Home /News /explained /

WHY ARE SOME PLACES CALLED TAX HAVENS HOW DO THEY HARM OTHER COUNTRIES ECONOMY MK GH

Pandora Papers: టాక్స్ హెవెన్స్ అంటే ఏంటి..అవి పన్ను ఎగ్గొట్టేవారికి ఎందుకు స్వర్గధామాలుగా ఉంటున్నాయి ?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Explained: కొన్ని ప్రాంతాలు ఎందుకు పన్ను ఎగ్గొట్టేవారికి స్వర్గధామాలుగా ఉంటున్నాయి? అవి ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎలా హాని కలిగిస్తున్నాయి?

Pandora Papers | పండోరా పేపర్స్‌ పేరుతో ఇటీవల వెలుగు చూసిన సమాచారంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖలు విదేశాల్లో దాచి పెట్టిన సొత్తు వివరాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు, వ్యాపారులు, సెలబ్రిటీలు ఈ జాబితాలో ఉన్నారు. ఇలాంటి సమాచారం బయటకు రావడం ఇది మొదటిసారేం కాదు. పనామా, దుబాయ్‌, మొనాకో వంటి ప్రాంతాలు పన్ను స్వర్గధామాలుగా (Tax havens) నిలుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో సంస్థలు, ట్రస్టులు నెలకొల్పేందుకు సంపన్నులు కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలు సహ పండోరా పేపర్స్‌లో 11.9 మిలియన్ ఫైల్స్ ఉన్నట్టు తెలుస్తోంది. పన్ను స్వర్గధామాలుగా నిలుస్తున్న దేశాల్లో ఐర్లాండ్, స్విట్జర్లాండ్‌, లగ్జెంబర్గ్, బెర్ముడా సహ అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి.

సొంత దేశంలో పన్నులు ఎగ్గొట్టి సంపదను సురక్షిత స్థావరాలకు తరలించే బడాబాబుల బాగోతం పండోరా పేపర్స్‌తో మరోసారి వెలుగుచూసింది. ఇతర దేశాలకు భారీ మొత్తంలో వీరు తమ సంపదను తరలించడానికి కారణమేంటి? ఇది తెలుసుకోవాలంటే ముందు మనం పన్ను ఎగవేతదారులకు స్వర్గధామాలుగా నిలుస్తున్న దేశాల గురించి తెలుసుకోవాలి.

పన్ను ఎగవేతదారుల స్వర్గధామం అంటే ఏంటి?
వ్యాపారులు లేదా వ్యక్తులు చేసే పెట్టుబడులు, డిపాజిట్లపై అతి తక్కువ పన్ను వసూలు చేయడం లేదా అసలు ఎలాంటి ట్యాక్స్ వసూలు చేయని దేశాలను ఎగవేతదారుల స్వర్గధామాలుగా చెప్పుకోవచ్చు. ఇంకో మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తి ఈ దేశాల్లో తమ సంపదను ఉంచినా లేదా పెట్టుబడి పెట్టినా సొంత దేశం కంటే అతి తక్కువగా ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు.. లేదా అసలు పన్ను చెల్లించకపోవడంగా చెప్పుకోవచ్చు.

పన్ను ఒక్కటే కాదు ఆ దేశాల్లో పెట్టుబడి లేదా డిపాజిట్లు చేసిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచడం ఈ దేశాల ప్రత్యేకత. మరో కారణం ఆ దేశాల్లో ఆర్థిక, రాజకీయ సుస్థిరత. తమ సంపదపై పెద్ద మొత్తంలో పన్ను చెల్లించాల్సిన వ్యక్తి దాన్ని ఎగ్గొట్టేందుకు ఆ డబ్బు లేదా సంపదను ఈ సురక్షిత దేశాలకు తరలిస్తారు. ఇలా చేయడం వల్ల తమ దేశంలో పన్ను భారం నుంచి వారు బయటపడతారు. అంతే కాదు ఆ దేశాలు వారి ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని అసలు వెల్లడించవు లేదా అతి స్వల్ప విషయాలు బహిర్గతం చేస్తాయి. మరో వైపు ఆ దేశాల్లో ఉండే సుస్థిరత కారణంగా ఆస్తులు, సంపద సురక్షితంగా ఉంటాయి.

ఆ దేశాల్లో ఎవరు పెట్టుబడులు పెడతారు?
వ్యక్తులే కాదు పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ సంపదను ఈ దేశాలకు తరలిస్తుంటాయి. యాపిల్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌, నైకీ, ఫైజర్‌, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు తమ సంపదను ఇక్కడకు తరలించి బిలియన్ల డాలర్లను మిగుల్చుకున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే ఈ దేశాలు పన్ను ఎగవేతలకు పావుగా ఉపయోగపడటమే కాదు అక్రమ సంపద, నల్లధనం కూడబెట్టేందుకు మార్గాలుగా నిలుస్తున్నాయి.

పన్ను చెల్లించాల్సిన మొత్తాన్ని ఎగొట్టి చాలా మంది ఆ ధనాన్ని ఈ సురక్షిత దేశాలకు తరలించి పెట్టుబడిగా పెడతారు. అంతే కాదు అక్రమ మార్గాల ద్వారా సంపాదించే మొత్తం లేదా నల్లధనాన్ని చాలా మంది ఈ దేశాల్లో పెట్టుబడిగా పెట్టడం లేదా డిపాజిట్‌ చేస్తుంటారు. పన్ను ఎగవేతదారులకు స్వర్గధామాలుగా బాసిల్లే ఈ దేశాల్లోని ముఖ్యమైన విషయం గోప్యత.

వ్యక్తులు లేదా సంస్థల పెట్టుబడులకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించడంలో ఈ దేశాల్లోని అధికారులు ఏ మాత్రం సహకరించరు. కాబట్టి పన్ను ఎగవేతదారు లేదా అక్రమ సంపాదన లేదా నల్లధనం కలిగిన వ్యక్తులకు తమ సంపాదన గురించి ఎటువంటి ఆందోళన ఉండదు.

అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం ఈ పన్ను స్వర్గధామాల కారణంగా ప్రభుత్వాలు ఏటా $500 బిలియన్లు నుంచి $600 బిలియన్ల పన్ను ఆదాయాన్ని కోల్పోతున్నాయి. ఈ మొత్తాలపై ఆయా దేశాలకు పన్నులు వసూలవుతాయి. కానీ అవి మరో దేశంలో సురక్షిత పెట్టుబడిగా ఉండిపోతున్నాయి. ఇలా కోల్పోయిన ఆదాయంలో తక్కువ ఆదాయ ఆర్థిక వ్యవస్థలకు చెందిన మొత్తం $200 బిలియన్ల వరకు ఉంటుంది.

ఈ పన్ను స్వర్గధామాల కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందని దేశాలు బాగా నష్టపోతున్నాయి. ఇప్పటికే సమస్యల కారణంగా వెనుకబడిపోయిన ఈ దేశాలు ఈ పెద్ద మొత్తాలపై వసూలు కావాల్సిన పన్నును కోల్పోతున్నాయి. అమెరికన్‌కు చెందిన ఫార్చూన్‌ 500 కంపెనీలు 2017లో $ 2.6 ట్రిలియన్లు మొత్తాన్ని దాచిపెట్టినట్టు తెలుస్తోంది. వ్యక్తులకు చెందిన మొత్తం $8.7 ట్రిలియన్ల వరకు ఉంటుంది.

తమ విధానాల కారణంగా ఇబ్బడిముబ్బడిగా వచ్చే డబ్బుతో ఆ దేశాలు భారీగా లబ్ది పొందుతున్నాయి. వ్యక్తులు, సంస్థల ద్వారా వచ్చే భారీ ధనం కారణంగా ఆ దేశాల దగ్గర పెట్టుబడి పెట్టేందుకు తగిన మూలధనం ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. వాటి ద్వారా అవి చక్కగా లబ్ది పొందుతుంటాయి.
అటు ఈ పన్ను స్వర్గధామాలు అక్రమ ధనం, నల్లధనం, పన్ను ఎగవేత సంపదకు సరైన గమ్యస్థానాలుగా నిలుస్తుండటంతో వ్యాపారులు, వ్యాపార సంస్థలు భారీగా లబ్ది పొందుతున్నాయి.
దీన్ని బట్టే చూస్తే మంచి వ్యాపార విధానం ఈ ఆర్థిక నేరగాళ్లకు మేలు చేస్తున్నట్టు అనిపిస్తుంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Black Money

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు