Home /News /explained /

Archie: హ్యారీ, మేగన్‌ల కుమారుడు ఆర్చీ.. ప్రిన్స్ కాదా? అసలు నిజం ఏంటి?

Archie: హ్యారీ, మేగన్‌ల కుమారుడు ఆర్చీ.. ప్రిన్స్ కాదా? అసలు నిజం ఏంటి?

తల్లిదండ్రులతో ఆర్చీ

తల్లిదండ్రులతో ఆర్చీ

ఆర్చీ ప్రస్తుతం ప్రిన్స్ అయ్యే అవకాశాలు లేవు దానికోసం కొన్నేళ్ల వేచి చూడాల్సి రావచ్చు. భవిష్యత్తులో ప్రిన్స్ టైటిల్ వచ్చే అవకాశం ఉంటుంది.

ఆర్చీ హారిసన్ మౌంట్ బాటన్ విండ్సర్.. ఇంత పెద్ద పేరు చెబితే అర్థం కాదేమో కానీ ప్రిన్స్ హ్యారీ, మేగన్ ల కుమారుడు ఆర్చీ అంటే మాత్రం ఇట్టే గుర్తుకొచ్చేస్తాడు బుల్లి యువ రాజు. తాజాగా మేగన్, హ్యారీలిద్దరూ ఓప్రా విన్ ఫ్రే ఇంటర్వ్యూలో తమ కొడుకు పుట్టకముందు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు. తాను గర్భవతిగా ఉన్నప్పుడు తన బిడ్డ నల్లగా పుడతాడేమో అని.. ఒకవేళ అలా పుడితే తనకు యువరాజు (ప్రిన్స్) హోదా మాత్రం దక్కదని రాజకుటుంబం సభ్యులు అనేవారని మేగన్ వాపోయిన సంగతి ఇంటర్వ్యూలో చూశాం.

2019 మేలో ఆర్చీ పుట్టగానే తమ కుమారుడికి రాయల్ టైటిల్ అందచబోమని ఈ జంట ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ బిడ్డ పేరు సింపుల్ గా మాస్టర్ ఆర్చీ మౌంట్ బాటన్ విండ్సర్ అనే ఉంటుందని వెల్లడించారు. ఆ పేరుకు ముందు ప్రిన్స్, ఎర్ల్, లార్డ్ వంటి పదాలు చేర్చబోమని వెల్లడించారు. దీనికి కారణం తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది మేగన్. తన బిడ్డకు రాయల్ టైటిల్ ఇవ్వకూడదనేది తమ ఆలోచన కాదని.. తమ బిడ్డ కడుపులో ఉండగానే రాయల్ టైటిల్ కి హక్కుదారు కాదని.. ప్రోటోకాల్ కి భిన్నంగా బిడ్డ ఆడైనా, మగైనా వారిని ప్రిన్స్, ప్రిన్సెస్ గా పిలవకూడదని రాజ కుటుంబం భావించిందని.. అందుకే తాము ఆ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించిందీ జంట.
అయితే బ్రిటిష్ రాజ కుటుంబంలో ఎవరికి రాయల్ టైటిల్స్ ఇవ్వాలన్న విషయం పై నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. 1917లో కింగ్ జార్జ్ V, రాయల్స్ టైటిల్స్ పొందేందుకు కొన్ని నియమాలను పొందుపర్చారు.

ఎవరికి రాయల్ టైటిల్స్ వస్తాయి?

ప్రిన్స్ హ్యారీ ముత్తాతకి తాత అయిన కింగ్ జార్జ్ V 1917 లోనే నియమాలను రూపొందించారు. ఈ నియమాల ప్రకారం కేవలం బ్రిటిష్ సింహాసనానికి అర్హులైన వారు అంటే రాజు లేదా రాణి పిల్లలు, మనవలు మాత్రమే రాయల్ టైటిల్స్ పొందేందుకు అర్హులు. రాజ కుటుంబం పొందే సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ గౌరవం ఎక్కువ మందికి దక్కకుండా ఉండేందుకు ఈ నియమాలను ఏర్పాటు చేశారు కింగ్ జార్జ్ V. మరో నిబంధన ప్రకారం సింహాసనానికి అర్హులైన వ్యక్తులు రాణి లేదా రాజు కుమారుల పెద్ద మనవడికి మాత్రం ఈ టైటిల్ పొందే అర్హత ఉంటుంది. దీని ప్రకారం రాజు లేదా రాణి ముని మనవళ్లలో కేవలం పెద్ద వారికి మాత్రమే రాయల్ టైటిల్ పొందే వీలు ఉంటుంది. దీని ప్రకారం పిన్స్ విలియం పెద్ద కుమారుడైన ప్రిన్స్ జార్జ్ కి మాత్రమే ప్రిన్స్ అనే టైటిల్ వస్తుంది. ఆర్చీ మునిమనవళ్లలో నాలుగో వాడు కాబట్టి ఆర్చీకి ప్రస్తుతం ఆ టైటిల్ దక్కే వీలు లేదు.

ఆర్చీ ప్రిన్స్ కావాలంటే?

ఆర్చీ ప్రస్తుతం ప్రిన్స్ అయ్యే అవకాశాలు లేవు దానికోసం కొన్నేళ్ల వేచి చూడాల్సి రావచ్చు. భవిష్యత్తులో ప్రిన్స్ టైటిల్ వచ్చే అవకాశం ఉంటుంది. 1917 లో రాసిన నిబంధనల ప్రకారం ఒకవేళ ప్రిన్స్ ఛార్లెస్ (క్వీన్ ఎలిజబెత్ కుమారుడు) రాజైతే అతడి మనవలకు ప్రిన్స్ హోదా లభిస్తుంది. ఆర్చీ కి కూడా అప్పుడే రాయల్ టైటిల్ వచ్చే అవకాశాలుంటాయి. అయితే రాజ కుటుంబం ఈ నిబంధనను కూడా మార్చాలని భావించిందని మేగన్ వెల్లడించింది. ఆర్చీకి రాయల్ టైటిల్ రాకుండా ఉండేందుకు వాళ్లు చాలా ప్రయత్నించారని దీనికోసం నిబంధనలు మార్చేందుకు కూడా వాళ్లు వెనుకాడేవారు కాదని వెల్లడించారు మేగన్. ప్రస్తుతం హ్యారీ, మేగన్ లు రాజ కుటుంబం నుంచి బయటకు వచ్చేశారు కాబట్టి ఆర్చీకి కూడా రాయల్ టైటిల్ దక్కే అవకాశం లేదు. అయితే టైటిల్ నిజంగా అంత అవసరమా? అని ఓప్రా అడిగిన ప్రశ్నకి కూడా మేగన్ సమాధానం అందించింది. ఆ రాయల్ టైటిల్ నా కొడుక్కి భద్రతను అందిస్తుందంటే నాకు అది చాలా ముఖ్యమైనదే.. అతన్ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత అని వెల్లడించింది. రాయల్ టైటిల్ ఉన్నవారికి బ్రిటన్ ప్రభుత్వం అధికారిక భద్రత దళాన్ని ఏర్పాటు చేస్తుంది. రాజ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరికీ ఈ భద్రత దక్కదు. కేవలం రాజకుటుంబంలో యాక్టివ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరికి మాత్రమే ఇది దక్కుతుంది. ప్రిన్స్ హ్యారీ, మేగన్ లకు కూడా వారు అమెరికాకి వెళ్లే ముందు వరకూ భద్రత లభించింది. సెక్యూరిటీ గార్డులను వీలైనంత తక్కువ మందికి కేటాయించేలా ప్రిన్స్ ఛార్లెస్ చర్యలు తీసుకున్నారని కూడా వార్తలొచ్చాయి.

ప్రిన్స్ విలియం పిల్లలకు రాయల్ టైటిల్ వచ్చిందా?

కింగ్ జార్జ్ V విధించిన నిబంధనల ప్రకారం ప్రిన్స్ విలియం పెద్ద కుమారుడు జార్జ్ కి మాత్రమే రాయల్ టైటిల్ దక్కాల్సి ఉంది. అయితే వారి ముగ్గురు పిల్లలు జార్జ్, ఛార్లెట్, లూయిస్ లకు రాయల్ టైటిల్ అందించేలా 2013లో క్వీన్ ఎలిజబెత్ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం అప్పుడే ఓ పేటెంట్ లెటర్ ని కూడా విడుదల చేశారు రాణి. అయితే తన కజిన్స్ లా ఆర్చీ కి మాత్రం అతడు పుట్టగానే ఎలాంటి టైటిల్ అందించలేదు. అప్పట్లో ప్రిన్స్ హ్యారీ, మేగన్ లే ఆర్చీకి రాయల్ టైటిల్ కావాలని కోరుకోవట్లేదని.. అతడికి సాధారణ జీవితం అందించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ అది నిజం కాదని.. రాజ కుటుంబం ఆర్చీకి టైటిల్ అందించేందుకు సిద్ధంగా లేదని తాజాగా మేగన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తేలింది. అయితే పుట్టుక తోనే రాయల్ టైటిల్ దక్కకపోయినా రాజకుటుంబంలో సభ్యులుగా ఉంటే ఆర్చీ పెద్దయ్యాక తన తండ్రికి ఉన్న డ్యూక్ ఆఫ్ ససెక్స్ టైటిల్ అతడికి దక్కేది. కానీ ఇప్పుడు మేగన్, హ్యారీలిద్దరూ రాజరిక హోదాలన్నింటినీ వదిలి వచ్చేయడంతో ఆర్చీకి కూడా ఆ టైటిల్స్ పొందేందుకు అర్హత లేకుండా పోయింది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: London, United Kingdom

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు