భారత ఎన్నికల వ్యవస్థలో సంచలన సంస్కరణగా భావిస్తోన్న ‘ఓటరు ఐడీతో ఆధార్ అనుసంధానం’ అంశంలో ఇవాళ కీలక ముందడుగు పడింది. ఓటరు జాబితాతో ఆధార్ లింకుకు అనుగుణంగా, అదే సమయంలో మరో మూడు ముఖ్యాంశాలతో కూడిన ‘ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021కు సోమవారం నాడు లోక్ సభ ఆమోదం లభించింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, మెరుగైన ఓటింగ్ విధానం కోసమే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు కేంద్రం చెబుతోంది. అయితే, కాంగ్రెస్ సహా దాదాపు విపక్ష పార్టీలన్నీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇదిగానీ చట్టంగా మారితే బడుగు, బలహీన, పేద వర్గాలకు చెందిన లక్షల మంది ఓటు హక్కు గల్లంతవుతుందని విపక్ష ఎంపీలు సభలోనే ఆరోపించారు. అసలు ఎన్నికల చట్టాల సవరణ బిల్లులో ఏముంది? వాటిని విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో వివరంగా తెలుసుకుందాం..
ఏమిటీ సవరణ బిల్లు?
ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు అనేవి సుదీర్ఘకాలంగా నానుతోన్న అంశం. ఎన్నికల వ్యవస్థను, ప్రక్రియను, ఎన్నికల సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) గత జులైలో కేంద్రానికి కొన్ని సిఫార్సులు పంపింది. వాటిలో కీలకమైనవిగా కేంద్రం భావించిన అంశాలతో ‘ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021 రూపొందింది. ఎన్నికల విధానంలో అవకతవకలకు చెక్ పెట్టడం, నకిలీ ఓట్లను నిరోధించడం, బోగస్ ఓట్ల తొలగింపు, అవకతవకల్లేని ఓటరు జాబితా తదితర లక్ష్యాలు ఈ బిల్లుతో సాధ్యమవుతాయని కేంద్రం భావిస్తోంది, ఎన్నికల చట్టాల సవరణ బిల్లులో ప్రధానంగా నాలుగు అంశాలున్నాయి. అవేంటంటే..
ఓటర్ ఐడీకి ఆధార్ లింక్
సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరికీ సాధారణ గుర్తింపుగా మారిన ఆధార్ కార్డును ఇకపై ఓటరు గుర్తింపు కార్డుకు సైతం అనుసంధానం చేయనున్నారు. దేశంలో నకిలీ ఓట్లు, ఇతరత్రా అవకతవకల్ని నివారించడానికి ఓటరు ఐడీకి ఆధార్ ను లింక్ చేయడం అవసరమనేది ఈ బిల్లులో ప్రధానాంశం. ఓటరు జాబితాలోని అందరి ఐడీలకు ఆధార్ కార్డును అనుసంధానం చేస్తారు. ఇప్పుడు లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో పాసై, రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన తర్వాత ఈ ప్రక్రియ విధివిధానాలను కేంద్రం వెల్లడించనుంది. ఇక
ఇకపై ఏడాదికి 4సార్లు ఓటరు నమోదు
లోక్ సభ ఇవాళ ఆమోదించిన బిల్లులో ప్రధానాంశం ఓటరు ఐడీకి ఆధార్ లింకు కాగా, రెండోది ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించింది. ఇప్పటిదాకా మన దేశంలో కొత్త ఓటర్ల నమోదుకు ఏడాదికి ఒకసారి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. కొత్త బిల్లు ద్వారా ఇకపై ఏడాదికి నాలుగు సార్లు కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునే వీలుంటుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుండి, 18 సంవత్సరాలు నిండిన మొదటి సారి ఓటర్లు నాలుగు వేర్వేరు కటాఫ్ తేదీలతో సంవత్సరానికి నాలుగు సార్లు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే,
ఉద్యోగిణుల భర్తలకూ పోస్టల్ ఓట్లు..
