సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, దాని రెండు అనుబంధ సంస్థలు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ సేవలు అక్టోబర్ 4న దాదాపు ఆరు గంటల పాటు నిలిచిపోయాయి. నిజానికి ఫేస్బుక్ సేవలు గానీ వాట్సాప్ సేవలు గానీ ఎన్నడూ పదినిమిషాల కంటే ఎక్కువసేపు నిలిచిపోలేదు. తాజాగా దాదాపు ఆరు గంటల వరకు సేవలు స్తంభించిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు అయోమయానికి గురయ్యారు. ఇంత పెద్ద సోషల్ మీడియా సైట్లు వరల్డ్ వైడ్‌గా గంటల కొద్దీ ఎందుకు నిలిచిపోయాయో ఎవరికీ అర్థం కాలేదు. మరి అసలు దీనికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
ఫేస్బుక్ సేవలు ఎందుకు నిలిచిపోయాయి?
దాదాపు ఆరు గంటల పాటు ఫేస్బుక్ సేవలు ఆగిపోవడానికి "ఫాల్టీ కాన్ఫిగరేషన్ చేంజ్(faulty configuration change)"యే కారణమని ఫేస్బుక్ సోమవారం వెల్లడించింది. "ఫేస్బుక్ అంతర్గత సాధనాలు, వ్యవస్థల్లో కూడా లోపాలు తలెత్తాయి. అందుకే సమస్యను గుర్తించడానికి, దాన్ని పరిష్కరించడానికి చాలా క్లిష్టంగా మారింది. ఫేస్బుక్ డేటా సెంటర్ల మధ్య నెట్వర్క్ ట్రాఫిక్‌ను సమన్వయం చేసే ప్రధాన రౌటర్లపై ఏర్పడిన కాన్ఫిగరేషన్ మార్పుల వల్ల సేవలు నిలిచిపోయాయి. దీనివల్లే ఫేస్బుక్ తో సహా దాని అనుబంధ సంస్థల డేటాసెంటర్లపై ప్రతికూల ప్రభావం పడింది. ఫలితంగా అన్ని సేవలు నిలిచిపోయినట్లు మా ఇంజనీరింగ్ బృందాలు గుర్తించాయి" అని ఫేస్బుక్ పేర్కొంది.
ఈ ప్రకటన గురించి టెక్నాలజీ నిపుణులు స్పష్టమైన వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా డొమైన్ నేమ్ సిస్టమ్(DNS) అనేది ఫేస్బుక్.కామ్ వంటి డొమైన్లను ఐపీ (IP) అడ్రసులలోకి అనువదిస్తుంది. అప్పుడు ఇంటర్నెట్ సాయంతో ఆ సైట్‌ను యాక్సెస్ చెయ్యగలం. ఒక సైట్‌కు సంబంధించి డీఎన్ఎస్ రికార్డులు అందుబాటులో లేనట్లయితే ఆ సైట్‌ను యాక్సెస్ చేయడం కుదరదు. అలాగే బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్ (BGP) రికార్డులు కూడా చాలా ముఖ్యం. ఇది ఇంటర్నెట్లో ఆటోనమస్ సిస్టమ్స్ (AS) మధ్య సమాచారాన్ని బదిలీ చేయడానికి రూట్స్ అందిస్తుంది. ఒక వెబ్ సైట్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉండేందుకు ఈ రెండూ ముఖ్యమే. "ఫేస్బుక్, దాని అనుబంధ సంస్థల డీఎన్ఎస్ నేమ్స్ పరిష్కరించడం (resolving) ఆగిపోయాయి. ఈ సంస్థల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీలు కూడా అందుబాటులో లేవు. ఎవరో ఫేస్బుక్ డేటా సెంటర్ల నుంచి ఒకేసారి కేబుల్స్ లాగేసి దాన్ని ఇంటర్నెట్ నుంచి డిస్కనెక్ట్ చేసినట్లుగా అనిపించింది." అని వెబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెబ్ సెక్యూరిటీ కంపెనీ 'క్లౌడ్‌ఫ్లేర్'కి చెందిన ఇద్దరు సీనియర్ ఇంజనీర్లు ఓ బ్లాగ్ పోస్ట్‌లో వివరించారు. వీరి ప్రకారం, ఫేస్బుక్ తన డీఎన్ఎస్ సర్వర్‌కు బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్ (BGP) ద్వారా మార్గాలను తెలియజేయడాన్ని ఆపివేసింది.
అనేక నెట్‌వర్క్‌ల ద్వారా అనుసంధానమైన ఇంటర్నెట్.. ప్రతి నెట్వర్క్ ప్యాకెట్‌ను దాని తుది గమ్యస్థానాలకు చేరవేసేందుకు నిరంతరంగా రూట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేస్తుంటుంది. ఈ నెట్‌వర్క్‌లు బీజీపీ ద్వారా పనిచేస్తుంటాయి. బీజీపీ అనేది ఫేస్బుక్ వెబ్సైట్ తన ఆన్లైన్ స్టేటస్ ను ఇతర నెట్‌వర్క్‌లకు తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది. కానీ బీజీపీ ఆఫ్‌లైన్ స్థితికి చేరుకోవడంతో ఇతర నెట్‌వర్క్‌లకు సమాచారం అందలేదు. ఫలితంగా మెయిన్ సర్వర్ కి, యూజర్లకు మధ్య కనెక్షన్ తెగిపోయింది. ఈ సమయంలో https://facebook.com ద్వారా బ్రౌజర్లో ఫేస్‌బుక్‌ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎర్రర్ అనే మెసేజ్ కనిపించింది. ఇందుకు కారణం ఈ డొమైన్‌ను ఐపీ అడ్రస్సులలోకి అనువదించే డీఎన్ఎస్ రిసాల్వర్ ఆఫ్ లైన్ లోకి వెళ్లి పోవడమే. ఇది సాధారణంగా వెబ్ సైట్ క్యాచీలను తనిఖీ చేసి సమాచారాన్ని యూజర్ కి అందిస్తుంది. ఒకవేళ ఎలాంటి క్యాచీ అందుబాటులో లేనట్లయితే.. ఇది డొమైన్ నేమ్సర్వర్ల ద్వారా సైట్ స్టేటస్ తెలియజేస్తుంది. కానీ అక్టోబర్ 4న ఫేస్బుక్ డొమైన్ నేమ్సర్వర్లు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ విషయాన్ని క్లౌడ్‌ఫ్లేర్ ఇంజనీర్లు వెల్లడించారు. ఫేస్బుక్ తన డీఎన్ఎస్ ప్రీఫిక్సస్(DNS Prefixes) ప్రకటించడాన్ని ఆపి వేసినట్టు తాము గమనించామని ఇంజనీర్లు తెలిపారు. ఇతర ఫేస్బుక్ ఐపీ అడ్రస్ లకు రూట్స్ అందుబాటులోనే ఉన్నాయి.. కానీ అసలైన డీఎన్ఎస్ పూర్తి స్థాయిలో లేనందున ఇవి నిరుపయోగంగా మారాయని పేర్కొన్నారు.
పడిపోయిన ఫేస్బుక్ షేర్లు..
ఇకపోతే ఈ సమయంలో స్టాక్ మార్కెట్లో ఫేస్బుక్ షేర్లు కూడా తక్కువ ధరకే అమ్ముడుపోయాయి. దాంతో మార్క్ జుకర్‌బర్గ్ సంపద కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 6 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. అక్టోబర్ 4న ఈ సంస్థ షేర్లు 5శాతం మేర పడిపోయాయి. దీంతో సెప్టెంబర్ నెల ద్వితీయార్థం నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేర్ల విలువ 15 శాతం పడిపోయింది. ఇతర మెసేజింగ్ యాప్ అయిన "సిగ్నల్" డౌన్లోడ్స్ కూడా పెరిగిపోయాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Facebook