Explainer: QUAD.. నాలుగు దిగ్గజ దేశాల భేటీ.. అసలు ఏంటిది? ఎప్పుడు మొదలైందో తెలుసుకోండి

నాలుగు దేశాల అధినేతలు

క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్.. క్వాడ్ గా పిలిచే ఈ స్ట్రాటజిక్ ఫోరం మరోసారి భేటీ కానుంది. చైనా పై ప్రపంచమంతా గుర్రుగా ఉన్న ఈ సమయంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

  • Share this:
క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్.. క్వాడ్ గా పిలిచే ఈ స్ట్రాటజిక్ ఫోరం మరోసారి భేటీ కానుంది. చైనా పై ప్రపంచమంతా గుర్రుగా ఉన్న ఈ సమయంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్వాడ్ లో అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా నాలుగు దేశాలు సభ్యులుగా ఉన్నాయి. రెగ్యులర్ గా సమావేశాలు నిర్వహిస్తూ సమాచారాన్ని పంచుకుంటూ మిలిటరీని బలోపేతం చేసుకుంటూ సాగుతున్నాయి ఈ సభ్య దేశాలు. మరో రెండు రోజుల్లో ఈ భేటీ కానున్న సందర్భంలో క్వాడ్ గురించి వివరాలు తెలుసుకుందాం.

ఎలా మొదలైందంటే..

2007 లో అప్పటి జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే నాలుగు దేశాలు సభ్యులుగా ఈ సమావేశాలు నిర్వహించేందుకు క్వాడ్ ని ఏర్పరిచే ప్రయత్నాలు చేశారు. అయితే అప్పట్లో చైనా ఒత్తిడితో ఆస్ట్రేలియా కాస్త వెనుకంజ వేసినా.. అమెరికా చొరవతో నాలుగు దేశాలు 2007లో సమావేశం కొనసాగించాయి. ఇందులో భాగంగా జపాన్ ఆస్ట్రేలియాలు సెక్యూరిటీ కో ఆపరేషన్ దిశగా జాయింట్ డిక్లరేషన్ పై సంతకం చేశాయి. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా ల మధ్య ఎక్సర్ సైజ్ మలబార్ పేరుతో ఉమ్మడి మిలటరీ ఆపరేషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. చైనా మిలిటరీ బలాన్ని, ఆర్థిక వ్యవస్థను తట్టుకునేందుకు నాలుగు దేశాలు కలిసిపోయాయని దాదాపు అన్ని దేశాలు భావించాయి. ఇందులో భాగంగానే భారత్ అమెరికా మిలిటరీ దళాలు ఒకరికొకరు సహకారం అందించుకోవడం ప్రారంభించాయి. అయితే 2008 నుంచి 2015 మధ్యలో భారత్, ఆస్ట్రేలియా దేశాలు ఈ సమితి నుంచి వెనక్కి తగ్గాయి. 2017 సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సమిట్ లో భాగంగా జపాన్, భారత్, ఆస్ట్రేలియా, అమెరికా తిరిగి ఈ క్వాడ్ సదస్సులను నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. ఒకరికొకరు సహకారం అందించుకోవడానికి వీలుగా దీన్ని కొనసాగించాలని సౌత్ చైనా సముద్రంలో చైనా దూకుడును తగ్గించేందుకు ప్రయత్నించాలని నిర్ణయం తీసుకున్నాయి. 2020 వర్చువల్ గా జరిగిన సమావేశంలో భాగంగా ప్రపంచంపై కొవిడ్ 19 ప్రభావం గురించి సభ్య దేశాలు చర్చించాయి. ఇందులో మొదటిసారి న్యూజీలాండ్, వియత్నాం, సౌత్ కొరియా దేశాలు కూడా పాల్గొన్నాయి. ఈ మీటింగ్ కి ముందు ఫిబ్రవరి 18న ఈ నాలుగు దేశాలకు చెందిన మంత్రుల భేటీ వర్చువల్ గా జరిగింది. ఇందులో చైనా చర్యలకు గట్టిగా బదులు చెప్పాలని సభ్య దేశాలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 12న జరగనున్న దేశాధినేతల మీటింగ్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

అలా మొదటిసారి జరగనుంది..

క్వాడ్ కూటమి సదస్సులో భాగంగా శుక్రవారం నాలుగు దేశాధినేతలు వర్చువల్ విధానంలో మీటింగ్ లో పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని యొషిహిడే సుగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ పాల్గొననున్నారు. ఇందులో భాగంగా కరోనా కారణంగా ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు వంటి అంశాలపై చర్చించనున్నారట. కొన్ని ఆర్థికపరమైన ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉంది. చైనాతో ఉన్న సంబంధాల గురించి కూడా చర్చ జరగనుంది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యాక పాల్గొంటున్న తొలి బహుపాక్షిక సమావేశం కావడంతో ఈ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దాంతో పాటు క్వాడ్ కూటమి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ విదేశాంగ మంత్రుల స్థాయిలోనే సమావేశాలు జరిగాయి. ఇప్పుడు తొలిసారి నాలుగు దేశాల అధినేతలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఆసియా పసిఫిక్ రీజియన్ లో శాంతి నెలకొల్పేందుకు చైనాకి గట్టి సమాధానం చెప్పేందుకు ఈ చర్చలను ఉపయోగించుకోనున్నాయి ఈ దేశాలు.

ఉలిక్కిపడిన చైనా

అయితే ఈ మీటింగ్ కొద్ది రోజుల ముందే భారత్ చైనా లు పాంగాంగ్ సరస్సుకి ఉత్తర, దక్షిణ వైపుల్లో బలగాలను రెండు దేశాలు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకోవడం లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కూడా బలగాలను తగ్గించేందుకు నిర్ణయం తీసుకోవడం విశేషం. దీనికి సంబంధించి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయ శంకర్ తో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ లు ఫోన్ లో దాదాపు 75 నిమిషాల పాటు సరిహద్దు ప్రాంత భద్రత గురించి చర్చించారు. భారత్ చైనాలు ఒకరిపై ఒకరు అనుమానాలు వదిలేసి శాంతియుతమైన పరిస్థితులు నెలకొనడంలో ఒకరికొకరు సాయం చేసుకోవాలని, సరిహద్దు సమస్యలను పరిష్కరించుకునేందుకు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ప్రకటన విడుదల చేశారు. సరిహద్దు సమస్య అనేది చరిత్రలో వదిలేయాల్సిన అంశం అని.. భారత్ చైనాల సంబంధాలలో అది ఒక భాగమే తప్ప తమ సంబంధాలను అది పూర్తిగా ప్రభావితం చేయలేదని వెల్లడించడం విశేషం.

మూడేళ్ల క్రితం ఇదే సమావేశాలు జరిగినప్పుడు దాన్ని కేవలం నీటి బుడగలాంటిదని.. వార్తల్లో స్థానం సంపాదించుకోవడానికి జరిగే సమావేశం అని చెప్పిన వాంగ్ యీ ఇప్పుడు ఈ సమావేశాలకు ముందే ఇలాంటి ప్రకటన చేయడం విశేషం. ఈ ప్రకటన ద్వారా సరిహద్దు సమస్యను ముందుంచి మాట్లాడడం కాకుండా అది అన్నింట్లో ఒక అంశంగా పక్కన ఉంచడం ఇరు దేశాలకు మంచిదని, రెండు దేశాలు వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఇంతకుముందులాగే కొనసాగించాలని చెప్పినట్లైంది. భారత్, చైనా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యాపార, వాణిజ్య సంబంధాలు కొనసాగించాలని ప్రపంచం కోరుకుంటుందని.. భారత్ చైనాలు స్నేహితులే కానీ శత్రువులు కాదని ఆయన వెల్లడించారు. రెండు దేశాలు అభివృద్ధిలో ఒకరికొకరు సాయం చేసుకోవాలి కానీ ఒకరినొకరు కూలదోయడానికి ప్రయత్నించకూడదని.. అనుమానాలు పక్కన పెట్టి ఇరు దేశాల తమ సంబధాలు మెరుగుపర్చుకోవడం పై ఫోకస్ చేయాలని చెప్పారు. సరిహద్దు సమస్యను కూడా చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని.. అయితే తమ దేశం సార్వభౌమత్వానికి, హక్కులకు భంగం కలగకుండా చూసుకోవడం తమ బాధ్యత అని ఆయన వెల్లడించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published: