UV-C Technology: యూవీ-సీ టెక్నాలజీతో కరోనా ఖతమ్... ఇదెలా పనిచేస్తుందంటే..

ప్రతీకాత్మక చిత్రం

UV-C రేడియేషన్ కరోనా వైరస్ బయటి ప్రోటీన్ పొరను నాశనం చేయగలదని గత ఏడాది నిర్వహించిన ప్రయోగాల్లో తేలింది. ‘ఫార్-యూవీసీ లైట్’ అనే 222-ఎన్ఎమ్ రేడియేషన్.. గాలి ద్వారా మనుషులకు వ్యాపించే ఆల్ఫా, బీటా వంటి వేరియంట్లను సమర్థవంతంగా చంపేస్తుందని పరిశోధకులు నిరూపించారు.

  • Share this:
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ.. మూడో ఉద్ధృతిపై భయందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి. ప్రమాదకరంగా మారుతున్న కొత్త వేరియంట్లు గాలి ద్వారా సైతం వ్యాపిస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. త్వరలో పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. పార్లమెంటు ఆవరణలో వైరస్ గాలి ద్వారా వ్యాపించకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా అతినీలలోహిత-సీ లేదా యూవీ-సీ క్రిమిసంహారక సాంకేతిక పరిజ్ఞానాన్ని (UV-C Disinfection Technology) పార్లమెంటులో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ టెక్నాలజీని పనితీరు, దుష్ప్రభావాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ UV-C ఎయిర్ డక్ట్ డిస్‌ఇన్‌ఫెక్షన్ సిస్టమ్‌ను CSIR-CSIO (సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్) అభివృద్ధి చేసింది. గదుల్లో ఉండే వెంటిలేటర్లలో సరిపోయేలా దీన్ని రూపొందించారు. ఎక్కువ విశాలంగా ఉన్న గదుల్లో యూవీ-సీ కిరణాల తీవ్రతను పెంచుకునే అవకాశం సైతం ఉందని CSIR-CSIO తెలిపింది. వైరస్‌ను నిర్వీర్యం చేసే వైరసైడ్ మోతాదులను ప్రస్తుత స్థలానికి అనుగుణంగా పెంచుకోవచ్చు. UV-C కాంతి ఏరోసోల్ కణాలను, వాటిని వాహకాలుగా చేసుకునే వైరస్‌ను క్రియారహితంగా చేస్తుంది. ఆడిటోరియంలు, మాల్స్, విద్యాసంస్థలు, ఏసీ బస్సులు, రైల్వేలలో వీటిని ఉపయోగించవచ్చు.

* UV లైటింగ్ అంటే ఏంటి?
అతినీలలోహిత కిరణాలు (UV) అనేవి.. సూర్యుని నుంచి సహజంగా విడుదలయ్యే ఒక రకమైన కాంతి లేదా రేడియేషన్. దీని తరంగదైర్ఘ్యం పరిధి 100-400 nm వరకు ఉంటుంది. మన కంటికి కనిపించే కాంతి 380–700 nm వరకు ఉంటుంది. అతినీల లోహిత కాంతిని UV-A (315-400 nm), UV-B (280-315 nm), UV-C (100-280 nm) వంటి మూడు బ్యాండ్లుగా విభజించారు. సూర్యుడి నుంచి UV-A, UV-B కిరణాలు వాతావరణం ద్వారా ప్రసారమవుతాయి. అయితే UV-C కిరణాలను వాతావరణంలోని ఓజోన్ పొర ఫిల్టర్ చేస్తుంది.

UV-B కిరణాలు మన చర్మం బయటి పొర వరకు మాత్రమే చేరగలవు. ఇవి వడదెబ్బకు కారణమవుతాయి. వీటి ద్వారా చర్మ క్యాన్సర్‌ ప్రమాదం సైతం పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. UV-A కిరణాలు చర్మం లోపలికి, మధ్య పొరల్లోకి చొచ్చుకొని పోగలవు. వీటి వల్ల చర్మ కణాల జీవిత కాలం తగ్గిపోతుంది. కణాల DNAకి సైతం ఈ కాంతి పరోక్షంగా నష్టం కలిగిస్తుంది. UV-C లైటింగ్‌ను మాత్రం మనుషులు కృత్రిమంగా తయారు చేస్తున్నారు. UV-C రేడియేషన్ వల్ల చర్మం కాలిపోయే అవకాశం ఉంది. ఇవి కంటిపై తీవ్రమైన ప్రభావం చూపగలవు.

* UV-C రేడియేషన్ కరోనావైరస్‌ను చంపగలదా?
UV-C రేడియేషన్ తరంగదైర్ఘ్యం 254 nm వరకు ఉంటుంది. ఆసుపత్రులు, ప్రయోగశాలల్లో గాలిలో ఉన్న క్రిములను చంపడానికి ఈ పద్ధతిని కొన్ని దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. కానీ ఈ సాంప్రదాయ జెర్మిసైడల్ ట్రీట్‌మెంట్‌లను ఖాళీ గదులలో చేస్తారు. ఎందుకంటే అవి ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. UV-C రేడియేషన్ కరోనా వైరస్ బయటి ప్రోటీన్ పొరను నాశనం చేయగలదని గత ఏడాది నిర్వహించిన ప్రయోగాల్లో తేలింది. ‘ఫార్-యూవీసీ లైట్’ అనే 222-ఎన్ఎమ్ రేడియేషన్.. గాలి ద్వారా మనుషులకు వ్యాపించే ఆల్ఫా, బీటా వంటి వేరియంట్లను సమర్థవంతంగా చంపేస్తుందని పరిశోధకులు నిరూపించారు. కానీ ఇది SARS-CoV-2 మూల వైరస్‌పై పనిచేయడానికి అవసరమైన తరంగదైర్ఘ్యం, వ్యవధిపై సరైన డేటా అందుబాటులో లేదు.

అయితే 222 nm UV-C వికిరణాన్ని.. 0.1 mW / cm2 వద్ద 30 సెకన్ల పాటు ప్రసారం చేసినప్పుడు.. SARS-CoV-2 వైరల్ కల్చర్ 99.7 శాతం నిర్వీర్యమవుతుందని హిరోషిమా యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. గత ఏడాది నిర్వహించిన ఈ అధ్యయనాన్ని అమెరికన్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్‌లో ప్రచురించారు.

* ఈ రేడియేషన్ మనుషులకు ప్రమాదకరంగా మారుతుందా?
ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు సైతం యూవీ-సీ రేడియేషన్ (222-254 ఎన్ఎమ్) పోర్టబుల్ డిస్‌ఇన్‌ఫెక్షన్ డివైజ్‌ను అభివృద్ధి చేశారు. దీన్ని ప్రాణం లేని వస్తువులను డిస్‌ ఇన్‌ఫెక్ట్ చేయడానికి మాత్రమే రూపొందించినట్లు వారు పేర్కొన్నారు. ఇలాంటి డివైజ్‌లలో ఉపయోగించే UV-C రేడియేషన్ జీవుల చర్మానికి, కళ్లకు హానికరం. అందువల్ల డివైజ్ ఆపరేటర్ UV-C రేడియేషన్ నుంచి రక్షణ కల్పించే కళ్లజోడును ఉపయోగించి, సురక్షితంగా ఉపయోగించాల్సి ఉంటుంది.

అయితే తాజాగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ విడుదల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మాత్రం.. ఈ రేడియేషన్‌ను ఎంత వ్యవధిలో, ఎంత తరంగదైర్ఘ్యంతో వాడతారనే వివరాలు వెల్లడించలేదు. కానీ క్రిములను 99 శాతం కంటే ఎక్కువ సమర్థంగా నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. అయితే UV-B రేడియేషన్‌తో పోలిస్తే.. UV-C ఎన్నో రెట్లు ప్రమాదరకమని యూవీ టెక్నాలజీపై పనిచేస్తున్న పరిశోధకులు చెబుతున్నారు. దీని వాడకం విషయంలో అప్రమత్తంగా లేకపోతే తీవ్రమైన ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు ఫార్-యూవీసీ లైట్ (207–222 ఎన్ఎమ్) ప్రాణులకు ప్రమాదకరం కాదని కొందరు పరిశోధకులు తేల్చారు. దీని పరిధి పరిమితంగా ఉండటం వల్ల.. రేడియేషన్ మనుషుల చర్మం, కళ్ల పొరల్లోకి వెళ్లే అవకాశం లేదంటున్నారు. అయితే మన చర్మ కణాలతో పోలిస్తే.. వైరస్ కణాలు చాలా చిన్నవిగా ఉంటాయి. అందువల్ల ఫార్-యూవీసీతో అవి క్రియారహితంగా మారతాయని విశ్లేషిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: