ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామిక దేశాల్లో భారతదేశం (India) ఒకటి. భారత రాజ్యంగం (Indian Constitution) ఇక్కడి ప్రజలకు విధులు, భాద్యతలు, హక్కులు ఇలా అన్ని తెలియజేస్తుంది. స్వాతంత్రం ఏర్పడిన నాటికి ఉన్న అనేక చట్టాలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. అయితే, కాలానుగుణంగా కొన్ని చట్టాల్లో మార్పులు, చేర్పులు చేస్తూ వచ్చారు. కొత్త చట్టాలను ప్రవేశపెట్టడంతో పాటు పాత చట్టాలను సవరిస్తున్నారు. తాజాగా, వ్యవసాయ చట్టాల రద్దు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. అసలు ఒక బిల్లు చట్టంలా మారాలంటే ఏ ఏ ప్రక్రియలు దాటుకొని వెళ్లాలి? దీనికి కనీసం ఎంత మంది పార్లమెంట్ సభ్యులు ఆమోదం తెలపాలి? చట్టంలా మారేందుకు ఎంత కాలం పడుతుంది? అనే ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
పార్లమెంటులో బిల్లును ఎవరు ప్రవేశపెడతారు?
పార్లమెంటులో చట్టాలను ఆమోదించడానికి ఏకైక మార్గం లోక్‌సభ లేదా రాజ్యసభలో బిల్లులను ప్రవేశపెట్టడం. పార్లమెంటు సభ్యురాలు (ఎంపీ) ఎవరైనా బిల్లును ప్రవేశపెట్టవచ్చు. ఒకవేళ, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న ఎంపీ బిల్లును ప్రవేశపెడితే దాన్ని ప్రభుత్వ బిల్లుగా పిలుస్తారు. మంత్రి కాకుండా మరో ఎంపీ బిల్లును ప్రతిపాదిస్తే దానిని ప్రైవేట్ మెంబర్ బిల్లుగా పేర్కొంటారు.
బిల్లు చట్టంగా ఎలా మారుతుంది?
ఒక బిల్లు అయినా సరే చట్టంలా మారాలంటే లోక్ సభ లేదా రాజ్య సభలో మూడు దశల దాటుకొని వెళ్లాలి. మొదటిగా బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి లీవ్ మోషన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ఆ తీర్మానం ఆమోదం పొందిన తర్వాత, బిల్లును సభలో ప్రవేశపెడతారు. ఆ బిల్లును ఉభయ సభలు ఆమోదించాల్సి ఉంటుంది. ఒక సభలో ఆమోదం పొందిన బిల్లును మరో సభలో ఆమోదం కోసం ప్రవేశపెట్టాలి. రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లులకు సైతం దాదాపు ఇదే ప్రక్రియ వర్తిస్తుంది. అయితే, బిల్లులోని అంశాలను విశ్లేషించేందుకు ప్రభుత్వం స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చు. స్టాండింగ్ కమిటీ తప్పకుండా ఆ బిల్లును మూడు నెలల్లోపు పరిశీలించి పార్లమెంట్‌కు పంపించాలి.
ఆ తర్వాత బిల్లు రెండో దశకు చేరుకుంటుంది. ఈ దశలో సదరు బిల్లును హౌస్‌లోని సెలెక్ట్ కమిటీకి లేదా ఉభయ సభల సంయుక్త కమిటీకి పంపాల్సి ఉంటుంది. బిల్లుపై సభ్యుల అభిప్రాయం కోరేందుకు దాన్ని సర్క్యులేట్ చేస్తారు. బిల్లులో చేయాల్సిన సవరణలపై సభ్యుల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు సేకరిస్తారు. ఇక, మూడో దశలో బిల్లులో ఏమైనా సవరణల చేయాల్సి ఉంటే చేస్తారు. లేదంటే నేరుగా సభ ఆమోదిస్తుంది. బిల్లును ఉభయ సభలు ఆమోదించిన తర్వాత.. ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోదంతో ఆ బిల్లు చట్టంగా మారుతుంది.
బిల్లులను ఆమోదించేందుకు ఉభయ సభలకు సమాన అధికారాలు ఉన్నాయా?
