WHAT IS TWITTER BLUE AND HOW CAN IT BENEFIT THE PLATFORM ITS USERS EXPLAINED HERE JNK
Twitter Blue: ట్విట్టర్ బ్లూ అంటే ఏంటి? ఈ సేవలతో సంస్థ, యూజర్లు ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు?
ట్విట్టర్ బ్లూ అంటే ఏమిటి? ఆ సేవలు ఎలా పొంద వచ్చు?
పెయిడ్ సబ్స్క్రిప్షన్ సేవల్లోకి ‘ట్విట్టర్ బ్లూ’ పేరుతో అడుగుపెడుతోంది ట్విట్టర్. దీని ద్వారా సాధారణ వినియోగదారులతో పోలిస్తే మరెన్నో కొత్త ఫీచర్లను ట్విట్టర్ తమ సబ్స్క్రైబర్లకు అందించనుంది.
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) సబ్స్క్రిప్షన్ సేవలను ప్రారంభిస్తోంది. అమెరికా (America), న్యూజిలాండ్ (New Zealand) యూజర్లకు సబ్స్క్రిప్షన్ సేవలందించే ‘ట్విట్టర్ బ్లూ’ (Twitter Blue) ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ఈ వారం ప్రారంభంలో ప్రకటించింది. ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ ఫీచర్‌తో ఆదాయాన్ని పెంచుకోవాలని సంస్థ భావిస్తోంది. ట్వీట్లను అన్డూ చేయడం, ప్రకటనలు లేకుండా వార్తా కథనాలను చదవడం వంటి అనేక ఫీచర్లను సబ్స్క్రిప్షన్ సర్వీస్ ద్వారా పొందవచ్చని ట్విట్టర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు ట్విట్టర్ బ్లూ అంటే ఏంటి? దీనివల్ల సంస్థకు, యూజర్లకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? వంటి వివరాలు తెలుసుకుందాం.
* ట్విట్టర్ బ్లూ సర్వీస్ అంటే ఏంటి?
పెయిడ్ సబ్స్క్రిప్షన్ సేవల్లోకి ‘ట్విట్టర్ బ్లూ’ పేరుతో అడుగుపెడుతోంది ట్విట్టర్. దీని ద్వారా సాధారణ వినియోగదారులతో పోలిస్తే మరెన్నో కొత్త ఫీచర్లను ట్విట్టర్ తమ సబ్స్క్రైబర్లకు అందించనుంది. క్రియేటర్లు, వినియోగదారుల మధ్య మెరుగైన కమ్యూనికేషన్, సేవలను పెంచడానికి ఈ ఫీచర్‌ను సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది.
కొత్త ఆదాయ వనరులను వెతకడంపై ట్విట్టర్ ఇటీవల దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఈ జనవరిలో రెవెన్యూ (Revue) ప్లాట్‌ఫాంను కొనుగోలు చేసింది. దీని ద్వారా యూజర్లు న్యూస్ లెటర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ సేవల కోసం న్యూస్ లెటర్ రైటర్స్ నుంచి కొంతమేరకు చందా వసూలు చేస్తామని తెలిపింది. మే నెలలో సబ్స్క్రిప్షన్ కంపెనీ అయిన స్క్రోల్‌ను (Scroll) సైతం ట్విట్టర్ కొనుగోలు చేసింది. దీని ద్వారా పబ్లిషర్లకు యాడ్-ఫ్రీ రీడింగ్ సేవలను అందిస్తామని ప్రకటించింది. అనంతరం జూన్‌లో కంపెనీ ట్విట్టర్ బ్లూ సేవలను ప్రకటించింది. ఈ సబ్స్క్రిప్షన్ సేవలతో అదనపు ఫీచర్లు అందిస్తూ యూజర్ల నుంచి కొంత రుసుము వసూలు చేయాలని యోచిస్తోంది.
* సబ్స్క్రిప్షన్ ద్వారా ట్విట్టర్ అందించే కొత్త ఫీచర్లు ఏవి?
సాధారణ యూజర్లతో పోలిస్తే.. ట్విట్టర్ బ్లూ యూజర్లకు కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ప్రకటనలు లేకుండానే ప్రముఖ న్యూస్ ఏజెన్సీల వార్తలను ట్విట్టర్ బ్లూ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఈ సబ్స్క్రిప్షన్ జర్నలిజానికి నేరుగా చందా నిధులు సమకూరుస్తుందని కంపెనీ చెబుతోంది. "పబ్లిషర్లను, ఫ్రీ- ప్రెస్‌ను బలోపేతం చేయడానికి, వారికి మద్దతు ఇవ్వడానికి.. ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ ఫీజు నుంచి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని నేరుగా మా నెట్‌వర్క్‌లోని పబ్లిషర్లకు కేటాయిస్తాం" అని ట్విట్టర్ ప్రాజెక్ట్ మేనేజర్లు సారా బేక్పూర్, స్మితా గుప్తా బ్లాగ్ పోస్ట్ ద్వారా తెలిపారు. పబ్లిషింగ్ పార్ట్నర్లు యూజర్లకు ప్రకటనలు అందించడం ద్వారా సంపాదించిన మొత్తం కంటే 50 శాతం ఎక్కువ సంపాదించేలా తోడ్పాటు ఇవ్వడమే తమ లక్ష్యమని తెలిపారు.
స్క్రోల్ (Scroll) విభాగం అందించే నూజెల్ (Nuzzel) సేవలను మిస్ అయిన వ్యక్తులందరికీ కంపెనీ టాప్- ఆర్టికల్స్‌ను కూడా విడుదల చేస్తోంది. దీంతోపాటు సబ్స్క్రైబర్లు గత 24 గంటల్లో తమ నెట్‌వర్క్‌లో అత్యధికంగా షేర్ చేసిన కథనాలను సులభంగా వీక్షించవచ్చు. తద్వారా వారు తమ కమ్యూనిటీలో ముఖ్యమైన విషయాలు తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబర్లు 10 నిమిషాల వ్యవధి గల వీడియోలను ట్విట్టర్లో అప్లోడ్ చేసుకోవచ్చు. నాన్- సబ్స్క్రైబర్లకు వీడియో వ్యవధి 2 నిమిషాలకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం.
ట్విట్టర్ బ్లూ సబ్స్క్రైబర్లు ఎక్స్‌క్లూజివ్ యాప్ ఐకాన్స్, రంగురంగుల థీమ్స్, బుక్‌మార్క్ ఫోల్డర్లతో కొత్త యూజర్ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. దీంతోపాటు కస్టమ్ నావిగేషన్‌ను కూడా కంపెనీ పరిచయం చేసింది. దీంతోపాటు సబ్స్క్రైబర్లు కొత్త ఫీచర్లకు ముందుగా యాక్సెస్ పొందుతారు.
* అన్-డూ ట్వీట్స్ (Undo Tweets) అంటే ఏంటి?
చాలా మంది ట్విట్టర్ యూజర్లు ఈ ఫీచర్ కోసం ఎదురుచూస్తున్నారు. దీని ద్వారా సబ్స్క్రైబర్లు ట్వీట్లను పంపే ముందు వాటిని ప్రివ్యూ చేసే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబర్లు ట్వీట్‌ను పబ్లిక్‌గా షేర్ చేయడానికి ముందు.. ప్రివ్యూ చేయడానికి లేదా మార్పులు చేయడానికి 60 సెకన్ల పాటు సమయం ఉంటుంది. పోస్టింగ్‌కు ముందు ట్వీట్లను అన్డూ చేయడం ద్వారా వినియోగదారులు తమ పోస్ట్‌లలో అక్షరదోషాలు లేదా ఇతర లోపాలను సవరించుకోవచ్చు. అయితే ట్విట్టర్ ఇప్పటికీ “Edit Tweet” ఫీచర్‌ను పరిచయం చేయలేదు. సబ్స్క్రైబర్లు రీడర్‌కు యాక్సెస్ పొందే అవకాశం కూడా ఉంటుంది. దీని ద్వారా లాంగ్- థ్రెడ్స్‌ను సులభంగా చదువుకోవచ్చు. దీంతోపాటు యూజర్లు తమ రీడర్‌లోని టెక్స్ట్ సైజ్‌ను కూడా మార్చుకోవచ్చు.
* ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధర ఎంత?
ట్విట్టర్ బ్లూ సేవలు ఇప్పటికే అమెరికా, న్యూజిలాండ్‌లో అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలో ఈ సేవల కోసం.. iOS, ఆండ్రాయిడ్, వెబ్ యూజర్లు నెలకు 2.99 డాలర్లు (సుమారు రూ. 222) చెల్లించాల్సి ఉంటుంది. ఈ సేవలను దశల వారీగా ఇతర దేశాలకు విస్తరించే అవకాశం ఉంది. అయితే ట్విట్టర్ బ్లూ సేవలు మన దేశంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే విషయంపై సంస్థ అధికారిక ప్రకటన చేయలేదు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.