యూఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రతి నెలా ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ (FPI) డేటాను విడుదల చేస్తుంటుంది. ఈ క్రమంలో అక్టోబరు నెలకు సంబంధించిన ఎఫ్‌పీఐ డేటాను సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో ఆసక్తికరమైన అంశాలను చేర్చింది. సాధారణంగా తృణధాన్యాలు, నూనెల అంతర్జాతీయ ధరలలో నెలవారీ మార్పులను వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్(FPI) ట్రాక్ చేస్తుంటుంది. అయితే ఈ ఇండెక్స్ గత కొద్ది నెలలుగా విపరీతంగా పెరిగిపోతోంది. యూఎన్ డేటా ప్రకారం ఎఫ్‌పీఐ సగటున 133.2 పాయింట్లను చూపించడం విశేషం. జులై 2011 తరువాత మళ్లీ 2021 అక్టోబర్ నెలలోనే ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ గరిష్ఠ స్థాయిని తాకడం గమనార్హం.
కరోనా వ్యాప్తి తర్వాత ఎఫ్‌పీఐ పాయింట్లు చాలా విస్తృతమైన రేంజ్ లో కదలాడుతూ వస్తున్నాయి. కొద్ది నెలల కాలంలోనే ఇండెక్స్ కనిష్ఠ స్థాయిని తాకడం.. మళ్లీ గరిష్ఠ స్థాయిని అందుకోవడం గమనార్హం. మే 2020లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పుడు ఎఫ్‌పీఐ నాలుగేళ్ల కనిష్ట స్థాయిను తాకుతూ 91.1 పాయింట్లకు కుప్పకూలింది. తరువాత అక్కడి నుంచి పదిన్నర సంవత్సరాల గరిష్ట స్థాయికి ఇప్పుడు ఎగబాకింది. ఈ పాయింట్లలో గణనీయమైన మార్పులు రావడానికి ముఖ్య కారణం చమురు అని చెప్పుకోవచ్చు. ఏప్రిల్, మే 2020లో బ్రెంట్ క్రూడ్(Brent Crude) ధరలు వరుసగా బ్యారెల్‌కు సగటున 25.27 డాలర్లు, 35.33 డాలర్లకు పడిపోయాయి. మళ్ళీ అక్టోబర్ 2021లో బ్రెంట్ క్రూడ్ ధర పెరిగి బ్యారెల్‌కు 84.38 డాలర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చమురుకు, ఆహార ధరలకు మధ్య ఎలాంటి సంబంధం ఉందో వివరంగా తెలుసుకుందాం.
ఇవి చదవండి..Smartphones: స్మార్ట్ ఫోన్ పేలకుండా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే...
ఆహారానికి, చమురుకి మధ్య సంబంధం ఏంటి?
పెట్రోలియం, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఒకేసారి మారడానికి బయో-ఫ్యూయల్స్ ఓ కారణం అని చెప్పవచ్చు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు చెరకు, మొక్కజొన్న నుంచి ఉత్పత్తి అయిన ఇథనాల్‌ను పెట్రోల్‌తో కలపడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. లేదా బయోడీజిల్ ఉత్పత్తికి పామ్(palm oil), సోయాబీన్ నూనెలను ఉపయోగిస్తాయి. అంతేకాకుండా పత్తి(cotton) పెట్రోకెమికల్స్ ఆధారిత సింథటిక్ ఫైబర్లకు సరసమైనదిగా మారుతుంది.
ఇవి చదవండి..WhatsApp: గూగుల్ డ్రైవ్ లేకుండా కొత్త ఫోన్లోకి వాట్సప్ డేటా ట్రాన్స్ఫర్ చేయండిలా
మొక్కజొన్న పశుగ్రాసం అయినందున.. దానిని ఇథనాల్‌కు మళ్లించడం వల్ల పశువుల ఆహారంగా ప్రత్యామ్నాయ ధాన్యాలను వాడాల్సి ఉంటుంది. ఆ సమయంలో చాలామంది పశువులకు గోధుమలతో సహా ఇతర ధాన్యాలను ఆహారంగా అందిస్తుంటారు. ఫలితంగా ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి. షుగర్ కేన్ మిల్లులు ఆల్కహాల్ కోసం చెరకు నిష్పత్తిని పెంచడం వల్ల చక్కెర ధరలు కూడా భగ్గుమంటాయి. గత కొద్ది నెలల్లో బయో ఫ్యూయల్ కారణంగా పత్తి, చెరకు ధరలు ఎంతగా పెరిగిపోయాయో చూస్తే.. వాటి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది ప్రస్ఫుటమవుతుంది.
మొక్కజొన్న దొరకనప్పుడు గోధుములను అధిక ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దానివల్ల పశువుల దాణా ఖర్చు పెరిగిపోయి మిల్క్ పౌడర్ ధరలు కూడా పెరుగుతాయి. కరోనా తర్వాత ప్రజల పాల ఉత్పత్తుల వినియోగం పెరిగింది. సెంటిమెంట్ కూడా ఆహార ధరల మార్పులో కీలక పాత్ర పోషిస్తుంది.
ఆర్థిక కార్యకలాపాలు, ఉద్దీపన
ఈ సెంటిమెంట్ అనేది రెండు విషయాలతో ముడిపడి ఉంటుంది. మొదటిది, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, పెరుగుతున్న టీకా రేట్ల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలను పునరుద్దరించాలని డిమాండ్ చేయడం. రెండవది కరోనా మిగిల్చిన ఆర్థిక నష్టాన్ని పరిమితం చేయడానికి యూఎస్ ఫెడరల్ రిజర్వ్, ఇతర గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్‌లు లిక్విడిటీని అన్ లాక్ చేయడం. అయితే డిమాండ్ కు తగిన విధంగా సప్లై చైన్ అనేది వేగవంతం కాలేకపోయింది.
రైతులపై ప్రభావం
అంతర్జాతీయ ధరల పెరుగుదల ఉత్పత్తిదారులకు, ముఖ్యంగా రైతులకు మేలు చేసిందా? అని ప్రశ్నిస్తే కొంతవరకూ మేలు చేసిందని చెప్పవచ్చు. గుజరాత్ లోని రాజ్‌కోట్ మార్కెట్లో కపాస్ (ముడి జిన్న్ చేయని పత్తి) నేడు క్వింటాల్‌కు రూ. 7,500-8,000 ధరకు అమ్ముడవుతోంది. లాంగ్-స్టెపుల్ పత్తి రకాలకు ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ. 6,025 కంటే కపాస్ ఎక్కువ ధర పలుకుతుండటం విశేషం. సోయాబీన్ సాగుదారులు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని లాతూర్ వంటి మార్కెట్లలో క్వింటాల్‌కు రూ.5,000కు పైగా ధరను పొందుతున్నారు. వీటి కనీస మద్దతు ధర రూ.3,950 కాగా క్వింటాల్‌కు వెయ్యి రూపాయలకు పైగా అదనంగా రైతులు సొమ్ము చేసుకుంటున్నారు.
అయితే సోయాబీన్, పత్తి ఎక్కువ ధరలకు అమ్ముడు పోతున్నప్పటికీ.. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో రైతులు ఇంధనం, ఎరువుల కోసం ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది. అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా భారత దేశ వ్యాప్తంగా డీజిల్ ధరలు కొంతకాలంగా ఎలా పెరిగిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. పెరిగిన ఇంధన ధరలు రైతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
ఎరువులు
ఎరువుల పరిస్థితి నానాటికీ ఘోరంగా మారుతోంది. డి-అమ్మోనియం ఫాస్పేట్ (DAP) ప్రస్తుతం భారతదేశంలోకి టన్నుకు 800 డాలర్ల(ఖర్చు, సముద్రపు సరుకుతో సహా) చొప్పున దిగుమతి అవుతోంది. మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (MOP) టన్నుకు 450 డాలర్ల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఇవి 2007-08 ప్రపంచ ఆహార సంక్షోభం సమయంలో ఉన్న ధరలకు దగ్గరగా ఉన్నాయి.
మరోవైపు యూరియా ల్యాండింగ్ ధరలు(landed prices- రేవుల వద్ద దిగుమతి అయ్యే) టన్నుకు 900 డాలర్ల స్థాయిని అధిగమించాయి. ఎరువులతో పాటు, వాటి మధ్యవర్తుల ధరలు, రాక్ ఫాస్ఫేట్, సల్ఫర్, ఫాస్పారిక్ యాసిడ్, అమ్మోనియా వంటి ముడి పదార్థాల ధరలు కూడా డిమాండ్, చమురు & గ్యాస్ పెరుగుదల వల్ల భగ్గుమంటున్నాయి. దీన్నిబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎరువుల ధరలను తగ్గించే విషయంలో సవాళ్లు ఎదుర్కోవడం అనివార్యం కాబోతోందని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.