ఎన్నికల చట్టాల సవరణ బిల్లులో మూడో అంశం మహిళా సర్వీస్ ఓటర్ల గురించి. దేశంలో సైన్యం సహా సర్వీసు ఓటర్ల కుటుంబాలకు ఓటు హక్కు విషయంలో ఇప్పటివరకూ పలు ఆంక్షలు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ వాడుకునే సదుపాయం పురుష సర్వీస్ ఓటరు భార్యకు మాత్రమే అందుబాటులో ఉంది. మహిళా సర్వీస్ ఓటర్లకు ఇన్నాళ్లు ఆ సదుపాయం లేదు. ఈ లోపాన్ని సరిదిద్దుతూ, సర్వీస్ ఆఫీసర్ల కోసం చట్టాన్ని లింగ భేదాల్లేకుండా చేయాలన్న ఈసీ సిఫార్సుపై కేంద్ర ప్రభుత్వం బిల్లును రూపొందించింది. కొత్త బిల్లు ప్రకారం ఇకపై మహిళా సర్వీస్ ఓటరు భర్తకు కూడా దీన్ని అందుబాటులోకి తెస్తున్నారు.
ఈసీకి మరిన్ని అధికారాలు...
బిల్లుల్లో చివరిది, అతి కీలకమైనది.. ఎన్నికల సంఘానికి మరిన్ని విస్తృత అధికారాలు కల్పించేందుకు ఉద్దేశించింది. ఎన్నికల సమయంలో ఎన్నికల నిర్వహణ కోసం దేశంలో ఏదైనా ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని అధికారాలను ఈసీకి కల్పించే అంశాలు కొత్త బిల్లులో ఉన్నాయి. ఎన్నికల సమయంలో స్కూళ్లు, ఇతర ప్రదేశాలను ఈసీ స్వాధీనం చేసుకోవడంపై రకరకాల అభ్యంతరాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఈసీకి అలాంటి అడ్డంకులు రాకుండా అధికారాలను పెంచనున్నారు. కాగా,
ఆధార్ అనుసంధానం చట్ట విరుద్ధమా?
ఎన్నికల చట్టాల సవరణ బిల్లులో చివరి మూడు అంశాలు(ఏడాదికి నాలుగు సార్లు నమోదుకు అవకాశం, మహిళా సర్వీస్ ఓటర్ల భర్తలు, ఈసీకి విస్తృత అధికారాలు)పై కేంద్రం వాదనతో ఏకీభవించిన విపక్షాలు.. ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం అంశాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. ఆధార్ అంటే నివాస ధృవీకరణ మాత్రమేనని, పౌరసత్వానికి రుజువుగా పరిగణించని ఆధార్ కార్డులను ఓటరు జాబితాకు లింక్ చేయడం అసంబద్ధమని, ఈ విధానంలో పౌరులు కానివారు కూడా ఓట్లేసే వీలుంటుందని విపక్ష ఎంపీలు వాదిస్తున్నారు. మరికొందరరైతే అసలు ఆధార్ చట్టం ఈ (ఓటర్ ఐడీతో ఆధార్) లింకును అనుమతించదని చెబుతున్నారు.
లక్షల మంది ఓటు హక్కు గల్లంతు?
ఎన్నికల చట్టాల సవరణ బిల్లుపై లోక్ సభలో స్వల్పకాలిక చర్చలో పలు విపక్షపార్టీలకు చెందిన ఎంపీలు సంచలన ఆరోపణలు చేశారు. ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానం వల్ల ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే హక్కును కోల్పోతారని, ఈ బిల్లు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని విపక్ష ఎంపీలు అన్నారు. బీఎస్పీ ఎంపీ రితేశ్ పాండే మరో అడుగు ముందుకేసి, దేశంలో ఆధార్ కార్డు లేని ఎస్సీ, ఎస్టీలు ఎందరో ఉన్నారని, వాళ్లందరికీ ఇప్పుడు ఓటు హక్కు దూరమయ్యే పరిస్థితి నెలకొందని లోక్ సభ సాక్షిగా వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు గత తీర్పుల దృష్ట్యా గోప్యతా హక్కు ప్రాథమిక హక్కు అని, ఎన్నికల ప్రక్రియతో ఆధార్‌ను అనుసంధానం చేయడం పౌరుల హక్కులకు భంగం కలిగిస్తుందని మరో ఎంపీ తన వ్యతిరేకత తెలిపారు. అసాధారణ రీతిలో వెలువడిన ఈ ఆరోపణలతో ఎన్నికల సవరణ బిల్లుపై ప్రజల్లోనూ అనుమానాలు రేకెత్తే అవకాశం లేకపోలేదు. అయితే, ఈ అనుమానాలు నివృత్తి చేసేలా కేంద్రం వీలైతే పార్లమెంటులోనే లేదా ప్రధాని మోదీ స్వయంగానైనా ‘ఓటల్ ఐడీతో ఆధార్ లింకు’అవసరాన్ని ప్రజలకు వివరించే అవకాశాలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AADHAR, Election Commission of India, Elections, Parliament Winter session