Home /News /explained /

పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటి? చట్ట సభల్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్‌కు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుంది?

పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటి? చట్ట సభల్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్‌కు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేది నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన అంశం. పార్లమెంటు ప్రొసీడింగ్స్‌లో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు భావిస్తే, సభలో ఉన్న సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తవచ్చు.

ప్రజాస్వామ్యంలో పార్లమెంటును ఒక దేవాలయంగా భావిస్తారు. వివిధ వ్యవస్థలకు సంబంధించిన చట్టాలు పార్లమెంటులోనే ఆమోదం పొందుతాయి. ఇందుకు నిర్దిష్టమైన ప్రక్రియ ఉంటుంది. సాధారణంగా లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతిని కలిపి పార్లమెంట్ అంటారు. అయితే లోక్‌సభ, రాజ్యసభలో ఉండే నిబంధనలు, సభల్లో వాడే టర్మినాలజీని సామాన్య ప్రజలు అర్థం చేసుకోలేరు. ఈ నేపథ్యంలో News18 వార్తాసంస్థ ‘హౌస్ టాక్’ సిరీస్‌లో భాగంగా పార్లమెంటు ప్రొసీడింగ్స్‌ నియమ నిబంధనలు, చట్ట సభల్లో వాడే టర్మినాలజీని అందిస్తోంది.

పార్లమెంటు ఉభయ సభలు సజావుగా జరగాలనే లక్ష్యంతో రూపొందించిన నిబంధనలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ నియమాలు మన అందరికీ అర్థం కాకపోవచ్చు. ముఖ్యంగా ప్రతిపక్షం, ప్రభుత్వం కొన్ని వివాదాస్పద సమస్యలపై చర్చిస్తున్నప్పుడు.. పార్లమెంటు సాధారణ పనితీరు దెబ్బతింటుంది. దీంతో సభ్యులు విధివిధానాలను సక్రమంగా పాటించాలనే చర్చ వచ్చినప్పుడు మనకు ఎక్కువగా వినిపించే పదం పాయింట్ ఆఫ్ ఆర్డర్ (point of order). దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

* పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటి?
పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేది నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన అంశం. పార్లమెంటు ప్రొసీడింగ్స్‌లో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు భావిస్తే, సభలో ఉన్న సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తవచ్చు. లోక్‌సభ సెక్రటేరియట్ పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను ఒక అసాధారణ ప్రక్రియగా అభివర్ణిస్తుంది. దీన్ని లేవనెత్తినప్పుడు సభ కార్యకలాపాలకు అంతరాయం కలగవచ్చు. పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తడం అంటే.. సభ వ్యవహారాలను నియంత్రించడానికి, రాజ్యాంగంలోని నియమాలు, ఆదేశాలు, నిబంధనలను అమలు చేయడంలో స్పీకర్‌కు సహాయం చేయడం.

పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను ఒక ఉదాహరణతో చూద్దాం. 2021 పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ సందర్భంగా చోటుచేసుకున్న నిరసనల మధ్య తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు శేఖర్ రే పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105(1)ను ఆయన ఉదహరించారు. ఈ ఆర్టికల్ చట్ట సభల్లో సభ్యుల వాక్ స్వాతంత్య్రానికి సంబంధించినది. చట్ట సభల్లో ప్రతిపక్ష సభ్యులకు వాక్ స్వాతంత్రం ఉంటుందని, దాన్ని సభలో ఉల్లంఘిస్తున్నారని ఆయన వాదించారు.

* పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను ఎప్పుడు లేవనెత్తుతారు?
సభ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు లేదా సభకు చెందిన ఏదైనా లిఖిత పూర్వక లేదా అలిఖిత చట్టాన్ని అతిక్రమించినప్పుడు సభ్యులు పాయింట్ ఆప్‌ ఆర్డర్‌ను లేవనెత్తుతారు. ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద అనేక రకాల సమస్యలను ఎత్తిచూపవచ్చు. పాయింట్ ఆఫ్ ఆర్డర్‌కు ముందస్తు నోటీసు అవసరం లేదు. సభలో ప్రస్తుతం జరుగుతున్న చర్చలకు సంబంధించిన ఏదైనా విషయంపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తవచ్చు. అయితే సమంజకం కాని పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను రాజ్యసభ సెక్రటేరియట్ నిర్మొహమాటంగా తిరస్కరించవచ్చు. తరచుగా పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తే సభ్యుడిని ఛైర్మన్ మందలించవచ్చు.

* ఎలా లేవనెత్తవచ్చు?
పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ని లేవనెత్తడానికి, ఎవరైనా సభ్యులు సభలో లేచి నిల్చొని ‘పాయింట్ ఆఫ్ ఆర్డర్’ అని చెప్పాలి. ఆ తర్వాత వారిని ప్రిసైడింగ్ అధికారి ముందుగా గుర్తించాలి. ప్రిసైడింగ్ అధికారి గుర్తించిన తర్వాత మాత్రమే సభ్యులు తమ ఆందోళనను వివరించాలి. వారు పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను రూపొందించేటప్పుడు, సభ్యులు విస్మరించిన లేదా నిర్లక్ష్యం చేసిన లేదా ఉల్లంఘించిన సభా విధానానికి సంబంధించిన నిర్దిష్ట నియమం లేదా రాజ్యాంగంలోని నిబంధనను కోట్ చేయాలని లోక్‌సభ సెక్రటేరియట్ పేర్కొంది.

అయితే ప్రశ్నోత్తరాల సమయంలో లేదా సభ ఏదైనా తీర్మానాన్ని చర్చకు స్వీకరించినప్పుడు సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ లేవనెత్తలేరు. ఒక సభ్యుడు సమాచారాన్ని అడగడం లేదా వారి పొజిషన్ గురించి వివరించడం వంటి అవసరాల కోసం పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను ఉపయోగించకూడదు. ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ తప్పనిసరిగా ప్రొసీజర్‌ ప్రకారం ఉండాలి. అంతేగాని ఏదైనా తీర్మానంపై వాదనలా ఉండకూడదు.

గతంలో ముగిసిన సభా వ్యవహారాలపై ప్రస్తుతం సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తలేరు. ఉదాహరణకు.. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై కేసుల గురించి ఆయన ప్రస్తావించారు. అయితే నాలుగు రోజుల తరువాత ఈ అంశంపై వైఎస్‌ఆర్‌ సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ లేవనెత్తారు. దీన్ని చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు. సభలో ప్రస్తుత అంశాలపై మాత్రమే పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ లేవనెత్తే అవకాశం ఉంటుందని, సభ్యుల గత ప్రసంగాలపై అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.

* పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినప్పుడు ఏం జరుగుతుంది?
ఒక సభ్యుడు పాయింట్‌ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన వెంటనే, ఆ సమయంలో మాట్లాడుతున్న సభ్యులు వారిని అనుమతించాలి. అంటే దీనివల్ల సభలో జరుగుతున్న కార్యకలాపాలు నిలిపివేసే అవకాశం ఉంటుంది.

Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి

మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..

సభ్యుని మాట విన్న తర్వాత, వారు లేవనెత్తిన అంశం పాయింట్ ఆఫ్ ఆర్డర్ అవుతుందా లేదా అనేది సభలోని ప్రిసైడింగ్ అధికారి నిర్ణయిస్తారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై ఎటువంటి చర్చకు అనుమతించరు. కానీ ప్రిసైడింగ్ అధికారి తమ నిర్ణయాన్ని ప్రకటించే ముందు సభ్యుల వాదనలు వినవచ్చు. లోక్‌సభ నిబంధనలలోని రూల్ 376, రాజ్యసభలో రూల్ 258 పాయింట్ ఆఫ్ ఆర్డర్‌కు సంబంధించిన విధివిధానాలను సూచిస్తున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Parliament

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు