇండియన్ ఆయిల్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు ఇజ్రాయెల్ బేస్డ్ బ్యాటరీ టెక్నాలజీ స్టార్టప్ ఫైనర్జీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకుంది. దేశవ్యాప్తంగా వివిధ రిటైల్ పాయింట్లలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ టాటా పవర్‌తో జతకట్టింది. ఈ సంస్థ ఇప్పటికే దాదాపు 133 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో 100 మెగావాట్ల పవన శక్తి సామర్థ్యం కూడా ఉంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సైతం 2020 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 43 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ఏర్పాటు చేసింది.
Published by:John Naveen Kora
First published:

Tags: Indian Oil Corporation, ONGC

తదుపరి వార్తలు