WHAT IS RERA ACT HOW IT WILL BENEFIT CONSUMERS EXPLAINED BA
RERA చట్టం అంటే ఏంటి? ప్రాపర్టీ కొనుగోలుదారులకు ఇది ఏ రకంగా లాభదాయకం?
ప్రతీకాత్మక చిత్రం
RERA Rules and Benefits | రెరా ఆదేశాలను పాటించడంలో ప్రమోటర్ విఫలమైతే, ఇందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఆస్తి మూల్యాంకన వ్యయం(evaluated cost)లో 5% వరకు ఉండవచ్చు.
RERA అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) యాక్ట్- 2016 దీన్ని నిర్వచించింది. ఇది ఇంటి కొనుగోలుదారులకు భద్రత కల్పించడంతో పాటు రియల్ ఎస్టేట్ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తుంది. ఈ చట్టానికి సంబంధించిన బిల్లును 2016, మార్చి 10న రాజ్యసభ (Rajya Sabha) ఆమోదించింది. RERA చట్టం 2016, మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో 92 సెక్షన్లలో 52 మాత్రమే నోటిఫై చేశారు. అనంతరం 2017, మే 1 నుంచి అన్ని ఇతర నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
RERA చట్టం నియమాలు (RERA Act Rules)
రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం- 2016లోని సెక్షన్ 84 ప్రకారం.. చట్టం అమల్లోకి వచ్చిన ప్రారంభ తేదీ నుంచి ఆరు నెలల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టానికి సంబంధించిన నియమ, నిబంధనలను విడుదల చేయాలి. ఈ చట్టం ప్రకారం.. కేంద్ర చట్టం రూపొందించిన మోడల్ నిబంధనల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు సొంత నిబంధనలను తెలియజేయాలి. 2016 అక్టోబర్ 31న కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ ద్వారా, రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం, 2016 సాధారణ నియమాలను (general rules) విడుదల చేసింది. ఈ నిబంధనలన్నీ చండీగఢ్, లక్షద్వీప్, డామన్ & డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ, అండమాన్ & నికోబార్ దీవుల వంటి కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వర్తిస్తాయి.
రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ (RERA) చట్టానికి సంబంధించిన కీలక పాయింట్లు
భద్రత: రెరా చట్టం ప్రకారం.. కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల డబ్బులో కనీసం 70 శాతాన్ని ప్రత్యేక అకౌంట్లో ఉంచుతారు. నిర్మాణం, భూమి సంబంధిత ఖర్చులకు మాత్రమే ఈ డబ్బును బిల్డర్లకు కేటాయిస్తారు. సేల్ అగ్రిమెంట్‌పై సంతకం చేసే ముందు.. డెవలపర్లు, బిల్డర్లు ఆస్తి ఖర్చులో 10% కంటే ఎక్కువ మొత్తాన్ని అడ్వాన్స్ పేమెంట్‌గా అడిగే అవకాశం లేదు.
పారదర్శకత: బిల్డర్లు తాము చేపట్టే అన్ని ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను సమర్పించాలి. కొనుగోలుదారుల అనుమతి లేకుండా బిల్డర్లు ప్లాన్లలో ఎలాంటి మార్పులు చేయకూడదు.
న్యాయబద్ధత : RERA నిబంధనల ప్రకారం డెవలపర్లు సూపర్ బిల్ట్ అప్ ఏరియాపై కాకుండా కార్పెట్ ఏరియా ఆధారంగానే ప్రాపర్టీలను అమ్మాలి. ఒకవేళ ప్రాజెక్ట్ ఆలస్యమైతే, కొనుగోలుదారులు పెట్టుబడి పెట్టిన మొత్తం డబ్బును తిరిగి పొందేందుకు అర్హులు. లేదంటే వారు పెట్టుబడి పెట్టే ఆప్షన్‌ను ఎంచుకుని, తమ డబ్బుపై నెలవారీ పెట్టుబడి ఫలాలు పొందవచ్చు.
నాణ్యత: కొనుగోలుదారులు ఎదుర్కొన్న ఏదైనా సమస్యను, ప్రాపర్టీ కొనుగోలు చేసిన 5 సంవత్సరాలలోపు బిల్డర్ తప్పకుండా సరిదిద్దాలి. దీనిపై ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలనే నిబంధన ఉంది.
ఆథరైజేషన్: రిజిస్ట్రేషన్ చేయకుండా రెగ్యులేటర్ ప్లాట్‌ను అడ్వర్టైజ్ చేయడం, అమ్మడం, నిర్మించడం, పెట్టుబడి పెట్టడం లేదా బుక్ చేయడం కుదరదు. రిజిస్ట్రేషన్ తర్వాత పెట్టుబడులకు సంబంధించిన అన్ని ప్రకటనల్లో రెరా అందించిన ప్రత్యేక ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండాలి.
చట్టం లక్షణాలు
గృహ లావాదేవీలు, రియల్ ఎస్టేట్‌కు సంబంధించి జవాబుదారీతనం, పారదర్శకతను పెంపొందించడానికి RERA చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఈ చట్టం ముఖ్య లక్షణాలు కొన్ని ఉన్నాయి..
సంబంధిత రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఏవైనా వివాదాలను పర్యవేక్షించడం, తీర్పు ఇవ్వడం, మధ్యవర్తిత్వం చేయడం కోసం ప్రతి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలి.
వివాదాల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ మెకానిజం ఏర్పాటు చేయాలి. అప్పిలేట్ ట్రిబ్యునల్, న్యాయ విభాగం అధికారులు ఇందులో భాగస్వాములుగా ఉంటారు.
అన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లు తప్పనిసరిగా RERA కింద నమోదు కావాలి. తద్వారా ప్రాజెక్ట్‌లపై అధికార పరిధిని అథారిటీ కలిగి ఉంటుంది. మార్గదర్శకాలకు కట్టుబడి ఉండకపోతే నిర్దిష్ట ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్‌ను అథారిటీ తిరస్కరిస్తుంది.
ఒకవేళ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో మీ హక్కులు, బాధ్యతలలో ఎక్కువ భాగాన్ని ప్రమోటర్ థర్డ్ పార్టీకి ట్రాన్స్ఫర్ చేయాలని లేదా కేటాయించాలని కోరుకుంటే.. RERA రాతపూర్వక ఆమోదంతో పాటు కేటాయింపుదారులలో (allottees) మూడింట రెండు వంతుల మంది నుంచి రాతపూర్వక సమ్మతి అవసరం.
కొనుగోలుదారులు లేదా ప్రమోటర్ వైపు నుంచి ఏదైనా డిఫాల్ట్ ఉంటే, ఇద్దరూ సమాన వడ్డీ రేటును చెల్లించాల్సి ఉంటుంది.
నిర్మాణంలో ఉన్న లేదా నిర్మించిన ఆస్తిపై ఇతర వ్యక్తులు క్లెయిమ్ చేయడం (భూమి ల్యాండ్ టైటిల్) కారణంగా ప్రమోటర్ కొనుగోలుదారులకు ఏదైనా నష్టాన్ని కలిగిస్తే.. సంబంధిత ప్రమోటర్ కొనుగోలుదారులకు పరిహారం చెల్లించాలి.
ఈ చట్టంలోని నిబంధనలు లేదా నియమాలను ప్రమోటర్, కొనుగోలుదారులు లేదా ఏజెంట్ ఉల్లంఘిస్తే, RERAకి ఫిర్యాదు చేయవచ్చు.
ఇలాంటి అంశాలపై విచారణ జరుగుతున్నప్పుడు.. ఒక ఏజెంట్, ప్రమోటర్ లేదా కొనుగోలుదారులు ఫిర్యాదు చేసిన ఏదైనా యాక్టివిటీ కొనసాగించకుండా ఆపగలిగే హక్కు RERAకు ఉంది.
ఫిర్యాదుకు సంబంధించి RERA వెల్లడించిన నిర్ణయాలు సంతృప్తికరంగా లేకుంటే, బాధితులు అప్పీలేట్ ట్రిబ్యునల్ ముందు అప్పీల్ చేసుకోవచ్చు.
రెరా ఆదేశాలను పాటించడంలో ప్రమోటర్ విఫలమైతే, ఇందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఆస్తి మూల్యాంకన వ్యయం(evaluated cost)లో 5% వరకు ఉండవచ్చు.
అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా (ప్రాజెక్ట్ కాస్ట్లో 10% వరకు) లేదా రెండు శిక్షలు విధించవచ్చు.
ఏదైనా ఒక కంపెనీ నేరానికి పాల్పడితే, ఈ చట్టం ప్రకారం నేరం జరిగినప్పుడు వ్యాపారానికి బాధ్యత వహించిన వ్యక్తి, కంపెనీని దోషిగా నిర్ధారించి శిక్ష విధిస్తారు.
రెరా లేదా అప్పిలేట్ ట్రిబ్యునల్ పరిధిలోకి వచ్చే ఏదైనా విషయంపై సివిల్ కోర్టులకు ఎటువంటి అధికార పరిధి ఉండదు. అందువల్ల రెరా లేదా ట్రిబ్యునల్ తీసుకున్న ఏదైనా నిర్ణయంపై ఏ న్యాయస్థానం నిషేధం విధించే అవకాశం లేదు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.