రాజ్యాంగం ప్రకారం, లోక్ సభ, రాజ్య సభ రెండింటికీ సమానమైన అధికారాలుంటాయి. అయితే, కొన్ని ప్రత్యేకమైన బిల్లులు కేవలం లోక్‌సభలో ఆమోదం లభిస్తే సరిపోతుంది. వాటినే మనీ బిల్లులుగా పిలుస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 110లో మనీ బిల్లు గురించి వివరించారు. అయితే, దేన్నీ మనీ బిల్లుగా పేర్కొనాలనే విషయం స్పీకర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.
కాగా, లోక్‌సభ మనీ బిల్లును ఆమోదించి, అది రాజ్యసభకు పంపిస్తుంది. అయితే, రాజ్యసభ ఎలాంటి సిఫార్సులు, మార్పులు చేర్పులు లేకుండానే 14 రోజుల వ్యవధిలో దానిని తిరిగి లోక్‌సభకు పంపాల్సి ఉంటుంది. సదరు మనీ బిల్లును రాజ్యసభ తిరస్కరించినా సరే అది లోక్‌సభలో ఆమోదం పొందితే చాలు ఆమోదం పొందినట్లే. అంతేకాదు, రాజ్యసభ 14 రోజుల్లోగా బిల్లును లోక్‌సభకు పంపనప్పటికీ.. పార్లమెంటు ఉభయసభల ఆమోదం పొందినట్లే పరిగణిస్తారు.
ఇక, రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదం విషయంలో మాత్రం ప్రత్యేక వ్యవస్థ అమల్లో ఉంది. ఈ బిల్లులను ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అయితే ఆ సభలోని మెజార్టీ సభ్యులు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అంటే మొత్తం సభ్యుల్లో కనీసం మూడింట రెండు వంతుల మంది బిల్లుకు అనుకూలంగా ఓటేస్తే సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో, రాజ్యాంగ బిల్లులను పార్లమెంటు ఆమోదించిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీలకు పంపించాల్సి ఉంటుంది. అయితే, కనీసం సగం రాష్ట్రాల ఆమోదించినా ఆ బిల్లు చట్ట రూపంలోకి వస్తుంది.
చట్ట సభలు ఆమోదించిన బిల్లును రాష్టపతి తిరసరించవచ్చా?
ఒక బిల్లు చట్టంగా మారాలంటే చివరగా రాష్ట్రపతి ఆమోదం పొందాలి. ఉభయ సభలు ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించినప్పుడు.. రాష్ట్రపతి దాన్ని క్లియర్ చేయవచ్చు లేదా వారి ఆమోదాన్ని నిలిపివేయవచ్చు లేదా బిల్లును పార్లమెంటు రివ్యూ కోసం తిరిగి పంపవచ్చు.
ఇది కూడా చదవండి : బడిబాట పడుతున్న బాలికలు.. పాఠశాలల్లో పెరిగిన విద్యార్థినుల సంఖ్య!
అయితే, ఈ అధికారం మనీ బిల్లులకు వర్తించదు. రాష్ట్రపతి సూచించిన సవరణలతో లేదా సవరణలు లేకుండానే తిరిగి ఆ బిల్లును రెండు సభలు ఆమోదించినట్లయితే, దాన్ని క్లియర్ చేయాలి. అయితే, పార్లమెంటు ఆమోదం తెలిపిన రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి నిలుపుదల చేయలేరు.
బిల్లు చట్టంగా మారడానికి ఎంత సమయం పడుతుంది?
పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం పొందిన బిల్లు సమర్థవంతంగా చట్టంగా మారడానికి సగటున 261 రోజులు పడుతుందని లీగల్ థింక్ ట్యాంక్ 2017 నివేదిక పేర్కొంది. బిల్లు చట్టంగా మారడానికి మరో రెండు దశలు పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదట ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో బిల్లులోని వివరాలను తెలియజేయాలి. రెండవది, చట్టాన్ని అమలు చేయడానికి అవసరమయ్యే నియమాలను రూపొందించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Explained, Farm Laws, Parliament, President of India