Jerusalem: జెరూసలెం కేంద్రంగా దాడులకు పాల్పడుతున్న వివిధ వర్గాలు.. ఆ నగరం ప్రాధాన్యం ఏంటి..

Jerusalem: జెరూసలెం కేంద్రంగా దాడులకు పాల్పడుతున్న వివిధ వర్గాలు.. ఆ నగరం ప్రాధాన్యం ఏంటి..

ప్రతీకాత్మకచిత్రం

Explained: Jerusalem: గత కొన్ని రోజుల నుంచి జెరూసలెంలో ఇజ్రాయెలీలు, పాలస్తీనియన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నగరం.. క్రైస్తవ మతం, ఇస్లాం, జుడాయిజానికి ఎంతో ముఖ్యమైనది. ఈ మూడు మతాలకు సంబంధించిన మూలాలు, కీలక ఘట్టాలకు జెరూసలెం కేంద్ర బిందువుగా ఉందని నమ్ముతారు.

  • Share this:
ప్రపంచంలోని పురాతన నగరాల్లో జెరూసలెం ఒకటి. ఇది క్రైస్తవులు, యూదులు, ముస్లింలకు పవిత్రమైన స్థలం. ఈ నగరానికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. జెరూసలెంను హీబ్రూలో యెరుషాలైమ్ అని, అరబిక్‌లో అల్-కుద్స్ అని పిలుస్తారు. ఎన్నో పోరాటాలు, ఆక్రమణలకు ఈ నగరం సాక్ష్యంగా మిగిలింది. విధ్వంసాల తరువాత నగరాన్ని చాలాసార్లు పునర్నిర్మించారు. వివిధ మతాల మధ్య విభజన, సంఘర్షణలు ఇక్కడ నిత్యకృత్యం. ఈ పవిత్రమైన ప్రదేశాన్ని వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. గత కొన్ని రోజుల నుంచి జెరూసలెంలో ఇజ్రాయెలీలు, పాలస్తీనియన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నగరం.. క్రైస్తవ మతం, ఇస్లాం, జుడాయిజానికి ఎంతో ముఖ్యమైనది. ఈ మూడు మతాలకు సంబంధించిన మూలాలు, కీలక ఘట్టాలకు జెరూసలెం కేంద్ర బిందువుగా ఉందని నమ్ముతారు.

జెరూసలెం చుట్టూ కోట లాంటి రాతి గోడ ఉంది. ప్రపంచంలోని కొన్ని పవిత్ర స్థలాలకు ఇది నిలయంగా ఉంది. చారిత్రకంగా, భౌగోలికంగా ఈ నగరాన్ని నాలుగు విభాగాలుగా వర్గీకరించవచ్చు. ఇక్కడ క్రిస్టియన్లు, ముస్లింలు, యూదులు, అర్మేనియన్లు నాలుగు వంతులుగా ఉన్నారు. ఆర్మేనియన్లు కూడా క్రైస్తవుల కిందకే వస్తారు. వీరి జనాభా తక్కువగానే ఉన్నప్పటికీ, ప్రపంచంలోని పురాతన అర్మేనియన్ సెంటర్లలో జెరూసలెం ఒకటిగా నిలుస్తోంది. ఇక్కడ ఉన్న ప్రఖ్యాత సెయింట్ జేమ్స్ చర్చి.. క్రైస్తవులతో పాటు అర్మేనియన్ల ప్రత్యేకమైన సంస్కృతిని, నాగరికతను సంరక్షిస్తోంది. దీంతో పాటు ముస్లింలకు పవిత్రమైన అల్-అక్సా మసీదు, యూదుల పుణ్యక్షేత్రమైన వెస్ట్రన్ వాల్.. వంటి ప్రధాన క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి.

