Home /News /explained /

WHAT IS GENDER SELF IDENTIFICATION CAN ANYONE CHANGE THEIR GENDER HERE IS THE THINGS YOU SHOULD KNOW GH SK

Explained: లింగమార్పిడిని ఎవరికి వారే ప్రకటించుకోవచ్చా? జెండర్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒక వ్యక్తి తమకు నచ్చిన లింగంతో చట్టబద్ధంగా గుర్తింపు పొందాలనేది సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ లేదా సెల్ఫ్ ఐడీ ముఖ్య ఉద్దేశం. ఎవరైనా ఇలా ప్రకటించుకోవడానికి ఎలాంటి వైద్య పరీక్షలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండకూడదనేది ట్రాన్స్ కమ్యూనిటీల డిమాండ్.

ఇంకా చదవండి ...
స్పెయిన్‌ గత వారం ప్రతిపాదించిన ఒక కొత్త చట్టం ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్ కమ్యూనిటీపై చర్చలకు కారణమవుతోంది. 14 ఏళ్లు పైబడిన వారు వైద్య నిర్ధారణ లేదా హార్మోన్ చికిత్స లేకుండా.. తమ లింగాన్ని (sex) చట్టబద్ధంగా మార్చుకునేందుకు అనుమతించే బిల్లు ముసాయిదాను స్పానిష్ ప్రభుత్వం గత వారం ఆమోదించింది. ఆ దేశ క్యాబినేట్‌లోని సమానత్వ మంత్రిత్వ శాఖ (Equality Ministry) ఈ వివరాలను వెల్లడించింది. ప్రజాభిప్రాయ సేకరణ తరువాత రెండోసారి మంత్రివర్గంలో దీనిపై చర్చిస్తారు. అనంతరం బిల్లు చట్టంగా మారాలంటే, దాన్ని స్పానిష్ పార్లమెంటు దిగువ సభ ఆమోదించాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకు అధికారిక రికార్డుల్లో ఎవరైనా తమ లింగాన్ని మార్చుకోవడానికి వేరే నిబంధనలు ఉన్నాయి. ఇలాంటి వారు చట్ట ప్రకారం.. రెండు సంవత్సరాల పాటు హార్మోన్ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మానసిక ఆరోగ్య విశ్లేషణ (psychological evaluation) సైతం అవసరం. తాజాగా ప్రతిపాదించిన చట్టం.. 14 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ రెండు నిబంధనలను తొలగిస్తుంది. అయితే 14 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దీనిపై నిర్ణయం తీసుకోవడానికి తల్లిదండ్రుల అనుమతి అవసరం. స్పానిష్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లుపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఈ విషయంపై ఎలాంటి వాదనలు ఉన్నాయి, రికార్డుల్లో లింగం వివరాలను మార్చుకునేందుకు ఎలాంటి చట్టాలు అనుమతిస్తున్నాయి.. వంటి వివరాలు తెలుసుకుందాం.

* స్వీయ లింగ గుర్తింపు లేదా జెండర్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి?
ఒక వ్యక్తి తమకు నచ్చిన లింగంతో చట్టబద్ధంగా గుర్తింపు పొందాలనేది సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ లేదా సెల్ఫ్ ఐడీ ముఖ్య ఉద్దేశం. ఎవరైనా ఇలా ప్రకటించుకోవడానికి ఎలాంటి వైద్య పరీక్షలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండకూడదనేది ట్రాన్స్ కమ్యూనిటీల డిమాండ్. లింగ మార్పిడి చేయించుకునేవారు, ఇతర ట్రాన్స్ కమ్యూనిటీలపై ప్రపంచ వ్యాప్తంగా వివక్ష ఉంది. అందువల్ల భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్ కమ్యూనిటీ హక్కుల బృందాలు సెల్ఫ్ ఐడీ డిక్లరేషన్ కోసం డిమాండ్ చేస్తున్నాయి.

ఈ విషయంపై యూరప్‌లోని ఉదారవాద-సాంప్రదాయ విధానాలు పాటించే వారు, LGBT కమ్యూనిటీలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజలు తమకు ఇష్టమైన లింగపరమైన గుర్తింపును నిర్ధారించుకునేందుకు ప్రస్తుతం ఉన్న పద్ధతి సుదీర్ఘమైనదని, ఖరీదైనదని, అవమానకరమైనవని కొందరు వాదిస్తున్నారు. వీరు కొత్త బిల్లును స్వాగతిస్తున్నారు. కొన్ని ఫెమినిస్ట్, స్వలింగ-హక్కుల (gay-rights) గ్రూపులు మాత్రం.. కొత్త చట్టం మహిళలకు ప్రమాదకారిగా మరే అవకాశం ఉందంటున్నాయి. స్వలింగ సంపర్కులైన యువకులను ట్రాన్స్ జెండర్‌గా మార్చేందుకు ఈ నిబంధనలు ప్రోత్సహిస్తున్నాయనే వాదన వినిపిస్తున్నాయి.

వ్యక్తుల లింగం అనేది ఎవరికి వారు సొంతంగా ఎంపిక చేసుకునేది కాదని నమ్మే ఫెమినిస్ట్ ఫోరమ్‌లు.. సెల్ఫ్ ఐడెంటిఫికేషన్‌కు అనుమతించడం వల్ల మహిళలపై వివక్షను నిరోధించే చట్టాలు ప్రమాదంలో పడతాయని వాదిస్తున్నారు. దీనికి బదులుగా మహిళపై సమాజంలో కొనసాగుతున్న జెండర్ పే గ్యాప్ వంటి వివక్షను రూపుమాపే చట్టాలు చేయాలని వారు కోరుతున్నారు. అయితే స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ మాత్రం మహిళల హక్కులకు, ట్రాన్స్ గ్రూపుల భద్రతకు విలువ ఇచ్చే ధోరణి ప్రదర్శిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

* సెల్ఫ్ ఐడీకి చట్టబద్ధత కల్పించిన దేశాలేవి?
సెల్ఫ్ ఐడీకి చట్టబద్ధత కల్పించిన దేశాల వివరాలను ట్రాన్స్ కమ్యూనిటీ బృందాలకు న్యాయపరమైన సహాయం చేసే ILGA (ఇంటర్నేషనల్ లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ అండ్ ఇంటర్‌సెక్స్ అసోసియేషన్) సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాలు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్‌కు చట్టబద్ధత కల్పించాయి. డెన్మార్క్, పోర్చుగల్, నార్వే, మాల్టా, అర్జెంటీనా, ఐర్లాండ్, లక్సెంబర్గ్, గ్రీస్, కోస్టారికా, మెక్సికోలోని మెక్సికో సిటీ, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, ఉరుగ్వే... వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. డెన్మార్క్‌లో లింగ మార్పును అధికారికంగా గుర్తించడానికి ఆరు నెలల సమయం పడుతుంది. పోర్చుగల్‌లో ఒకసారి లింగపరమైన గుర్తింపును మార్చుకున్న వ్యక్తులు.. రెండోసారి జెండర్‌ను మార్చుకునేందుకు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా సెల్ఫ్ ఐడీపై ఒక్కో దేశంలో ఒక్కో రకమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. అయితే ఇటలీ, జర్మనీ, హంగేరీ వంటి ఇతర దేశాలు మాత్రం సెల్ఫ్ ఐడీని నిషేధించాయి.

* భారత్‌లో ట్రాన్స్ కమ్యూనిటీ హక్కులకు రక్షణ ఉందా?
భారతదేశంలో లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తుల హక్కులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా చట్టం అమల్లో ఉంది. లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టం-2019, లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) నిబంధనలు-2020 ద్వారా ట్రాన్స్ జెండర్ల హక్కులను నిర్వచించారు. ప్రస్తుతం మన దేశంలో ఎవరైనా తమ జెండర్‌ను డిక్లేర్ చేయడానికి, తాము మారిన జెండర్‌కు అధికారికంగా గుర్తింపు పొందడానికి.. జిల్లా మేజిస్ట్రేట్‌కు ఒక దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల తరపున దీనికి సంబంధించిన దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రాన్స్ జెండర్లు తమ లింగాన్ని అధికారికంగా ప్రకటించుకునేందుకు గతంలో ఉద్దేశించిన నియమ నిబంధనలు వివాదాస్పదంగా ఉన్నాయి. లింగమార్పిడి చేయించుకున్న వారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలనే నిబంధన గతంలో ఉండేది. అయితే కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ఈ నిబంధనను తొలగించారు.

జిల్లా మేజిస్ట్రేట్ సదరు దరఖాస్తుదారుడి వివరాలను పరిశీలించి, ఎలాంటి వైద్య లేదా శారీరక పరీక్ష లేకుండా, వారు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా దరఖాస్తును ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అనంతరం దరఖాస్తుదారునికి ఒక గుర్తింపు సంఖ్యను సైతం జారీ చేస్తారు. ధ్రువీకరణ ప్రక్రియలో ఈ నెంబర్‌ను అప్లికేషన్ ప్రూఫ్‌గా వాడుకోవచ్చు. ట్రాన్స్ జెండర్ల హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించడానికి రాష్ట్రాలు సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలని కొత్త నిబంధనల్లో ఉంది. కేంద్రం రూపొందించిన సంక్షేమ పథకాల ఫలాలు వారికి అందేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సైతం నిబంధనలు చెబుతున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: International, International news, Life Style, Transgender

తదుపరి వార్తలు