మూడున్నర కోట్ల దేవతల్లో త్రిమూర్తులు ఎవరంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని ఠక్కున చెప్పేస్తాం. అయితే పొలిటికల్ సిలబస్ లో మాత్రం త్రిమూర్తులు అంటే ముమ్మాటికీ రాముడు, శివుడు, కృష్ణుడే. బ్రహ్మను పూజించే ఆలయాలు దాదాపు లేవు(చాలా తక్కువ) కాబట్టి ఈక్వేషన్ కచ్చితంగా కుదిరేదే. ఈ ముగ్గురు దేవుళ్లకు సంబంధించిన ప్రఖ్యాత క్షేత్రాలు మూడు ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నాయి. రామజన్మభూమి అయోధ్య.. శంకరుడి కాశీ వారణాసి.. శ్రీకృష్ణ జన్మస్థలం మథుర. హిందూత్వ అజెండాను బాహాటంగా చాటుకునే బీజేపీ గడిచిన ఐదేళ్లలో... త్రిమూర్తులకు సంబంధించి రెండు గొప్ప పనుల్ని పూర్తి చేసింది. మిగిలిన మూడో పనికి అత్యంత తెలివిగా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలను వాడుకుంటోంది. భగవాన్ శ్రీకృష్ణుడి చుట్టూ గడిచిన కొద్ది రోజులుగా యూపీలో అనూహ్య రాజకీయ తంత్రం నడుస్తోంది. నిజానికి అది చాలా ఆసక్తికరంగానూ ఉంది..
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామజన్మభూమిగా భావించే చోటనే.. సుదీర్ఘ ఎదురుచూపుల అనంతరం భవ్యరామమందిర నిర్మాణం కల సాకారమైంది. ఆలయ నిర్మాణానికి అవసరమైన పనులు చకచకా సాగుతున్నాయి. అదే యూపీలో పరమశివుడు కొలువైన పవిత్రనగరం కాశీలో విశ్వనాథ్ (ధామ్) కారిడార్ పేరుతో బీజేపీ సర్కార్ భారీ ఆధునీకరణ పనులు చేసి, ఇటీవలే ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరణ చూడా చేసింది. ఇక తదుపరి వంతు త్రిమూర్తుల్లో చివరివాడైన శ్రీకృష్ణుడిదేనని అందరూ ఊహించిందే. ‘అయోధ్యలో రామమందిరం, కాశీలో విశ్వనాథ ధామం నిర్మించిన మేము(బీజేపీ) మథురలో శ్రీకృష్ణుణ్ని విస్మరిస్తామా?’అన్న యోగి ఆదిత్యనాథ్ మాటలు తదుపరి రాజకీయ అవసరానికి అద్దంపట్టేవే. ఈ క్రమంలో భగవాన్ శ్రీకృష్ణుడు ఈ మధ్య యూపీ రాజకీయ నేతలకు వరుసగా ప్రత్యక్షమవుతుండటం విషయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది.
యూపీలో ఇప్పుడు శ్రీకృష్ణుడి చుట్టూ పెద్ద రాజకీయ తంత్రం నడుస్తోంది. యాదవుడైన శ్రీకృష్ణుడి వారసులుగా చెప్పుకునే యావవుల నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి, యదుకుమారుడికి గొప్ప గుడి నిర్మిస్తామంటోన్న బీజేపీకి మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ స్వస్థలమైన మెయిన్పురి జిల్లాకే చెందిన మరో యాదవ నేత, ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ ఎంపీ హర్‌నాథ్ సింగ్ యాదవ్ వ్యాఖ్యలతో యూపీ ఎన్నికల పోరులోకి శ్రీకృష్ణుడి పాత్రకు ప్రాధాన్యం పెరిగింది. ఇటీవల ఎంపీ హర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు కలలో భగవాన్ శ్రీకృష్ణుడు కనిపించాడని.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఈసారి మథుర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా ఉపదేశించాడని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే చర్చకు ఎంపీ హరనాథ్ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. కాగా..
బీజేపీ ఎంపీకి భగవాన్ శ్రీకృష్ణుడు కలలో కనిపించి, సీఎం యోగిని మథుర నుంచి పోటీ చేయమన్నారనే వ్యవహారంపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. భగవాన్ శ్రీకృష్ణుడు తనకు కూడా రోజూ కలలో కనిపిస్తాడని.. ఈసారి మథుర అసెంబ్లీ సీటులో ఎస్పీనే గెలుస్తుందనీ ఆశీర్వదించారని అఖిలేశ్ వ్యాఖ్యానించారు. యూపీలో రామరాజ్య స్థాపన కోసం ఈసారి ఎస్పీ అధికారాన్ని సాధించబోతోందనీ అఖిలేశ్ అన్నారు. ఈ మాటల యుద్దాన్ని పొడగిస్తూ తాజాగా సీఎం యోగి.. అఖిలేశ్ కు దిమ్మతిరిగే కౌంటరిచ్చారు. ‘అయ్యో అఖిలేశ్.. భగవంతుడి మాటలు నీకు వరంలా అనిపించాయా? నిజానికి శ్రీకృష్ణుడు మిమ్మల్ని శపించాడు. అసలు మీరు(ఎస్పీ) అధికారంలో ఉన్నప్పుడు మథుర, బృందావన్, బెనారస్, గోకులం గురించి ఎందుకు పట్టించుకోలేదనీ కృష్ణుడు నిలదీయాల్సింది..’ అని యోగి పంచ్ వేశారు.
ఎన్నికల వేళ శ్రీకృష్ణుడిపై సంవాదం ద్వారా మథుర సీటులో యోగి పోటీని బీజేపీ తెలివిగా తెరపైకి తీసుకొచ్చింది. అయితే శ్రీకృష్ణుడి వారసులమని భావించే యాదవుల ఓట్లను ఆ దేవుడి పేరుతోనే బీజేపీ చీల్చగలదా? అనేది కీలక అంశమవుతుంది. పశ్చిమ యూపీలో మెజార్టీ సాధనకు మథురను కేంద్రంగా మార్చుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. కానీ వర్తమాన చరిత్రలో మాత్రం మథుర స్థానంలో బీజేపీ సవాళ్లు ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన మథుర స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 33 సీట్లకుగానూ బీజేపీకి కేవలం 8స్థానాలే దక్కాయి. అదీగాక
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతుల్లో జాట్ వర్గీయుల తర్వాత యాదవుల సంఖ్యా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండటం, వీరంతా యూపీ పంచాయితీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేయడం కమలదళాన్ని కలవరపెట్టే అంశం. అలాగనీ మథుర యాదవుల పార్టీ ఎస్పీకీ కంచుకోటేమీ కాదు కదా, కనీసం ఒక్కసారి కూడా గెలవలేదక్కడ. ముస్లింల ఓట్లు గణనీయంగా ఉండే మథుర అసెంబ్లీ స్థానంలో 9సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా, ఐదు సార్లు బీజేపీ, జనతా పార్టీ, స్వతంత్ర అభ్యర్థి చెరోసారి గెలుపొందారు. యూపీ స్థానిక పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ ఇప్పటిదాకా మథుర సీటులో బోణీ కొట్టలేదు. మథురను అయోధ్య, కాశీ స్థాయిలో మతపరమైన పర్యాటక కేంద్రంగా మలచడం, అదే సమయంలో యోగి ఆదిత్యనాథ్ ను ఇంకాస్త పెద్ద నాయకుడిగా అవతరింపజేయడం ద్వారా ప్రత్యర్థులకు మాస్టర్ స్ట్రోక్ సిద్దం చేస్తోంది బీజేపీ. మరి శ్రీకృష్ణుడు ఆయా నేతలకు కలలో చెప్పిన విషయాల్లో ఏది నిజమవుతుందో ఎన్నికల తర్వాతే తేలుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhilesh Yadav, Bjp, Samajwadi Party, UP Assembly Elections 2022, Yogi adityanath