చర్చి
జెరూసలెంలో పావు వంతు ఉన్న క్రిస్టియన్ క్వార్టర్‌లో చర్చి ఆఫ్ ది హోలీ సెపల్చర్ అనే ప్రఖ్యాత చర్చి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు ముఖ్యమైన ప్రార్థన మందిరంగా దీనికి పేరుంది. జీసస్ క్రైస్ట్ జీవితంలోని ప్రధాన ఘట్టాలకు కేంద్రీకృతమైన ప్రదేశంగా దీన్ని భావిస్తారు. క్రీస్తు మరణం, సిలువ వేయడం, పునరుత్థానం వంటివి ఈ ప్రాంతంలోనే జరిగాయని క్రిస్టియన్లు నమ్ముతారు. క్రీస్తుకు ఇక్కడే సిలువ వేశారని క్రైస్తవ సంప్రదాయాలు, గ్రంథాల్లో పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న గోల్గోథా లేదా కల్వరి కొండపై ఆయన సమాధి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది క్రైస్తవులకు ఇది ప్రముఖ ప్రార్థనా స్థలం. ఇక్కడ ఉన్న క్రీస్తు ఖాళీ సమాధిని వారు దర్శించుకొని ప్రార్థనలు చేస్తుంటారు.

ఈ చర్చిని వివిధ క్రైస్తవ తెగల ప్రతినిధులు నిర్వహిస్తారు. ప్రధానంగా గ్రీక్ ఆర్థోడాక్స్ పాట్రియార్చేట్, రోమన్ కాథలిక్ చర్చికి చెందిన ఫ్రాన్సిస్కాన్ సన్యాసులు, ఆర్మేనియన్ పాట్రియార్చేట్ సంయుక్తంగా నిర్వహిస్తారు. ఇథియోపియన్లు, కోప్టిక్స్, సిరియన్ ఆర్థోడాక్స్ చర్చిలు కూడా దీంట్లో పాలుపంచుకుంటాయి.

మసీదు
జెరూసలెంలోని నాలుగు వంతుల్లో ముస్లింలు ఉండే భాగం అతి పెద్దది. ఇస్లాంలో ప్రముఖ ప్రార్థనా మందిరాలైన డోమ్ ఆఫ్ రాక్, అల్-అక్సా మసీదులు ఇక్కడ ఉన్నాయి. ఈ మసీదు ఇస్లాంలో మూడవ పవిత్ర ప్రదేశం. వక్ఫ్ అనే ఇస్లామిక్ ట్రస్ట్ దీని నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తుంది. ముస్లింలు ఈ ప్రాంతాన్ని హరామ్ అల్-షరీఫ్ లేదా నోబెల్ శాంచురీ (ఎంతో గొప్పదైన అభయారణ్యం) అని పిలుస్తారు. ముహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఇక్కడకు ప్రయాణించి, ప్రవక్తలందరి ఆత్మలతో కలిసి ప్రార్థించారని ముస్లింలు నమ్ముతారు. దగ్గర్లో ఉన్న డోమ్ ఆఫ్ ది రాక్ వద్ద నుంచే స్వర్గానికి వెళ్లారని ముస్లింలు నమ్ముతారు. ఏడాది పొడవునా ఈ పవిత్ర స్థలాన్ని సందర్శిస్తారు. రంజాన్ మాసంలోని ప్రతి శుక్రవారం లక్షలాది మంది మసీదులో ప్రార్థనలు చేస్తారు.

యూదుల గోడ
యూదుల పవిత్రమైన మందిరం ఒకప్పుడు జెరూసలెంలో ఉండేది. కానీ దీన్ని ధ్వంసం చేసినట్లు చరిత్ర చెబుతోంది. దాడి తరువాత మిగిలిన మందిరం గోడను యూదులు పవిత్ర స్థలంగా భావిస్తారు. దీన్ని కోటెల్ లేదా వెస్ట్రన్ వాల్ అని పిలుస్తారు. ఈ ఆలయం లోపల జుడాయిజంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే స్థలం హోలీ ఆఫ్ హోలీస్ ఉండేది. సృష్టికి మూలం ఇదేనని యూదులు నమ్ముతారు. అబ్రహం తన కుమారుడైన ఇసాక్‌ను బలి ఇవ్వడానికి సిద్ధమైన ప్రదేశం కూడా ఇదేనని వారు నమ్ముతారు. చాలా మంది యూదులు డోమ్ ఆఫ్ ది రాక్.. హోలీస్ హోలీ ప్రదేశంలోని ఒక భాగమని భావిస్తారు. ప్రస్తుతం వెస్ట్రన్ వాల్ వద్ద యూదులు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దీని నిర్వహణ బాధ్యతలను వెస్ట్రన్ వాల్‌కు చెందిన ‘రబ్బీ’ నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే లక్షల మంది యూదులు ఈ స్థలాన్ని సందర్శిస్తారు.
Published by:Krishna Adithya
First published:

అగ్ర కథనాలు