గత కొన్నేళ్లలో భారత టెలికాం రంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. 2జీ, 3జీ, 4జీ, 5జీ అంటూ కొత్త టెక్నాలజీ విప్లవాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ భావి తరాల మార్గాలను సమూలంగా మార్చివేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్ లో ఇప్పటి వరకు 2జీ, 3జీ, 4జీ నెట్వర్కింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 5జీ కూడా రానుందని చాలా కాలంగా విస్తృతంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ దిశగా పెద్దగా అడుగులు పడలేదు.
ఈ క్రమంలో త్వరలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్-డాట్(DoT) తెలియజేసింది. 2022లో దేశంలోని కొన్ని నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ప్రాథమికంగా గురుగావ్, బెంగళూరు, కోల్ కతా, ముంబయి, చంఢీఘడ్, దిల్లీ, జామానగర్, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, లక్నో, పుణె, గాంధీనగర్ లాంటి నగరాల్లో తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది.
ముందు నగరాల్లోనే ఎందుకు?
తొలుత నగారాల్లోనే 5జీ సేవలను పరీక్షించాలని ప్రైవేటు టెలికాం దిగ్గజాలైన భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా సంస్థలు భావిస్తున్నాయి. ఇందుకోసం టెలికాం మేకర్స్ ఎరిక్సన్, నోకియాతో కలిసి పనిచేస్తున్నాయి. నగరాల్లో ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం 4జీ నుంచి అప్ గ్రేడ్ అయ్యేందుకు అక్కడ ప్రజలను సులభంగా ఒప్పించవచ్చనే కారణంతో ప్రాథమిక ట్రయల్స్ ను సిటీల్లో నిర్వహించేందుకు మక్కువ చూపుతున్నాయి.
అంతేకాకుండా ప్రారంభంలో 5జీ సేవలు ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుందని, కాబట్టి వాటిని భరించగలిగే వినియోగదారులు ఎక్కువగా ఉండే నగరాల్లో ప్రవేశపెట్టడమే మంచిదని పారిశ్రామిక నిపుణులు చెబుతున్నారు. నగరాల్లో నాలుగు గోడల కాంప్లెక్సుల నుంచి బహిరంగ ప్రదేశాల వరకు అన్ని రకాల ప్రదేశాల ఉంటాయని, 5జీ బ్యాండ్స్ పరీక్షించేందుకు సరిగ్గా సరిపోతాయని మూడో కారణంగా తెలుపుతున్నారు.
5జీ టెక్నాలజీ అంటే ఏంటి?
మొబైల్ బ్రాడ్ బ్యాండ్ నెట్వర్కింగ్ కు చెందిన లాంగ్ టర్మ్ ఎవల్యూషన్(LTE)లో ఐదో తరం అప్ గ్రేడ్ ఈ 5జీ టెక్నాలజీ. ఇందులో ప్రధానంగా తక్కువ(Low), మధ్య(Mid), అధిక(High) లాంటి మూడు బ్యాండ్లు ఉంటాయి. ప్రతిదానికి కొన్ని పరిమితులు ఉంటాయి. తక్కువ బ్యాండ్ స్పెక్ట్రమ్ కవరేజ్ పరంగా గొప్ప పనితీరు కనబర్చింది. గరిష్ఠ ఇంటర్నెట్ వేగం సెకనుకు 100 ఎంబీపీఎస్ కు పరిమితం చేయడమైంది.
అంటే ఇంటర్నెట్ వేగం అధికంగా అవసరం లేని, నిర్దిష్ట డిమాండ్లు లేని వాణిజ్య సెల్ ఫోన్ వినియోగదారుల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. పరిశ్రమలకు ఈ తక్కువ బ్యాండ్ స్పెక్ట్రమ్ అంత అనువుగా ఉండదు. మిడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ లో బ్యాండ్ కంటే మెరుగైన వేగాన్ని అందిస్తుంది. అయితే కవరేజ్ ఏరియా, సిగ్నల్స్ వ్యాప్తికి సంబంధించి పరిమితులను కలిగి ఉంటుంది. 5జీలో అగ్రగామిగా ఉన్న టెల్కోలు, కంపెనీలు ఈ బ్యాండ్ ను వినియోగిస్తున్నాయి.
హై బ్యాండ్ స్పెక్ట్రమ్ ఈ మూడింటిలోనూ వేగవంతమైంది. అయితే చాలా పరిమితమైన కవరేజీ, బలమైన సిగ్నల్ స్ట్రెంత్ ను కలిగి ఉంటుంది. ఈ స్పెక్ట్రమ్ లో ఇంటర్నెట్ వేగం సెకనుకు 20 జీబీపీఎస్(20 Gbps) కంటే ఎక్కువగా ఉన్నట్లు పరీక్షించారు. అయితే చాలాసార్లు 4జీ వేగం 1 జీబీపీఎస్ గా నమోదైంది.
5జీ ట్రయల్స్, లాంచింగ్‌లో భారత్ స్థానం ఏంటి?
5జీ స్పెక్ట్రమ్ వేలం ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా చెప్పనప్పటికీ వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో జరుగుతుందని సమాచారం. అయితే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఇంకా తమ ట్రయల్స్ ను పూర్తి చేసి వివిధ అంశాలను పరీక్షించని కారణంగా ఇందుకు ఇంకొంచెం ఆలస్యమవుతుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా వాటాదారులతో చర్చలు చివరి దశలో ఉన్నాయి. కాబట్టి వచ్చే ఏడాది ప్రారంభంలో డాట్ కు సిఫార్సులను సమర్పించే అవకాశముంది.
ఎయిర్టెల్ సంస్థ ఎరిక్సన్ తో కలిసి ఇప్పటికే ట్రయల్స్ నిర్వహించింది. జియో కూడా స్వదేశీ 5జీ నెట్వర్క్ టెస్టింగ్ పూర్తి చేసింది. ప్రస్తుతం డ్రోన్ ట్రయల్స్, స్పీడ్ టెస్టులను నిర్వహిస్తోంది. 2020 సెప్టెంబరు నాటికి 5జీ సేవలు ప్రారంభిస్తామని జియో 2019 ప్రారంభంలోనే స్పష్టం చేసింది.
ఇతరదేశాలు, ప్రపంచ కంపెనీలు భారత్ కంటే ముందున్నాయా?
ప్రభుత్వాల కంటే గ్లోబల్ టెలికాం కంపెనీలే ముందుగా 5జీ నెట్వర్క్ అభివృద్ధిపై దృష్టి సారించాయి. వాటిని ప్రయోగాత్మకంగా వినియోగదారులకు అందిస్తున్నాయి కూడా. అమెరికాలో AT&T, T-mobile, వేరిజోన్ లాంటి కంపెనీలు ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. AT&T లాంటి 2018లోనే పరీక్షించి అమలు చేయడం ప్రారంభించగా.. వేరిజోన్ 2020 చివరి నాటికి 60 నగరాలకు 5జీ అల్ట్రా వైడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను విస్తరించింది. చైనా కంపెనీలు కూడా 2018లో ఈ సేవల ట్రయల్స్ ను ప్రారంభించాయి.
వినియోగదారులకు ఎలాంటి మార్పులుంటాయి?
5జీ కనెక్షన్ వినియోగదారులకు గొప్ప అనుభూతినిస్తుంది. ఇదే అతి ప్రధానమైన మార్పు. స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారాలను బహుళ కెమెరా యాంగిల్స్ తో వీడియోలను ప్రసారం చేయగలరు లేదా వీఆర్ హెడ్ సెట్ లేదా ఇతర డివైజులను ఉపయోగించి వీడియోగేమ్స్ కూడా ఆడగలరు.
పరిమితులు, ధరలో భారీ వ్యత్యాసం లేనట్లయితే ఇప్పటికే ఉన్న బ్రాడ్ బ్యాండ్ సేవలను భర్తీ చేసి హై-స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటినీ ఈ 5జీ సాంకేతికత సాధ్యం చేస్తుంది. స్మార్ట్ ఫోన్ల విషయానికొస్తే కొన్ని డివైజ్‌లలో ఇప్పటికే 5జీ ఆప్షన్ సిద్ధంగా ఉంది. ఎరిక్సన్ సంస్థ వచ్చే ఐదేళ్లలో భారత్ లో 500 మిలియన్ల 5జీ సభ్యత్వాలను అందుకుంటుందని ఆత్మవిశ్వాసంతో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G, Technology