డయాబెటిస్‌లో రెండు రకాలు ఉన్నాయి. అవే టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. ఈరోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య టైప్ 2 డయాబెటిస్. సాధారణంగా మధుమేహం బారిన పడితే, జీవితాంతం దాన్ని అదుపులో పెట్టుకోవాల్సిందే. దీని తీవ్రతను బట్టి వైద్యులు మందులు సూచిస్తారు. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. అందువల్ల మధుమేహం వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడానికి బదులుగా, దీని బారిన పడకుండా ముందునుంచే జాగ్రత్తపడాలి. ముఖ్యంగా వంశపారం పర్యంగా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మధుమేహం ఉంటే.. మరింత అప్రమత్తంగా ఉంటూ జీవనశైలి మార్పులు చేసుకోవాలి.
డయాబెటిస్ రాకుండా ఎలా కాపాడుకోవాలి (Prevention of Diabetes)?
డయాబెటిస్ బారిన పడకూడదంటే.. హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మంచి అలవాట్లతో జీవనశైలిని పాటించాలి. మధుమేహాన్ని నివారించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇలాంటి చిన్న మార్పులు కూడా చాలా పెద్ద ప్రభావం చూపుతాయి. మధుమేహాన్ని నివారించే పద్ధతులు ఏవో తెలుసుకోండి.
చక్కెర పానీయాలకు నో చెప్పండి
తీపిగా ఉండే మిఠాయిలు, చక్కెర పానీయాల్లో (sugary drinks) గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. రోజూ ఆర్టిఫిషియల్ షుగర్ డ్రింక్స్ లేదా కూల్ డ్రింక్స్ తాగే వ్యక్తులకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 80% ఎక్కువగా ఉందని ఒక పరిశోధన కనుగొంది. ఇలాంటి డ్రింక్స్‌కు ప్రత్యామ్నాయంగా తాజా పండ్ల రసం, టీ, కాఫీ లేదా నిమ్మరసం, కొబ్బరి నీరు వంటివి తీసుకోవచ్చు.
ఆరోగ్యకరమైన బరువు
వెయిట్ మేనేజ్‌మెంట్‌పై ప్రతి ఒక్కరూ శ్రద్ధపెట్టాలి. ఎందుకంటే అధిక బరువు మధుమేహానికి కారణం కావచ్చు. అదనపు బరువును తగ్గించే ప్రతి ప్రయత్నం.. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బాడీ వెయిట్‌లో 7% వరకు తగ్గడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం 60% వరకు తగ్గుతుందని ఒక పరిశోధన తేల్చింది.
ఆహారంలో ఫైబర్ చేర్చుకోండి
బఠానీలు, బ్రకోలీ, పప్పు ధానాలు, వోట్స్, నట్స్, బీన్స్ వంటి ఆహారాలలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా మరికొన్ని విషయాల్లో తోడ్పాటును అందిస్తుంది. అవేంటంటే..
బ్లడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
ఆహారంలో తృణధాన్యాలు ఉండాలి
ధాన్యాలు (Grains) రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. రోజువారీ ఆహారంలో పాస్తా, బ్రెడ్, తృణధాన్యాలు వంటి హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఏదైనా ఫుడ్ ఐటెమ్ ప్యాకేజీపై ‘హోల్ గ్రెయిన్’ కంటెంట్ వాడినట్లు పేర్కొంటే.. వాటిని తినవచ్చు. అయితే ప్రాసెస్డ్ ఫుడ్‌కు మాత్రం దూరంగా ఉండటం మంచిది.
వ్యాయామం
మీ బరువు నియంత్రణలో ఉన్నంత మాత్రాన పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పలేం. ఎందుకంటే వెయిట్ మేనేజ్‌మెంట్‌కు తోడు శారీరక శ్రమ ఉంటేనే జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. అయితే శారీరకంగా చురుకుగా ఉండటం అంటే జిమ్‌లలో కొన్ని గంటలు కష్టపడాల్సిన అవసరం లేదు. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ వంటివి కూడా చేయవచ్చు. ఇవి బద్ధకాన్ని దూరంచేసి శరీరక, మానసిక చురుకుదనాన్ని పెంచుతాయి.
నాణ్యమైన నిద్ర
మధుమేహాన్ని నివారించడంలో నిద్ర కీలకపాత్ర పోషిస్తుంది. ఆహారం, శారీరక శ్రమ, ఇతర జీవనశైలి మార్పులు పాటించినా.. నిద్ర సరిగా లేకపోతే ప్రయోజనం ఉండదు. నిద్ర నాణ్యత తగ్గితే, ఆ ప్రభావం ఆహారం, బరువుపై పడుతుంది. నిద్ర తక్కువ అయినప్పుడు, శక్తి కోసం ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు. ఇది బరువు పెరగడానికి కారణం కావచ్చు. కాబట్టి ప్రతిఒక్కరూ స్లీప్ సైకిల్‌పై దృష్టిపెట్టాలి. కనీసం 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. నిద్రవేళలు రోజూ ఒకేలా ఉండటం మంచిది.
ఆల్కహాల్, స్మోకింగ్‌కు నో చెప్పండి
ఆల్కహాలిక్ డ్రింక్స్ రోజూ తాగడం వల్ల బాడీలో ట్రైగ్లిజరైడ్ లెవల్స్ పెరిగి బరువు పెరగవచ్చు. అందుకే ఆల్కహాల్ తక్కువగా తీసుకోవాలి. వీలైతే డ్రింకింగ్ పూర్తిగా మానేయడం మంచిది. స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం అనేది తెలిసిందే. అయితే పొగతాడగానికి, టైప్ 2 డయాబెటిస్‌కు డైరెక్ట్ లింక్ ఉందని అనేక అధ్యయనాలు తేల్చాయి. పొగతాగే వారికి మధుమేహం వచ్చే అవకాశాలు 40% పైగా పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది.
విటమిన్ D ఉండే పదార్థాలు తీసుకోవాలి
విటమిన్ D లోపం ఉన్నవారికి, దీన్ని భర్తీ చేసే ఆహారం లేదా సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు.. వారి శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు మెరుగ్గా పనిచేయడం ప్రారంభిస్తాయి. తద్వారా వారి రక్తంలో చక్కెర స్థాయి అదుపులోకి వస్తుంది. అందుకే విటమిన్ D అధికంగా ఉండే ఫ్యాటీ ఫిష్, పాల ఉత్పత్తులు, ఆరెంజ్ జ్యూస్, సోయా పాలు, తృణధాన్యాలు, గుడ్డు సొన వంటివి క్రమం తప్పకుండా తినాలి.
లో- కార్బ్ లేదా కీటో డైట్ ఎంచుకోండి
తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారాలు, కీటో డైట్‌ల ప్రయోజనాలను శాస్త్రీయంగా నిర్ధారించారు. డయాబెటిస్‌ను నివారించే విషయానికి వస్తే.. రోగులు తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాలు తినాలని చాలా మంది వైద్యులు ప్రోత్సహిస్తారు. ఎందుకంటే ఇవి వ్యక్తుల ఇన్సులిన్, రక్తంలో చక్కెర స్థాయిలను, ఇతర మధుమేహ ప్రమాద కారకాలను కూడా తగ్గిస్తాయి.
పసుపు వినియోగం పెంచండి
పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించగలదని అధ్యయనాల్లో తెలిసింది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించడంతో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతోపాటు మధుమేహ సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది.
ఫ్యాడ్ డైట్స్ (Fad Diets) వద్దు
తక్కువ సమయంలో బరువు తగ్గేందుకు సూచించే ఆహారాలను ఫ్యాడ్ డైట్స్ అంటారు. వీటిలో ఎలాంటి పోషకాలు ఉండవు. ఇవి అనారోగ్యకరమైనవి. దీర్ఘకాలంలో శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఈ ఆహారంలో పూర్తి స్థాయిలో పోషకాలు లేకపోవడం వల్ల.. రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవుతాయి. ఫలితంగా డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది. అందుకే బరువు తగ్గాలని చూసేవారు ఇలాంటి ఆహారాలు మానుకోవాలి. వీటికి బదులుగా ఆకుకూరలు ఎక్కువగా తినడం, జంక్ ఫుడ్‌కు నో చెప్పడం, వ్యాయామం చేయడం వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diabetes, Health Tips