Transaction Limit | బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ అకౌంట్‌కు క్యాష్ విత్‌డ్రాయల్ (Cash Withdrawal Limit), క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్ (Cash Transaction Limit) ఉంటాయి. వాటి గురించి కస్టమర్లు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.
సేవింగ్స్ అకౌంట్లను పొదుపు ప్రయోజనం కోసం రూపొందించారు. అందువల్ల పాన్ కార్డు (PAN Card) వివరాలు అందించి ఈ అకౌంట్లో ఎంతమొత్తమైనా డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ నగదు తీసుకోవడానికి (Cash Withdrawal) సంబంధించి బ్యాంకులకు నిర్దిష్ట పరిమితులు ఉన్నాయి. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ (ఏటీఎం, చెక్ వంటివి) సాయంతో నిర్దిష్ట మొత్తంలోనే క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. క్యాష్ విత్‌డ్రా లిమిట్ అనేది వివిధ రకాల అకౌంట్లకు, వివిధ రకాల క్యాష్ విత్‌డ్రా ఇన్స్ట్రుమెంట్లకు భిన్నంగా ఉంటుంది. ఇది బ్యాంకులను బట్టి కూడా మారుతూ ఉంటుంది.
గత కొన్నేళ్లుగా దేశంలో ఆర్థిక అక్రమాలు, నల్లధనం, పన్ను ఎగవేతలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా క్యాష్ విత్‌డ్రా లిమిట్, క్యాష్ ట్రాన్సాక్షన్ (నగదు లావాదేవీలు) లిమిట్లను ప్రభుత్వం అమలు చేస్తోంది. రోజువారీ, నెలవారీ క్యాష్ విత్‌డ్రా, క్యాష్ ట్రాన్సాక్షన్లకు ప్రభుత్వం కొన్ని పరిమితులను విధించింది. ATMల ద్వారా నగదు ఉపసంహరణకు, బ్యాంకు శాఖల నుంచి క్యాష్ విత్‌డ్రాకు వేర్వేరు పరిమితులు ఉన్నాయి.
కొన్ని బ్యాంకుల ఖాతాదారులు సొంతంగా క్యాష్ విత్‌డ్రా చేయాలనుకుంటే.. బేస్ బ్రాంచ్ నుంచి ఎంత మొత్తంలోనైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. అదే చెక్కుతో కాకుండా విత్‌డ్రా స్లిప్‌తో థర్డ్ పార్టీకి చేసే చెల్లింపులను రూ.5000కే పరిమితం చేశాయి. నాన్ హోమ్ బేస్ బ్రాంచ్‌లో చెక్‌తో మాత్రమే నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకు గరిష్ట పరిమితి రూ.50,000 వరకు మాత్రమే ఉంది. అయితే హోమ్ బ్రాంచ్‌లో మీ ఖాతాకు ఎంత మొత్తాన్ని అయినా డిపాజిట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బ్యాంకుల్లో క్యాష్ ట్రాన్సాక్షన్లపై మాత్రమే పరిమితి ఉంటుంది. క్యాష్ ట్రాన్స్‌ఫర్స్‌పై ఎలాంటి పరిమితి లేదు.
పోస్టల్ డిపార్ట్మెంట్ కింద ఉన్న వివిధ పోస్టాఫీసులు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లను నిర్వహిస్తున్నాయి. ATMలు జారీ చేస్తూ ఈ సేవింగ్స్ అకౌంట్ల నుంచి క్యాష్ విత్‌డ్రాలను సులభతరం చేస్తున్నాయి. పోస్టాఫీసు లేదా పోస్టల్ ATM నుంచి ఒక రోజులో విత్‌డ్రా చేయగల క్యాష్ లిమిట్ రూ.25,000గా ఉండగా.. ప్రతి ట్రాన్సాక్షన్ పరిమితి రూ.10,000గానే ఉంది.
ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలతో (బ్యాలెన్స్ ఎంక్వైరీ, స్టేట్మెంట్ అభ్యర్థన) సహా నెలకు ఐదు ఉచిత లావాదేవీలను పోస్ట్ ఆఫీస్ అందిస్తోంది. ఉచిత లావాదేవీలకు మించి క్యాష్ విత్‌డ్రా చేస్తే.. జీఎస్టీతో కలిపి రూ.20 వసూలు చేస్తారు. ఇతర బ్యాంక్ ATMల నుంచి కూడా పోస్టల్ అకౌంట్ హోల్డర్లు క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. మెట్రో నగరాల్లో 3 ఉచిత లావాదేవీలు, మెట్రోయేతర నగరాల్లో ఐదు ఉచిత లావాదేవీలను వినియోగించుకోవచ్చు. ఉచిత లావాదేవీల కంటే ఎక్కువ లావాదేవీలకు GSTతో కలిపి రూ.20 రుసుము వర్తిస్తుంది.
సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని చెక్‌బుక్/విత్‌డ్రా స్లిప్ ఉపయోగించి లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. క్యాష్ విత్‌డ్రా లిమిట్ అనేది ఒక్కో బ్యాంకులో ఒక్కోలా ఉంటుంది. ఖాతాదారులు ఉపయోగిస్తున్న కార్డు ఆధారంగా కూడా క్యాష్ విత్‌డ్రా లిమిట్ మారవచ్చు. బ్యాంకుల ఆధారంగా క్యాష్ విత్‌డ్రా లిమిట్ రోజుకు 10,000 నుంచి 50,000 వరకు ఉంటుంది.
క్యాష్ ట్రాన్సాక్షన్లు (నగదు లావాదేవీలు)
ఆర్థిక వ్యవస్థలో క్యాష్ ట్రాన్సాక్షన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే అక్రమ లావాదేవీలకు, నల్లధనం పేరుకుపోవడానికి కూడా ఈ క్యాష్ ట్రాన్సాక్షన్లే ప్రధాన కారణం. అందువల్ల నగదు లావాదేవీలను అరికట్టడానికి, డిజిటల్ చెల్లింపులను పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ మొత్తంలో నగదుతో లావాదేవీలు నిర్వహిస్తే.. ఆదాయపు పన్ను చట్టం కింద జరిమానా వర్తిస్తుంది.
నగదు లావాదేవీ పరిమితి - సెక్షన్ 269ST
ఫైనాన్స్ యాక్ట్- 2017 ప్రకారం నల్లధనాన్ని అరికట్టడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఈ చర్యల ఫలితంగా ఆదాయపు పన్ను చట్టంలో కొత్తగా సెక్షన్ 269STను చేర్చారు. సెక్షన్ 269ST క్యాష్ ట్రాన్సాక్షన్స్‌పై పరిమితి విధించింది. రోజువారీ నగదు లావాదేవీలను రూ.2 లక్షలకు పరిమితం చేసింది. సెక్షన్ 269ST ప్రకారం.. ఏ వ్యక్తి అయినా రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఒక రోజులో ఒక వ్యక్తి నుంచి తీసుకోకూడదు. అయితే బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి విత్‌డ్రాలకు ఈ నగదు ఉపసంహరణ పరిమితి వర్తించదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) స్పష్టం చేసింది.
బ్యాంకులు నివేదించిన క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్స్
ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో.. ఒక నెలలో 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో జరిగే నగదు లావాదేవీలను సంబంధిత బ్యాంకు ఆర్థిక నిఘా విభాగానికి నివేదిస్తుంది. అసాధారణ లావాదేవీలను బ్యాంకు రిపోర్ట్ చేయవచ్చు. అందువల్ల భారీ మొత్తంలో చేసే నగదు లావాదేవీలన్నింటినీ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా చేయడం మంచిది. ఇది మీ లావాదేవీని ట్రాక్ చేయడంలో సహాయం చేస్తుంది. దీంతోపాటు ఆదాయపు పన్ను వివరణలకు దూరంగా ఉంచుతుంది.
వివిధ బ్యాంకుల క్యాష్ విత్‌డ్రా లిమిట్, క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
ఆర్బీఎల్ బ్యాంకులో క్యాష్ విత్‌డ్రా లిమిట్ రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఉంది. ఈ బ్యాంకులో క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.10 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఉంది. యస్ బ్యాంకులో క్యాష్ విత్‌డ్రా లిమిట్ రూ.25,000 నుంచి రూ.1లక్ష వరకు ఉంది. ఈ బ్యాంకులో క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉంది. కొటక్ మహీంద్రా బ్యాంకులో క్యాష్ విత్‌డ్రా లిమిట్ రూ.40వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంది. ఈ బ్యాంకులో క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.50 వేల నుంచి రూ.4.5 లక్షల వరకు ఉంది.
లక్ష్మీ విలాస్ బ్యాంకులో క్యాష్ విత్‌డ్రా లిమిట్ రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంది. ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో క్యాష్ విత్‌డ్రా లిమిట్ రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉంది. ఈ బ్యాంకులో క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.50వేల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో క్యాష్ విత్‌డ్రా లిమిట్ రూ.25వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంది. ఈ బ్యాంకులో క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.2.75 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు ఉంది. యాక్సిస్ బ్యాంక్‌లో క్యాష్ విత్‌డ్రా లిమిట్ రూ.40వేల నుంచి రూ.3 లక్షల వరకు ఉంది. ఈ బ్యాంకులో క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.1లక్ష నుంచి రూ.6 లక్షలుగా ఉంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.