ముంబైలో మళ్లీ పీక్ కి చేరుకుంటున్న కరోనా.. అక్కడ కేసులు పెరగడానికి కారణం ఇదేనా

ప్రతీకాత్మక చిత్రం

మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని కేంద్రం బృంద వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులు ఇలాగే పెరిగిపోయే పరిస్థితి వస్తే దానికి సిద్ధపడి ఉండాలని వెల్లడించింది. అంతే కాదు.. ఐసీఎంఆర్ వెల్లడించిన సూచనలను పాటించాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

  • Share this:
మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని కేంద్రం బృంద వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులు ఇలాగే పెరిగిపోయే పరిస్థితి వస్తే దానికి సిద్ధపడి ఉండాలని వెల్లడించింది. అంతే కాదు.. ఐసీఎంఆర్ వెల్లడించిన సూచనలను పాటించాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కరోనా కేసులను గుర్తించడం, టెస్టింగ్, పాజిటివ్ వచ్చిన వారిని కంటైన్ మెంట్ చేయడం వంటివి కమ్యునిటీ ట్రాన్స్ మిషన్ ని అడ్డుకోగలుగుతాయని వారు వెల్లడిస్తున్నారు. ప్రతి పాజిటివ్ కేసుకు 20, 30 దగ్గరి కాంటాక్ట్స్ ఉంటాయి. ఇందులో వారి కుటుంబ సభ్యులు, వారి పని ప్రదేశంలో ఉన్న వ్యక్తులు అందరూ ఉంటారు. వారందరినీ గుర్తించడం, ఐసోలేషన్ లో ఉంచడం వల్ల 80 నుంచి 85 శాతం కేసులను ఐసోలేషన్ లో ఉంచే వీలుంటుంది అని కేంద్ర హెల్త్ సెక్రెటరీ రాజేష్ భూషణ్ మహారాష్ట్ర ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ సీతారాం కుంటే కి రాసిన లేఖలో వెల్లడించారు.

ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే..
అయితే దేశవ్యాప్తంగా వచ్చే కేసులతో పోల్చితే మహారాష్ట్రలో కేసుల ఉద్ధృతి ముందు నుంచి ఎక్కువగానే ఉంటోంది. గతేడాది కరోనా కేసుల్లో ముంబై వుహాన్ ని కూడా దాటిపోయిన సంగతి మనకు తెలిసిందే. ముంబై ఎయిర్ పోర్ట్ లో అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఎయిర్ పోర్టులో.. ఆ చుట్టు పక్కల పనిచేసే వారందరూ కరోనా బారిన పడ్డారని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ఇదే కమ్యునిటీ స్ప్రెడ్ కి కారణమై ముంబైలో కరోనా కేసులను పెంచిందని వారి అభిప్రాయం. అందుకే గతేడాది జూన్ లో లాక్ డౌన్ ని కేంద్రం కాస్త సడలించిన తర్వాత ముంబైలో పెద్ద ఎత్తున కేసులు బయటపడ్డాయి. అయితే లాక్ డౌన్ సడలించడం తప్ప ప్రభుత్వానికి మరో దారి లేకుండా పోయింది. లాక్ డౌన్ విధించడం వల్ల లక్షలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపారాలు మూతబడ్డాయి. అయితే మిగిలిన దేశాలతో పోల్చితే చాలా ఎక్కువ జనాభా ఉన్నా భారత్ లో కరోనా సోకిన వారి సంఖ్య తక్కువగా ఉండడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. టెస్టులు చాలా తక్కువ జరుగుతున్నాయని టెస్టుల సంఖ్య పెరిగితే మరిన్ని కేసులు పెరిగే అవకాశాలు ఉంటాయని వారు వెల్లడిస్తున్నారు.

ముంబైలో లోకల్ ట్రైన్లను కూడా ప్రారంభించడం కరోనా కేసుల పెరుగుదలకు కారణమవుతోందని చాలామంది నిపుణులు వెల్లడిస్తున్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో కరోనా కేసులు అదుపులోనే ఉన్నా ఫిబ్రవరి నుంచి కొత్త కేసుల పెరుగుదల కనిపిస్తోంది దీనికి కారణం ఫిబ్రవరి 1 నుంచి లోకల్ ట్రైన్లు ప్రారంభించడమే అంటున్నారు చాలామంది. అయితే ఈ పెరుగుదల కేవలం ముంబై లో మాత్రమే కాదు.. మహారాష్ట్ర మొత్తం కనిపిస్తోంది. పదిహేను వేల నుంచి 18 వేలకు కొత్త కేసుల సంఖ్య చేరుకుంది. దీనికి మరో కారణం జనవరి మధ్యలో జరిగిన పంచాయతీ ఎన్నికలు కూడా కావచ్చని కరోనా నిబంధనలు పాటించేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇక వీటితో పాటు జనవరి, ఫిబ్రవరిలో వివిధ పార్టీలు ర్యాలీలు, మీటింగ్ లు నిర్వహించాయి. ఇవి కూడా కరోనా ప్రభావం పెరిగేందుకు కారణమయ్యాయి. ఎన్ సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ కూడా తన పుట్టిన రోజు జరుపుకున్న రెండు రోజులకే కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో పార్టీ వర్కర్లు పాల్గొన్నారు. అందుకే దీన్ని తగ్గించాలంటే ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వస్తే అతడి కాంటాక్ట్స్ అందరినీ గుర్తించి పరీక్షలు చేయడం, వారిని ఐసోలేషన్ లో ఉంచడం వంటివి చేస్తేనే కరోనా వేగాన్ని తగ్గించే వీలుంటుంది.

టెస్టింగ్, ట్రాకింగ్, ఐసోలేషన్ తప్పనిసరి..

మహారాష్ట్రలో ట్రాకింగ్, టెస్టింగ్, ఐసోలేషన్ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ వహించట్లేదని కేంద్రం నుంచి వచ్చిన టీమ్ వెల్లడిస్తోంది. అలాగే మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో కోవిడ్ కి వ్యతిరేకంగా ఉపయోగించే సాధారణ పద్ధతులు కూడా పాటించట్లేదని దీనివల్ల కేస్ కాంటాక్ట్ రేషియో 1:20 గా ఉంటోందని వారు వెల్లడిస్తున్నారు. ఈ సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అయితే కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ సరిగ్గా జరగట్లేదని.. మహారాష్ట్రలోని ఫీల్డ్ స్టాఫ్ కి దాని గురించి పెద్దగా అవగాహన ఉండడం లేదని కుటుంబ సభ్యులు, చుట్టు పక్కలవారిని మాత్రమే అందులో పొందుపరుస్తున్నారని, వారు పని చేసే చోట, సమాజంలో వారు ఎంత మందిని కలిశారు.. ఎవరెవరి దగ్గరికి వెళ్లారన్న వివరాలు సేకరించేందుకు వారు ఆసక్తి చూపించట్లేదని కేంద్ర బృందం చెబుతోంది. ఈ రిపోర్ట్ ఆధారంగా కేంద్ర హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. రాత్రి కర్ఫ్యూలు, వీకెండ్ లో లాక్ డౌన్ వంటివి కరోనా వ్యాప్తిని తగ్గించడంలో చాలా తక్కువ పాత్ర పోషిస్తాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచడం, కంటైన్ మెంట్ పద్ధతులు, కరోనా వచ్చిన వారు బయట తిరగకుండా నిఘా ఉంచడం వంటివి చేయడం వల్ల కేసుల సంఖ్య తగ్గే అవకాశాలుంటాయని ఆయన తన లేఖలో వెల్లడించారు. దీంతో పాటు కరోనా మొదటిసారి వచ్చినప్పుడు పాటించినట్లుగా బఫర్ జోన్లను ఏర్పాటు చేయాలని.. ప్రతి కంటైన్ మెంట్ జోన్ లోనూ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటై అక్కడి వారు బయటకు వెళ్లకుండా ఎవరూ ఆ లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. కాంటాక్ట్స్ అందరినీ పరీక్షించడం వల్ల పాజిటివ్ వచ్చే వారు రేటును తగ్గించే వీలుంటుందని కంటైన్ మెంట్ జోన్లలో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గతంలో పాటించిన పద్ధతులన్నీ పాటించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాటికి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తూ కొత్త కేసులు పెరగడాన్ని వీలైనంత మేర తగ్గించాలని ఆయన వెల్లడించారు. ప్రతి కొత్త కేసు వచ్చినప్పుడు అతడు లేదా ఆమె గత కొన్ని రోజుల నుంచి కలిసిన కుటుంబం, పని ప్రదేశం, ఇతర కాంటాక్ట్స్ అయిన 20 నుంచి 30 మందిని ఐసోలేట్ చేయాలి. వారికి టెస్టులు చేయాలని సూచించారు.

అత్యధిక కేసులు ఇక్కడే..

మహారాష్ట్రలోని విధర్బ ప్రాంతంలో కేసుల పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. ముంబై, పుణెలలో కూడా తాజాగా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అయితే రోజువారీ కేసుల సంఖ్య ముంబై కంటే నాగ్ పూర్ లోనే ఎక్కువగా ఉండడం ఆ ప్రాంతంతో పాటు అమరావతి, అకోలా, యావత్మాల్, బుల్దనా, వాషీమ్, వార్దా ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా మార్చేసింది. వీటితో పాటు నాసిక్, ఔరంగా బాద్ ప్రాంతాల్లో కూడా కేసులు సడన్ గా పెరుగుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఔరంగాబాద్ మెడికల్ కాలేజ్, వసంత్ రావ్ పవార్ మెడికల్ కాలేజ్ లలో చేరిన వారిలో మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంటోందట. దీన్ని పరిగణనలోకి తీసుకొని కంటైన్ మెంట్ ఏరియాలను కేవలం కేసులు వచ్చిన ప్రాంతాల్లో కాకుండా ఆ వ్యక్తి కాంటాక్ట్స్ ఉన్న ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలని కేంద్రం వెల్లడిస్తోంది. కరోనా కేసులు పెరుగుతుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కంటైన్ మెంట్ జోన్లపై విధించిన నిబంధనలను మార్చి 31 వరకూ పొడిగించింది. ప్రతి ఆఫీస్ లోనూ కేవలం 50 శాతం కెపాసిటీతో పనిచేయాలని మిగిలిన వారు వర్క్ ఫ్రమ్ చేయాల్సి ఉంటుందని ఆదేశించింది. దీంతో పాటు థానే, నాగ్ పూర్, వార్దా, పన్వేల్, ఔరంగాబాద్ వంటి ప్రాంతాల్లో కరోనా వైరస్ ని తగ్గించేందుకు చాలా చోట్ల లాక్ డౌన్ విధించారు.

వ్యాక్సినేషన్ పై అనాసక్తే కారణమా?

మహారాష్ట్రలో కరోనా కేసుల పెరుగుదలకు వ్యాక్సినేషన్ పై ఆ రాష్ట్ర ప్రజల అనాసక్తి కూడా ఓ కారణం అని చెప్పుకోవచ్చు. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం కొవిషీల్డ్, కోవాక్సీన్ వ్యాక్సీన్లను తీసుకునేందుకు ముంబై కి చెందిన 58 శాతం ప్రజలు ఆసక్తి చూపించడం లేదట. కేవలం ప్రజలే కాదు.. ఫ్రంట్ లైన్ వారియర్స్ లో చాలామంది కూడా వ్యాక్సీన్ తీసుకోవడానికి అనాసక్తి కనబరుస్తున్నారు. వ్యాక్సీన్ల సంఖ్యను పెంచి అందరికీ అందుబాటులో ఉంచడమే మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య తగ్గించేందుకు మార్గమని కేంద్రం భావిస్తోంది.

ప్రయాణీకులపై నిబంధనలు ఇలా..

మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ తమతోపాటు కోవిడ్ నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ ని తప్పకుండా కలిగి ఉండాలని దిల్లీ ప్రభుత్వం నిబంధన విధించింది. రాజస్థాన్ కూడా దీన్ని తప్పనిసరి చేసింది. మధ్యప్రదేశ్ లో ఇండోర్ జిల్లా మెజిస్ట్రేట్ కరోనా నిబంధనలను వెల్లడించారు. దీని ప్రకారం ఇండోర్ లోకి రావాలని భావించే మహారాష్ట్రకి చెందిన వారు తప్పనిసరిగా కరోనా నెగటివ్ అని రిపోర్ట్ చూపించాల్సిందే అని వెల్లడించారు. అది కూడా కేవలం 48 గంటల ముందు చేయించుకున్న రిపోర్ట్ నే వారు పరిగణనలోకి తీసుకుంటారట. భోపాల్ కూడా ఇలాంటిదే నిబంధన విధించింది. 72 గంటల క్రితం చేయించుకున్న టెస్ట్ రిపోర్ట్ ని ఆ ప్రాంతం అనుమతిస్తోంది. కర్ణాటక కూడా ఇవే నియమాలను తప్పనిసరి చేసింది.
Published by:Ashok Kumar Bonepalli
First published: