మానవ శరీరంలోని కాలేయంలో తయారయ్యే కొలెస్ట్రాల్ శరీర అవసరాలకు ఉపయోగపడుతుంది. కొన్ని రకాల ఆహార పదార్థాల నుంచి కూడా ఇది శరీరానికి అందుతుంది. కొలెస్ట్రాల్‌లో హై- డెన్సిటీ లిపోప్రొటీన్ (HDL), లో-డెన్సిటీ లిపోప్రొటీన్ (LDL) అనే రెండు రకాలు ఉంటాయి. లిపోప్రొటీన్లు కొవ్వు, ప్రోటీన్ల సమ్మేళనంగా ఏర్పడతాయి. లిపిడ్లు ప్రోటీన్లతో కలిసి రక్తం ద్వారా శరీర భాగాలు, కణాలకు చేరుకుంటాయి. వీటిలో HDLను గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఇది మానవ కాలేయానికి కొలెస్ట్రాల్‌ను రవాణా చేస్తుంది. ఇది శరీర జీవక్రియలకు ఎంతో ఉపయోగపడుతుంది. అధిక HDL స్థాయిలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది తక్కువగా ఉంటే గుండె జబ్బుల ప్రమాదం పెరగవచ్చు.
HDL కొలెస్ట్రాల్‌ను ఎందుకు మంచి కొలెస్ట్రాల్ అంటారు?
HDL అనేది అధిక సాంద్రత ఉండే లిపోప్రొటీన్. ఇతర రకాల కొలెస్ట్రాల్ కణాలతో పోలిస్తే HDL కొలెస్ట్రాల్ కణం దట్టంగా ఉంటుంది, కాబట్టి దీనిని అధిక సాంద్రత అంటారు. సాధారణంగా కొలెస్ట్రాల్ అంటే అది అనారోగ్యకరమైనదని చాలామంది భావిస్తారు. ఈ వాదన నిజం కాదు. నిజానికి కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన కొవ్వు. ఇది మానవ శరీరంలోని ప్రతి కణానికి స్థిరత్వాన్ని అందిస్తుంది. కొలెస్ట్రాల్‌ను లిపోప్రొటీన్లు అని పిలిచే సహాయక అణువులు రక్తం ద్వారా రవాణా చేస్తాయి. ప్రతి లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్‌కు ప్రాధాన్యం ఉంటుంది. HDL కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించగలదని నిపుణులు భావిస్తున్నారు.
HDL కొలెస్ట్రాల్ శరీరం నుంచి LDL కొలెస్ట్రాల్‌ను (చెడు కొలెస్ట్రాల్) తొలగిస్తుంది. HDL కొలెస్ట్రాల్.. LDL కొలెస్ట్రాల్‌ను కాలేయానికి రవాణా చేస్తుంది. అక్కడ అది రీ ప్రాసెస్ అవుతుంది. ఇలా చెడు కొలెస్ట్రాల్‌ను HDL కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, పునర్వినియోగిస్తుంది, రీసైకిల్ చేస్తుంది. HDL కొలెస్ట్రాల్ రక్తనాళాల లోపలి గోడల్లో (ఎండోథెలియం) పనులను పర్యవేక్షించే సిబ్బందిగా పనిచేస్తుంది. గుండెపోటు, స్ట్రోక్‌లకు కారణమయ్యే అథెరోస్క్లెరోసిస్ ప్రక్రియలో రక్త నాళాల లోపలి గోడలకు నష్టం కలగడం మొదటి దశ. HDL కొలెస్ట్రాల్ ఈ గోడలను శుభ్రపరుస్తుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
HDL కొలెస్ట్రాల్ స్థాయి ఎలా ఉండాలి?
కొలెస్ట్రాల్ టెస్ట్ లేదా లిపిడ్ ప్యానెల్.. HDL కొలెస్ట్రాల్ స్థాయిని తెలియజేస్తుంది. సాధారణంగా HDL కొలెస్ట్రాల్ లెవల్స్ డెసిలీటర్‌కు 60 మిల్లీగ్రాముల కంటే (mg/dL) ఎక్కువగా ఉండటం మంచిది. HDL కొలెస్ట్రాల్ స్థాయిలు 40 mg/dL కంటే తక్కువగా ఉండటం మంచిది కాదు. అయితే HDL ఎక్కువగా ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. తక్కువ HDL ఉన్న వ్యక్తులకు గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అయితే ఒక వ్యక్తి శరీరంలో HDL ఎంత ఎక్కువగా ఉండాలి అనేది వారి వయసు, లింగంపై ఆధారపడి ఉంటుంది. 19 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు ఉన్న వారికి HDL కొలెస్ట్రాల్ 45mg/dl కంటే ఎక్కువగా ఉండాలి. 20 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులకు ఇది 40mg/dl కంటే ఎక్కువగా ఉండాలి. 20 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలకు 50mg/dl కంటే ఎక్కువ HDL కొలెస్ట్రాల్ ఉండాలి.
HDL కొలెస్ట్రాల్ లెవల్ తక్కువగా ఉంటే ఏం చేయాలి?
ఒక వ్యక్తి శరీరంలో HDL కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటే, దీన్ని పెంచుకుంటూ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటంటే..
ఆరోగ్యకరమైన ఆహారం
మీ శరీరంలో HDL కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి చెడు కొవ్వులకు బదులుగా మంచి కొవ్వులు ఉండే ఆహారం తినాలి. శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే వెన్న తీయని పాలు, చీజ్, మాంసం వంటివి పరిమితంగా తీసుకోవాలి. దీంతోపాటు ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఫ్రైడ్ ఫుడ్స్, బేక్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకపోవడం మంచిది. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారాన్ని తగ్గించాలి. కృత్రిమ చక్కెర, ఉప్పు శాతం ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్, కూల్‌డ్రింక్స్ మానేయాలి. నేచురల్ ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్ మీల్, బీన్స్ వంటివి ఎక్కువగా తినాలి.
వ్యాయామం
వారంలో కనీసం ఐదు రోజులు 30 నుంచి 60 నిమిషాల పాటు చేసే ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌లు HDL కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
ఆల్కహాల్ వినియోగం తగ్గించాలి
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చు. దీంతో HDL లెవల్ తగ్గుతుంది. అందువల్ల ఆల్కహాల్ వినియోగాన్ని సాధ్యమైనంత తగ్గించాలి. వీలైతే ఈ అలవాటును పూర్తిగా మానేయాలి.
పొగతాగడం మానేయాలి
పొగాకు పొగ HDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. స్మోకింగ్ మానేస్తే HDL స్థాయి పెరుగుతుంది.
ఆరోగ్యకరమైన బరువు
హెల్దీ వెయిట్ మేనేజ్‌మెంట్ HDL స్థాయిలను మెరుగుపరచడంతో పాటు గుండె జబ్బులు, ఇతర అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మంచి కొలెస్ట్రాల్ గుండె జబ్బులను పూర్తిగా దూరం చేస్తుందా?
కొలెస్ట్రాల్‌తో పాటు అనేక అంశాలు గుండె జబ్బులకు కారణమవుతాయి. మధుమేహం, పొగ తాగడం, అధిక రక్తపోటు, ఊబకాయం, జన్యువులు కూడా ఇందుకు దోహదం చేస్తాయి. అంటే గుండె జబ్బులకు ఒకటి, అంతకంటే ఎక్కువ కారణాలు ఉండవచ్చు. కాబట్టి HDL కొలెస్ట్రాల్ సాధారణ స్థాయిలో ఉన్నవారికి కూడా గుండె జబ్బులు రావచ్చు. ఇదే సమయంలో HDL తక్కువగా ఉన్న వ్యక్తుల గుండె పనితీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే HDL స్థాయిలు ఎక్కువగా ఉన్న వ్యక్తుల కంటే HDL కొలెస్ట్రాల్ లెవల్ తక్కువగా ఉన్న వారికి గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఈ అలవాట్లతో ప్రయోజనం
సాధారణంగా ప్రతి ఒక్కరూ ఐదేళ్లకు ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అసాధారణమైన లిపిడ్ ప్యానెల్స్ ఉన్న వ్యక్తులు లేదా ఇతర ప్రమాద కారకాలు ఉన్నవారు వైద్యుల సలహాతో తరచుగా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి. HDL స్థాయిలో హెచ్చుతగ్గులు ఉంటే, సరిగ్గా తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, స్మోకింగ్ మానేయడం వంటివి అనుసరించాలి. ఈ విషయంలో జీవనశైలి మార్పులు మంచి ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి చర్యలన్నీ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరచడానికి డాక్టర్లు మందులను సిఫారసు చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips