హోమ్ /వార్తలు /Explained /

Covid and Blood Tests: కోవిడ్ బాధితులకు ఎలాంటి రక్త పరీక్షలు అవసరమవుతాయి.. పూర్తి వివరాలు ఇవే

Covid and Blood Tests: కోవిడ్ బాధితులకు ఎలాంటి రక్త పరీక్షలు అవసరమవుతాయి.. పూర్తి వివరాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్ బాధితులకు వైద్యులు నిర్వహించే వివిధ రకాల రక్త పరీక్షలు, చికిత్సలో వాటి ప్రాధాన్యం గురించి తెలుసుకుందాం.

దేశంలో కరోనా తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతోంది. గత రెండు నెలలుగా విజృంభిస్తోన్న మహమ్మారి, ఎంతోమందిని బలితీసుకుంది. ఈసారి కోవిడ్ బాధితుల ఊపిరితిత్తులపై వైరస్ ఎక్కువ ప్రభావం చూపింది. దీంతో చాలామందికి ఆక్సిజన్ చికిత్స అనివార్యంగా మారింది. అందువల్ల ఇన్‌ఫెక్షన్ ఎక్కువ కావడానికి ముందే, లక్షణాలు కనిపించిన వెంటనే ఆర్టీపీసీఆర్, యాంటీజెన్ వంటి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే రోగి పరిస్థితి, ఇతర అనారోగ్యాల ప్రభావాన్ని బట్టి కోవిడ్ బాధితులకు చికిత్స అందిచాల్సి ఉంటుంది. ఇందుకు వైద్యులు మరికొన్ని బ్లడ్ టెస్టులు అదనంగా చేస్తారు. ఈ నేపథ్యంలో అసలు బాధితులకు వైద్యులు నిర్వహించే వివిధ రకాల రక్త పరీక్షలు, చికిత్సలో వాటి ప్రాధాన్యం గురించి తెలుసుకుందాం.

CBC/CBP

సీబీసీ లేదా సీబీపీ అనేది సాధారణ రక్త పరీక్ష. దీన్ని కంప్లీట్ బ్లడ్ కౌంట్ లేదా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు. దీని ద్వారా రోగుల రక్తంలో ఎర్ర రక్త కణాలు (ఆర్‌బీసీ), తెల్ల రక్త కణాలు (డబ్ల్యూబీసీ), ప్లేట్‌లెట్స్ సంఖ్యను గుర్తిస్తారు. వ్యాధి కారణంగా రోగుల రక్త కణాల్లో జరిగే మార్పులను సీబీపీ గుర్తిస్తుంది. ఈ టెస్టులో ఏదైనా అనుకోని మార్పులను గుర్తిస్తే, దాని ఆధారంగా వైద్యులు బాధితులకు అదనంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. రక్త కణాల పరిమాణం, వాటి రూపం లేదా ఆకారంలో గుర్తించిన మార్పుల ఆధారంగా వైద్యులు చికిత్స అందిస్తారు.

CRP

సీ-రియాక్టివ్ ప్రోటీన్‌ (CRP)ను మానవ కాలేయం ఉత్పత్తి చేస్తుంది. వైరస్ కారణంగా శరీర భాగాల్లో ఏర్పడే వాపు, ఇన్‌ఫెక్షన్‌పై పోరాడటానికి సహజంగానే రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందిస్తుంది. ఇందులో భాగంగా రక్తంలో CRP స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో ఇది స్వల్పంగా పెరుగుతుంది. రుమటాయిడ్, ఇన్ఫెక్షియస్ ఆర్థరైటిస్‌ బాధితుల్లో మధ్యస్తంగా పెరుగుతుంది. తీవ్రమైన బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడిన వారిలో తీవ్రంగా పెరుగుతుంది. ఈ టెస్టు ద్వారా రోగ నిరోధక శక్తి రియాక్షన్‌ స్థాయిని అంచనా వేయవచ్చు. దీంతోపాటు కోవిడ్ రోగులకు ఎదురయ్యే ఇతర సమస్యలను ముందుగానే తెలుసుకుని, వాటి ఆధారంగా చికిత్స అందించవచ్చు.

డి- డైమర్

సాధారణంగా మన రక్త నాళాల లోపల ప్రవహించే రక్తం గడ్డకట్టదు. కానీ ఏదైనా గాయమైతే మాత్రం, వెంటనే రక్తస్రావాన్ని నివారించడానికి రక్తం సహజంగానే గడ్డకడుతుంది. ఒకవేళ ఎవరి శరీరంలోనైనా రక్తం గడ్డకడితే, దీన్ని నివారణించి రక్త ప్రవాహం సహజంగా జరిగే వ్యవస్థ శరీరంలో ఉంటుంది. అయితే వ్యాధులు, ఇన్ఫెక్షన్లు సోకినవారి రక్త నాళాల్లో ఇలా రక్తం గడ్డకడుతుంది. దీన్ని సకాలంలో నివారించకపోతే, రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడి ప్రాణం పోయే అవకాశం కూడా ఉంది. డి-డైమర్ టెస్టు ద్వారా దీన్ని గుర్తించవచ్చు. బాధితుల శరీరంలో డి- డైమర్ స్థాయిలు పెరిగితే, రక్తం గడ్డకట్టడానికి ఎక్కువ అవకాశం ఉందని అర్థం. ఇలాంటప్పుడు రక్తాన్ని పలుచగా చేసే మందులను రోగులకు సిఫారసు చేస్తారు.

LDH

లాక్టేట్ డీహైడ్రోజినేస్ (LDH) అనే ఎంజైమ్ శరీరంలోని అన్ని కణాల్లో ఉంటుంది. ఏదైనా వ్యాధి లేదా ఇన్‌ఫెక్షన్ కారణంగా కణాలకు నష్టం వాటిల్లినప్పుడు, వాటిలో రక్తం స్థాయి పెరుగుతుంది. కఠినమైన వ్యాయామం కారణంగా కూడా ఇది పెరగవచ్చు. శరీర అవయవాల్లో ఉండే ఎల్‌డీహెచ్‌ స్థాయిని.. దాని పనితీరు, ఆరోగ్యానికి సంకేతంగా భావిస్తారు. అందువల్ల ఇన్‌ఫెక్షన్ ప్రభావం అవయవాలపై ఎలా ఉంది, దీనివల్ల వాటి పనితీరు ఎలా మారుతుంది.. వంటి సమాచారాన్ని ఎల్‌డీహెచ్ టెస్టు ద్వారా తెలుసుకోవచ్చు. సమస్యను ముందుగానే గుర్తించి సరైన చికిత్స అందించవచ్చు.

IL6

ఏదైనా ఇన్‌ఫెక్షన్ ఎదురైనప్పుడు, దానిపై పోరాడటానికి శరీరంలోని రోగనిరోధక శక్తి ఇంటర్లూకిన్స్-6 (IL6) అనే పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది సీఆర్‌పీ, ఫైబ్రిన్ వంటి పదార్ధాల ఉత్పత్తిని పెంచి, వ్యాధి కణాలతో పోరాడుతుంది. కొంతమందిలో ఇవి ఎక్కువగా విడుదలవుతూ ప్రమాదకరంగా మారుతాయి. అందువల్ల కోవిడ్ రోగుల రక్తంలో ఎప్పటికప్పుడు IL6 స్థాయిని గుర్తించాలి. ఇది ఎక్కువగా పెరిగినప్పుడు, బాధితులకు కొన్ని రకాల స్టెరాయిడ్లు ఇవ్వాల్సి ఉంటుంది.

లివర్ ఫంక్షన్ టెస్టు (LFT)

కాలేయం పనితీరును తెలుసుకోవడానికి ఈ టెస్టు చేస్తారు. అల్బుమిన్ వంటి ప్రోటీన్ల ఉత్పత్తి, బిలిరుబిన్ వంటి వ్యర్థ్యాల విచ్ఛిన్నం పనితీరును దీని ద్వారా తెలుసుకోవచ్చు. రక్తంలో తక్కువ ప్రోటీన్ స్థాయి, ఎక్కువ మొత్తంలో ఎంజైమ్‌లు.. కాలేయం పనితీరు మందగించినట్లు సూచిస్తాయి. ఎల్‌ఎఫ్‌టీ ద్వారా ఈ వివరాలను గుర్తించి, చికిత్స అందించవచ్చు.

RFT

మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేస్తూ, శరీరంలోని వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. రెనల్ ఫంక్షన్ టెస్టు (RFT) ద్వారా మూత్రపిండాలు ఫిల్టర్ చేసిన అల్బుమిన్, యూరియా, క్రియేటినిన్ వంటి పదార్థాల వాల్యూ గుర్తిస్తారు. వీటిలో కనిపించే అసాధారణ మార్పులు మూత్రపిండాల వడపోత సామర్థ్యాన్ని సూచిస్తాయి. కిడ్నీ వ్యాధులు, వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, మందుల వాడకం వల్ల కూడా RFTలో అసాధారణ మార్పులు కనిపించే అవకాశం ఉంది.

యూరిన్ రొటీన్ మైక్రోస్కోపీ లేదా యూరినాలిసిస్

ఇది మూత్ర పరీక్ష. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల వ్యాధులు, మధుమేహం వంటి సమస్యలను గుర్తించి చికిత్స చేయడానికి ఈ టెస్టు ఉపయోగపడుతుంది.

షుగర్ టెస్టు

ఇది రక్తంలో చక్కెర స్థాయిని కొలవడానికి చేసే టెస్టు. మధుమేహాన్ని నిర్ధారించడానికి, దీనికి చికిత్స చేయడానికి ఈ టెస్టు అవసరమవుతుంది. దీంతోపాటు ఒత్తిడి, ఇన్ఫెక్షన్లు, డ్రగ్ (స్టెరాయిడ్) చికిత్సలో కూడా షుగర్ టెస్టు అవసరమవుతుంది.

ప్రో-కాల్సిటోనిన్ టెస్టు (PCT)

బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ సోకిన వారిలో రోగ నిరోధక ప్రతిస్పందన తెలుసుకునేందుకు ఈ టెస్టు చేస్తారు. బ్యాక్టీరియా సోకిన 3-6 గంటల్లో ఇది పెరుగుతుంది. 12-24 గంటల తర్వాత తీవ్ర స్థాయికి పెరుగుతుంది. అనంతరం ఇన్‌ఫెక్షన్ తగ్గిన తరువాత, క్రమంగా తగ్గుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్‌లో ఇది తక్కువగా ఉంటుంది. సెకండరీ బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించడంలో పీసీటీ సహాయపడుతుంది. ఏ రోగికి యాంటీబయాటిక్ మందులు అవసరమో నిర్ణయించడానికి పీసీటీ టెస్టు అవసరమవుతుంది. దీని ద్వారా యాంటీబయాటిక్స్ వినియోగం తగ్గుతుంది.

Published by:Krishna Adithya
First published:

Tags: Covid

ఉత్తమ కథలు