మహమ్మారి కరోనా నుంచి ప్రపంచ దేశాలు కోలుకుంటున్న తరుణంలో మరో వైరస్ కలకలం రేపుతోంది. యూరప్, అమెరికాలో మంకీపాక్స్ (MonkeyPox) కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కాలంలో మొదటి కేసు బ్రిటన్ లో నమోదు అయిన తరువాత ఈ వైరస్ వివిధ దేశాలకు అత్యంత వేగంగా విస్తరిస్తుండడం ఆందోళన రేకిత్తిస్తోంది.
గత వారంలో స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికాలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కూడా ఈ జాబితాలో చేరాయి.
* లక్షణాలు ఇలా: ఈ వైరస్ సోకిన వ్యక్తిలో జ్వరం, శరీరంపై దద్దుర్లు, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవి 2 నుంచి 4 వారాల పాటు ఉంటాయి. మంకీపాక్స్‌లో ప్రధానంగా రెండు జాతులు(స్ట్రెయిన్స్) ఉన్నాయి. ఒకటి కాంగో స్ట్రెయిన్. ఇది కొంత తీవ్రంగా ఉంటుంది. ఈ స్ట్రెయిన్ సోకితే దాదాపు 10 శాతం వరకు మరణాలు సంభవించే అవకాశం ఉంది. మరో స్ట్రెయిన్ పశ్చిమ ఆఫ్రికా.. దీని మరణాల రేటు కేవలం 1 శాతం కంటే ఎక్కువ. ప్రస్తుతం UK లో నమోదు అవుతున్న కేసుల్లో పశ్చిమ ఆఫ్రికా స్ట్రెయిన్ ఉన్నట్లు గుర్తించారు.
* మంకీపాక్స్ పూర్వపరాలు: ఈ వైరస్ మశూచి లాంటిదే. దీన్ని మొదటిసారిగా 1958లో ప్రయోగశాలలోని కోతుల్లో కనుగొనడంతో మంకీపాక్స్ అని పేరు పెట్టారు. మనుషుల్లో ఈ వైరస్ 1970లో గుర్తించారు. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాలకే పరిమితమైన ఈ వైరస్, చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఇటీల బ్రిటన్‌లో నమోదైన తొలి కేసు మూలాలు ఆఫ్రికాలోని నైజీరియాలో ఉన్నాయి. అయితే తాజాగా యూరప్‌లో నమోదు అవుతున్న కేసులకు ఆఫ్రికాతో ఎటువంటి సంబంధం లేకపోవడంతో ఇది ఎలా వ్యాపిస్తుందన్న దానిపై శాస్ర్తవేత్తలకు అంతు చిక్కడం లేదు.
* ఇలా సోకుతుంది: వైరస్ సోకిన జంతువు కరిచినా ఈ వ్యాధి సోకుతుంది. అలాగే మనుషుల నుంచి మనుషులకు ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి రక్తం, చెమటను తాకినా ఇది సోకుతుంది. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన జంతువు మాంసం సరిగా ఉడికించకుండా తిన్నా ఈ వ్యాధి ప్రబలుతుంది. ఉడతలు, ఎలుకల ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది.
కేసులు: బ్రిటన్‌లో ప్రస్తుతం మంకీపాక్స్ పాజిటివ్ కేసుల సంఖ్య 20కి చేరుకోగా, స్పెయిన్‌లో 23, పోర్చుగల్‌లో 5 నమోదు అయ్యాయి. అధిక కేసుల్లో స్వల్ప లక్షణాలు ఉన్నాయని బ్రిటన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
శృంగారం ద్వారా వ్యాప్తి: ప్రస్తుతం ఈ వైరస్ ఎక్కువగా యువకులకు సోకుతోంది. ఆఫ్రికాతో సంబంధం లేని ఓ యువకుడికి ఈ వైరస్ సోకింది. అతను స్వలింగ సంపర్కుడు అని, ఈ నేపథ్యంలో ఇది లైంగికంగా ఒకరి నుంచి మరొకరి సోకుతుందన్న అనుమానాలను యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వ్యక్తం చేసింది. ఆ యువకుడు ఇటీవల మరో పురుషుడితో శృంగారం చేశాడని వెల్లడించింది. స్పెయిన్, పోర్చుగల్‌లో కూడా యువకుల్లోనే ఈ వ్యాధి సోకింది. వారు కూడా ఇతర మగాళ్లతో సెక్స్‌లో పాల్గొన్నారని ఆ దేశాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో శృంగారం ద్వారా ఈ వ్యాధి సోకుతుందన్న అనుమానాలకు ఇది బలం చేకూర్చినట్లయింది. మరోపక్క స్వలింగ సంపర్కం వర్గాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రయాణాల వల్ల : ప్రస్తుతం ప్రపంచ దేశాలు కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో పశ్చిమ, మధ్య ఆఫ్రికా ప్రాంతాలకు ప్రయాణాలు పెరిగాయని, దీంతో మంకీపాక్స్ కేసులు వెలుగు చూడడానికి ఓ కారణం అయ్యే ఉండవచ్చు అని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లో అంతర్జాతీయ ప్రజారోగ్య ప్రొఫెసర్ జిమ్మీ విట్‌వర్త్ అభిప్రాయపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.