Home /News /explained /

WHAT IS COPYRIGHT HOW DOES PROTECT COPYRIGHT HOLDERS WORK HERE IS ANSWERS FOR ALL YOUR DOUBTS ON COPYRIGHTS SK GH

Copyright: కాపీరైట్ అంటే ఏంటి? చట్టం ఎలాంటి రక్షణ కల్పిస్తుంది? తప్పక తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం (Image:Vector stock)

ప్రతీకాత్మక చిత్రం (Image:Vector stock)

ఒక రచనను మళ్లీ సృష్టించడానికి, దాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించడానికి, ట్రాన్స్‌లేషన్ చేయడానికి, వేరే అవసరాలకు వాడుకోవడానికి సంబంధించిన హక్కులన్నీ యజమానికి మాత్రమే ఉండేలా కాపీరైట్ రక్షణ కల్పిస్తుంది.

కాపీరైట్ అనేది ఒక రచయిత లేదా యజమానికి చట్టం కల్పించిన హక్కుల జాబితా. ఒక రచనపై దాన్ని రచించిన లేదా సృష్టించిన వ్యక్తికే సర్వ అధికారాలు ఉంటాయి. దాన్ని ప్రింట్ చేయడం, పంపిణీ చేయడం, ఇతర అవసరాలకు వాడుకోవడం వంటి అధికారాలన్నీ చట్టప్రకారం యజమానికే ఉండేలా కాపీరైట్ ప్రత్యేక హక్కును కల్పిస్తుంది. సాహిత్యం, నాటక రంగం, సంగీతం, కళాత్మక రచనలు, సినిమాటోగ్రాఫిక్ ఫిల్మ్, సౌండ్ రికార్డింగ్‌.. వంటి విభాగాలకు కాపీరైట్ వర్తిస్తుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా చట్టం సైతం అమల్లో ఉంది.

కాపీరైట్ ప్రాధాన్యం ఏంటి?
ఒక రచనను మళ్లీ సృష్టించడానికి, దాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించడానికి, ట్రాన్స్‌లేషన్ చేయడానికి, వేరే అవసరాలకు వాడుకోవడానికి సంబంధించిన హక్కులన్నీ యజమానికి మాత్రమే ఉండేలా కాపీరైట్ రక్షణ కల్పిస్తుంది. దీని ద్వారా యజమానులు వారి కష్టార్జితం (ఒరిజినల్ వర్క్) దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు. నియమాల ఉల్లంఘన జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. వాటి ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని పొందే హక్కు యజమానికి మాత్రమే ఉంటుంది. చట్టం కల్పించిన ఈ హక్కు ద్వారా యజమానులు వారి సృజనాత్మకతకు సంబంధించిన ప్రయోజనాలను, వాటికి రక్షణను పొందవచ్చు. దీంతోపాటు వారి సృజనాత్మకతకు పదును పెట్టుకోవడానికి సమాజం నుంచి ప్రోత్సాహం సైతం పొందవచ్చు.

 కాపీరైట్ ఉల్లంఘన అంటే?
ఒరిజినల్ వర్క్‌కు సంబంధించిన అన్ని హక్కులు దాని రచయిత లేదా సృష్టికర్తకు మాత్రమే ఉంటాయి. సంబంధిత రచయిత లేదా సృష్టికర్త మాత్రమే దీని ద్వారా లభించే అన్ని ప్రయోజనాలు పొందే హక్కు ఉంటుంది. ఆ ఒరిజినల్ వర్క్‌ను అమ్ముకోవడం లేదా ఇతరులు వినియోగించుకునేందుకు లైసెన్స్ ఇవ్వడానికి వారికి మాత్రమే ఏకైక అధికారం ఉంటుంది. వారి అనుమతి లేకుండా ఎవరైనా కాపీరైట్ హోల్డర్ ఒరిజినల్ వర్క్‌ను దొంగతనంగా ఉపయోగించినప్పుడు కాపీరైట్ ఉల్లంఘన జరిగిందని భావిస్తారు.

ఏ చట్టం రక్షణ కల్పిస్తుంది?
కాపీరైట్ చట్టం-1957 ద్వారా ఒరిజినల్ వర్క్‌ సృష్టి కర్తలకు యాజమాన్య హక్కు లభిస్తుంది. అంటే సాహిత్యం, నాటక రంగం, సంగీతం, కళాత్మక రచనలు, సినిమాటోగ్రాఫ్ ఫిల్మ్స్, సౌండ్ రికార్డింగ్‌లను అనధికారంగా ఉపయోగించకుండా ఈ చట్టం రక్షిస్తుంది.

ఉద్యోగంలో భాగంగా చేసే రచనకు అసలు యజమాని ఎవరు? ఈ సందర్భంలో ఉద్యోగం ఇచ్చిన సంస్థ యజమానిగా ఉంటుందా?
సర్వీస్ అగ్రిమెంట్ లేదా అప్రెంటిస్‌షిప్ కింద రచయిత ఒకరి కింద ఉద్యోగం చేసేటప్పుడు.. తాను చేసిన పని లేదా రచన (ఒరిజినల్ వర్క్‌)పై పూర్తి హక్కులు ఉద్యోగం ఇచ్చిన సంస్థ లేదా వ్యక్తులకే ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ముందుగానే ఏదైనా ఒప్పదం ఉంటే మాత్రం.. రచనలు చేసేవారికే ఒరిజినల్ వర్క్‌పై పూర్తి హక్కులు ఉంటాయి.

 కాపీరైట్‌ను ఇతరులకు కేటాయించవచ్చా?
చట్టప్రకారం యజమానులు తమ కాపీరైట్‌ను ఇతరులను ఇచ్చే అవకాశం ఉంది. కాపీరైట్‌ను పూర్తిగా లేదా పాక్షికంగా ఇతరులకు కేటాయించవచ్చు. పరిమితులకు లోబడి కాపీరైట్‌ను, అది అమల్లో ఉండే మొత్తం కాలానికి లేదా కొంత కాలానికి ఇతరులకు ఇవ్వడానికి వీలు ఉంటుంది.

కాపీరైట్ గడువు అంటే ఏంటి? ఇది ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది?
రచయిత లేదా యజమానికి కాపీరైట్ రక్షణను పరిమిత కాలానికి ఇస్తారు. సాధారణంగా వారు జీవించి ఉన్న రోజులకు అదనంగా 60 సంవత్సరాల వరకు కాపీరైట్ టర్మ్ ఉంటుంది. అంటే అసలు యజమానులు ప్రాణాలు కోల్పోయిన తరువాత, అదనంగా 60 సంవత్సరాల వరకు మాత్రమే కాపీరైట్ అమల్లో ఉంటుంది. అప్పటి వరకు దానిపై పూర్తి హక్కులను యజమానుల వారసులు పొందవచ్చు.

కాపీరైట్ ఉల్లంఘలకు మినహాయింపులు ఉన్నాయా?
కాపీరైట్ చట్టం, 1957లోని సెక్షన్ 52 ప్రకారం.. కాపీరైట్ ఉల్లంఘనల నుంచి కొన్నింటికి మినహాయింపులు ఉన్నాయి. పరిశోధన కోసం లేదా ఇతర వ్యక్తిగత, ప్రైవేటు అవసరాల కోసం రచనలు ఉపయోగించడం.. దానిపై విమర్శలు లేదా సమీక్షలు రాయడం వంటివి కాపీరైట్ ఉల్లంఘనల కిందకి రావు.

కాపీరైట్ చట్టం, 1957 ప్రకారం.. కాపీరైట్ హోల్డర్‌కి ఎలాంటి చట్టపరమైన రక్షణలు లభిస్తాయి?
కాపీరైట్ ఉల్లంఘన జరిగినప్పుడు.. యజమాని ఇంజెక్షన్, డ్యామేజీలు, ఇతర సివిల్ రెమిడీలను చట్టపరంగా పొందవచ్చు. ఇలాంటి కేసుల అధికార పరిధి దావా వేసే వ్యక్తి నివసించే జిల్లాకు మాత్రమే పరిమితం. అంటే సంబంధిత వ్యక్తులు నివసిస్తున్న జిల్లాలోని డిస్ట్రిక్ కోర్టులోనే వివాదాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Copyright

తదుపరి వార్తలు