• Home
  • »
  • News
  • »
  • explained
  • »
  • WHY ACIDITY LOSS OF APPETITE SHOULD NOT BE IGNORED HERE IS GASTROENTEROLOGIST EXPLANATION GH SK

Post covid complications: కరోనా నుంచి కోలుకున్నాక జీర్ణ సమస్యలు.. నిపుణుల సలహాలివే

ప్రతీకాత్మక చిత్రం

Decoding Long Covid: జీర్ణాశయ సమస్యల చికిత్సకు యాంటాసిడ్లు, యాంటీ-ఎమెటిక్స్, యాంటీ-డయేరియా వంటివి వాడాల్సి ఉంటుంది. దీని కోసం యాంటీ-బయోటిక్స్ వాడకం లేదా ఖరీదైన శస్త్రచికిత్సలు అవసరం లేదు.

  • Share this:
భారతదేశంలో కోవిడ్–19 సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే, కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ, కోలుకుంటున్న వారిలో అనేక కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇటీవల బ్లాక్, వైట్, ఎల్లో వంటి రకరకాల ఫంగస్లు బయటపడగా.. ఇప్పుడు కొత్త లక్షణాలు సైతం వెలుగులోకొస్తున్నాయి. ఈ లక్షణాలు కరోనా నుంచి కోలుకున్న మూడు నెలల పాటు కనిపిస్తున్నాయి. వైద్యులు దీనిని ‘లాంగ్ కోవిడ్’ గా చెబుతున్నారు. ఈ లాంగ్ కోవిడ్ వల్ల ముఖ్యంగా జీర్ణాశయ సంబంధ సమస్యలైన గ్యాస్ట్రిక్ ట్రబుల్, బ్లోటింగ్, ఎసిడిటీ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా నుంచి రికవరీ అయిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

ఈ జీర్ణాశయ సంబంధిత సమస్యలపై మణిపాల్‌లోని హెచ్సిఎంసిటి HOD, గ్యాస్ట్రోఎంటరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ కునాల్ దాస్ మాట్లాడుతూ “కరోనా నుంచి కోలుకున్న వారిలో యాసిడ్ రిఫ్లక్స్, ఆకలి లేకపోవడం వంటి సమస్యలొస్తున్నాయి. కరోనా బారిన పడ్డ దాదాపు 60% మంది రోగుల్లో జీర్ణశయాంతర లక్షణాలు కనిపిస్తున్నాయి. వీటిని లాంగ్ కోవిడ్ లక్షణాలుగా చెప్పవచ్చు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత దాదాపు మూడు నెలల పాటు ఈ లక్షణాలు రోగులను పీడిస్తూనే ఉన్నాయి. కోవిడ్-19 మన శరీరంలోని అన్ని అవయవాలను ప్రభావితం చేస్తుంది. సెకండ్ వేవ్లో కరోనా బారిన పడ్డ చాలా మంది రోగుల్లో కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు ఉన్నట్లు గమనించాము.” అని అన్నారు.

2021 మేలో లాన్సెట్ గ్యాస్ట్రో హెపాటోల్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన రోగుల్లో 44% మందికి జీర్ణ సంబంధిత సమస్యలొచ్చాయి. ఈ జీర్ణ సమస్యలకు హైపోక్సియా కారణం కావచ్చని లాన్సెట్ నివేదిక పేర్కొంది. మరోవైపు రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గడం వల్ల శరీరంలోని కొన్ని ప్రాంతాలు ప్రభావితమవుతున్నాయని, ఇది క్రమంగా న్యుమోనియాకు దారి తీస్తుందని నివేదిక పేర్కొంది.



కాగా, ఈ కడుపు నొప్పి, బెల్చింగ్, వాంతులు వంటి సాధారణ లక్షణాలు జీర్ణ సంబంధిత సమస్యలకు సంకేతాలు కావచ్చని డాక్టర్ దాస్ వివరించారు. కొంత మంది రోగులు మూత్రంలో రక్తం రావడం అనే సమస్యను కూడా నివేదించారని ఆయన తెలిపారు. కరోనా రికవరీ తర్వాత ఇటువంటి లక్షణాలు కనిపిస్తే, ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలని ఆయన సలహాలిస్తున్నారు. ఈ జీర్ణాశయ సమస్యలు కరోనా నుంచి కోలుకున్న మూడు నెలల్లో ఎప్పుడైనా కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న రోగులు డైస్పోనియా, మైయాల్జియాతో ఎక్కువగా సంబంధం కలిగి ఉన్నారని కూడా అధ్యయనంలో తేలింది.

ఈ జీర్ణాశయ సమస్యల చికిత్సకు యాంటాసిడ్లు, యాంటీ-ఎమెటిక్స్, యాంటీ-డయేరియా వంటివి వాడాల్సి ఉంటుంది. దీని కోసం యాంటీ-బయోటిక్స్ వాడకం లేదా ఖరీదైన శస్త్రచికిత్సలు అవసరం లేదు. మంచి పోషకాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చాలని డాక్టర్లు చెబుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: