క్రిప్టో కరెన్సీ (Crypto Currency) పెట్టుబడులకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఇండియా ఒకటిగా మారింది. అయితే వీటిపై నియంత్రణ కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది కేంద్ర ప్రభుత్వం (Central government). క్రిప్టో వంటి డిజిటల్ కరెన్సీలపై (Digital Currency) నియంత్రణ కోసం ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్‌లో (Parliament) ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వివిధ డిజిటల్ కరెన్సీల విలువ భారీగా పతనమైంది. వాస్తవానికి క్రిప్టోకరెన్సీల విషయంలో కేంద్రం ముందు నుంచి జాగ్రత్తగానే వ్యవహరిస్తోంది. క్రిప్టో ఇన్వెస్టర్లకు ఆర్బీఐ (RBI) క్రమం తప్పకుండా సూచనలు ఇస్తోంది. ఈ క్రమంలో భారతదేశంలో క్రిప్టో పెట్టుబడులు ఎలా విస్తరించాయి? కొత్త బిల్లుతో వీటిపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇన్వెస్టర్ల ఆందోళనలు ఏంటి? వంటి వివరాలు తెలుసుకుందాం.
* భారతదేశంలో క్రిప్టోకరెన్సీలో ఎంత మంది ఇన్వెస్ట్ చేశారు?
సుమారు 10 కోట్ల మందికి పైగా భారతీయులు, వీరిలోనూ ఎక్కువగా యువకులు క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడులు పెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశంలో దాదాపు 10.07 కోట్ల మంది క్రిప్టోకరెన్సీ యజమానులు ఉన్నట్లు అంచనా. ఈ విషయంలో భారత్.. అమెరికా కంటే ముందుంది. అయితే హోల్డింగ్‌ల మొత్తం విలువలో మాత్రం అమెరికా, భారతదేశాన్ని అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు. క్రిప్టో రీసెర్చ్ సంస్థ CREBACO ప్రకారం.. క్రిప్టోకరెన్సీలలో మొత్తం పెట్టుబడులు ఏప్రిల్ 2020లో 1 బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉండగా, 2021 చివరలో 10 బిలియన్ డాలర్లకు పైగా పెరిగాయి. భారత్‌లో కొత్త క్రిప్టో బిల్లు గురించి వార్తలు రావడంతో బిట్‌కాయిన్, ఈథర్ వంటి ప్రధాన క్రిప్టోకరెన్సీల విలువ భారీగా పతనమైంది.
Crypto currencies: ఆ క్రిప్టో కరెన్సీలు మనుగడలో ఉండవా? రఘురామ్ రాజన్ ఏం చెబుతున్నారంటే..
క్రిప్టో కరెన్సీ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా, యువతను పక్కదారి పట్టించకుండా చూడటానికి అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చెప్పారు. అంతకుముందు క్రిప్టోకరెన్సీ సమస్యపై ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి మోదీ అధ్యక్షత వహించారు. క్రమబద్ధీకరించని క్రిప్టో మార్కెట్లు మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ వంటి చట్ట వ్యతిరేక చర్యలకు ఉపయోగపడే అవకాశం ఉందని సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు తెలిపారు. క్రిప్టోకరెన్సీ పెట్టుబడులపై భారీ రాబడి వస్తుందంటూ తప్పుదారి పట్టించే వాదనలపై కూడా ఆందోళనలు నెలకొన్నాయి. అధిక లాభాలు అందిస్తాయనే ప్రకటనలతో పెట్టుబడిదారులను, ముఖ్యంగా యువతను కంపెనీలు ఆకర్షిస్తున్న తీరుపై సైతం సమావేశంలో పాల్గొన్నవారు ధ్వజమెత్తినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
* క్రిప్టోలపై ఎలాంటి అధికారిక నిబంధనలను ప్రభుత్వం బిల్లులో చేర్చింది?
క్రిప్టోకరెన్సీ బిల్లును ఈ ఏడాది బడ్జెట్, వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ సాధ్యం కాలేదని నివేదికలు సూచిస్తున్నాయి. క్యాబినెట్‌లో పూర్తిగా చర్చించిన తరువాత దీనిపై బిల్లు గురించి ఆలోచిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులైలో చెప్పారు. ఈ క్రమంలో శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు లోక్‌సభ ముందుకు రానున్నట్లు లోక్‌సభ వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. క్రిప్టోలపై నియంత్రణతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే అధికారిక డిజిటల్ కరెన్సీ కోసం సులభతరమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి ఈ బిల్లును కేంద్రం సిద్ధం చేసింది. భారతదేశంలోని అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని బిల్లులో ఉంది కానీ, క్రిప్టోకరెన్సీ అంతర్లీన సాంకేతికతను, దాని ఉపయోగాలను ప్రోత్సహించడానికి కొన్ని మినహాయింపులు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లు.. క్రిప్టో కరెన్సీలను పూర్తిగా నిషేధించట్లేదని, క్రిప్టోకరెన్సీల దుర్వినియోగాన్ని నిరోధించడానికి నియంత్రణలు మాత్రమే ప్రతిపాదిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. దేశంలోని ఫియట్ కరెన్సీ, పన్నుల వ్యవస్థకు ప్రమాదకరం కాబట్టి వీటిని లీగల్ టెండర్‌గా గుర్తించట్లేదని వెల్లడించాయి.
IRCTC Shirdi Tour: తిరుపతి నుంచి షిరిడీకి ఐఆర్‌సీటీసీ టూర్... ప్యాకేజీ వివరాలివే
* భారతదేశంలో క్రిప్టోకరెన్సీ ట్రేడ్ ఎలా సాధ్యమవుతుంది?
దేశంలో బిట్‌కాయిన్ ట్రేడింగ్ పై నిషేధం ఉందా అని గత బడ్జెట్ సెషన్‌లో పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. 2018 ఏప్రిల్ నాటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్క్యులర్‌ను ఉదహరిస్తూ.. పెట్టుబడిదారులు వర్చువల్ కరెన్సీలతో వ్యవహరించకూడదని సూచించింది. అయితే సుప్రీంకోర్టు 2020లో ఇచ్చిన తీర్పులో ఆర్‌బీఐ సర్క్యులర్‌ను పక్కన పెట్టిందని పేర్కొంది. అంటే భారతీయ పెట్టుబడిదారులు క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ చేయడంలో ఎలాంటి పరిమితులు లేవని చెప్పినట్లైంది.
అయితే సుప్రీంకోర్టు ఆదేశం ఉన్నప్పటికీ.. అనేక ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు RBI సర్క్యులర్‌ను ఉటంకిస్తూ క్రిప్టోకరెన్సీల లావాదేవీలకు దూరంగా ఉండాలని తమ కస్టమర్లకు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో క్రిప్టోకరెన్సీ లావాదేవీల సేవలను తిరస్కరించడానికి బ్యాంకులు ఆ సర్క్యులర్‌ను ఉదాహరణగా చెప్పలేవని గత నెలలో ఆర్బీఐ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల దృష్ట్యా, తీర్పు వెలువడినప్పటి నుంచి సర్క్యులర్‌కు ప్రాధాన్యం లేకుండా పోయిందని RBI తెలిపింది.
Crypto values: బిట్‌కాయిన్ విలువ భారీగా పతనం.. క్రిప్టో బిల్లే కారణమా? పూర్తి వివరాలు
* వర్చువల్ కరెన్సీలతో ప్రభుత్వాలు ఎందుకు జాగ్రత్తగా ఉంటున్నాయి?
క్రిప్టోకరెన్సీ మైనింగ్ స్పేస్‌లో కీలక పాత్ర పోషించిన చైనాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు క్రిప్టోకరెన్సీలను నిషేధించాయి. క్రమబద్ధీకరించని డిజిటల్ కరెన్సీలు ఫియట్ కరెన్సీని జారీ చేయడం, ద్రవ్య విధానాన్ని నియంత్రించడం వంటి కేంద్ర ప్రభుత్వాల ప్రత్యేకాధికారాన్ని బలహీనపరుస్తాయని ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. క్రిప్టోకరెన్సీలు పన్ను ఎగవేతకు, సంపదను తరలించడానికి మార్గాలుగా మారుతున్నాయనే ఆందోళనలు కూడా ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ ఈ ఏడాది ఆగస్టులో పార్లమెంట్‌లో ప్రకటించినట్లుగా.. ప్రభుత్వం క్రిప్టోకరెన్సీలను లీగల్ టెండర్ లేదా నాణేలుగా పరిగణించదు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సాయం చేసే ఇలాంటి వ్యవస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆర్థిక శాఖ వెల్లడించింది.
వర్చువల్ కరెన్సీలకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ.. ప్రభుత్వం జారీ చేసే క్రిప్టోకరెన్సీ మినహా అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను భారతదేశంలో నిషేధించాలని సిఫార్సు చేసింది. కానీ డిజిటల్ ఎకానమీలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, ఇతర ఉపయోగాలను దృష్టిలో పెట్టుకొని క్రిప్టో లావాదేవీలను పూర్తిగా నిషేధించట్లేదని అధికార వర్గాలు తెలిపాయి. బ్లాక్‌చెయిన్ అనేది క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన లెడ్జర్ సిస్టమ్. ప్రభుత్వాలు, కార్పొరేట్‌లు సహా అనేక రంగాలు ఈ టెక్నాలజీపై దృష్టి సారిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.